.
గుళ్లు, హిందూ దేవుళ్ల మీద సీపీఎం ఎంత విషాన్ని, ద్వేషాన్ని గుమ్మరిస్తుందో తెలిసిందే కదా… ఏకంగా శబరిమలలో కిలోల కొద్దీ బంగారం మాయం చేయడం మీద ఇప్పుడు కేరళలో రాజకీయ కలకలం పెరిగిపోతోంది…
వివరాల్లోకి వెళ్దాం… కొన్ని నిజాలతో నివ్వెరపోకతప్పదు… కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయంలోని విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం అదృశ్యం కావడంపై కేరళ హైకోర్టు ఆదేశించిన విస్తృత దర్యాప్తు ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామంతో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వం, ముఖ్యంగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) తీవ్ర ఇరకాటంలో పడింది…
Ads
హైకోర్టు ఆగ్రహం, దర్యాప్తు ఆదేశాలు …. ఆలయ విజిలెన్స్ అధికారి నివేదిక ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించిన హైకోర్టు, TDB అనుసరించిన వైఖరిని “అసాధారణ, నిర్లక్ష్య” విధానంగా తీవ్రంగా విమర్శించింది.
2019లో ఆలయ గర్భగుడి (శ్రీ కోవిల్) ద్వారపాలక విగ్రహాల బంగారు పూత కోసం బయటకు తీసిన తరువాత సుమారు 4 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని ఆ నివేదిక వెల్లడించింది… విలువైన వస్తువులన్నింటిపై జాబితా సిద్ధం చేయాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తిని కోర్టు నియమించింది…
2025లో కూడా కోర్టుకు తెలియకుండానే అదే విగ్రహాలను బంగారు పూత కోసం మళ్లీ బయటకు పంపారని హైకోర్టు గుర్తించింది…
ప్రతిపక్షాల ఫైర్: దోచుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు…. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటూ పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి…
ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ (కాంగ్రెస్) “భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం, విలువైన వస్తువులను TDB, దాని మధ్యవర్తులు దోచుకున్నారు… ఆలయాన్ని దోచుకున్న వారిని TDB ఇప్పుడు కాపాడుతోంది” అని తీవ్రంగా విమర్శించాడు…
మాజీ కేంద్ర మంత్రి వి. మురళీధరన్ (బీజేపీ) “దేశంలో మరే దేవాలయంలోనూ ఇంత సంపద దోపిడీకి గురికాలేదు. దేవస్వం మంత్రులు, TDB అధ్యక్షులు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశాడు…
CPMలో చిచ్చు: నేతల మధ్య ఆరోపణలు… ఈ వివాదం సీపీఎంలో అంతర్గత కుమ్ములాటకు దారితీసింది… TDB మాజీ అధ్యక్షులు కె. ఆనందగోపన్, ఎ. పద్మకుమార్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు…
2017-19 మధ్య బోర్డు అధ్యక్షుడిగా ఉన్న పద్మకుమార్ “శబరిమలలో ప్రతిదీ మాన్యువల్స్ ప్రకారమే జరుగుతుందా? కొంతమంది మాజీ TDB అధ్యక్షులు చేసిన విదేశీ పర్యటనలను ఎవరు స్పాన్సర్ చేశారు? అన్నిటినీ దర్యాప్తు చేయాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించాడు…
సీనియర్ సీపీఎం నాయకుడు, మాజీ దేవస్వం మంత్రి జి. సుధాకరన్ సైతం ప్రస్తుత TDB పరిపాలనను విమర్శించాడు… “నా పదవీకాలంలో ఎవరూ బంగారు పలకలను బయటకు తీసుకెళ్లలేదు… రాజకీయ రక్షణ కారణంగా అయ్యప్ప ఆలయంలో సురక్షితంగా ఉన్నాడు… లేకుంటే ఆయన విగ్రహం కూడా తీసుకెళ్ళి ఉండేవారు” అని ఎద్దేవా చేశాడు…
కీలక మలుపు: స్పాన్సర్ పొట్టి ప్రకటన… బంగారు తాపడం స్పాన్సర్ ఉన్నికృష్ణన్ పొట్టి ఈ వివాదానికి మరో మలుపు తిప్పారు… తాను TDBకి ఇచ్చింది రాగి రేకులు మాత్రమేనని, వాటికి బంగారు పూత పూసిన విషయం వివాదం బయటకు వచ్చాకే తెలిసిందని పొట్టి ప్రకటించారు… ఆలయ అధికారులు తనకు ఇచ్చిన పత్రాల్లో కూడా అది రాగిగానే ఉందని తెలిపారు…
బంగారం మాయం కావడంతోనే రికార్డుల్లో రాగిగా నమోదు చేసి ఉండొచ్చని, బంగారు పూత ప్రక్రియలో నిజంగా బంగారం ఉంటే కరిగిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు… అయితే, గత వారం పొట్టి సోదరి ఇంట్లో స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన బంగారు పూత పూసిన విగ్రహాల అదనపు సెట్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం…
ఈ వ్యవహారం కేరళలోని LDF ప్రభుత్వానికి, ముఖ్యంగా 2018 రుతు మహిళల ప్రవేశం వివాదం తర్వాత మరోసారి శబరిమల అంశంలో రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది… కోర్టు దర్యాప్తుతో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి… థాంక్ గాడ్, సీపీఎం నాయకుడే చెప్పినట్టు… అయ్యప్ప విగ్రహం మాత్రం అలాగే ఉంచేశారు..!!
Share this Article