Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)

January 28, 2023 by M S R

మంథర

——–
చక్కగా, వేగంగా సాగిపోతున్న రథచక్రానికి చీల జారిపోతుందని తెలిసి, వెంటనే పరుగెత్తి ఆ చీలను సరిచేసి, చక్రం ఊడిపోకుండా, రథం పడిపోకుండా చేసే మంచి వాళ్లు ఉన్నట్లే- ఎక్కడో ఒక మూల దాగి, చక్రానికున్న చీలను ఊడబెరికి, రథాన్ని పడదోయడానికి ప్రయత్నించే చెడ్డవాళ్లు కూడా లోకంలో ఉంటారు. శ్రీమద్రామాయణంలో మంథర ఒక దాసి. కైక పుట్టింటి నుండి అరణంగా వచ్చిన దాసి. కైక అంతఃపురంలోనే ఉండే దాసి. ఈ దాసి చాటు మాటుగా అంతటి శ్రీరామచంద్రుని జీవిత రథ చక్రానికే చీల ఊడబెరికింది. ఆయన పట్టాభిషేకాన్నే ఆగిపోయేట్టు చేసింది. ఆయన జీవిత స్థితి గతులనే మార్చేసింది. రామాయణ మహా కావ్యాన్నే ఒక మలుపు తిప్పింది. పెద్ద మలుపు తిప్పింది.
మంథర పొట్టిది. గూనిది. అందవికారమయిన ఆకారం. జీవితంలో ఎత్తును చూడలేదు. అందాన్ని, ఆనందాన్ని చూసి ఓర్వలేదు. ముడుచుకుపోయిన వ్యక్తిత్వం. కుళ్లిపోయిన మనస్తత్వం.

మంథర తానొక దాసి మాత్రమే అయినా, గూనిదే అయినా దశరథ మహారాజ కుటుంబంలో పెద్ద చిచ్చు పెట్టింది. ఆ రాజకుటుంబాన్ని అనేక కష్టనష్టాలకు గురి చేసింది.శ్రీరాముడిని అడవులపాలు చేసింది. పచ్చటి కుటుంబాల్లో చిచ్చుపెట్టే మంథరలు ఈనాటికీ లోకంలో ఎందరో ఉన్నారు. వాళ్లను ఒక కంట కనిపెట్టి ఉండాలని మంథర మనకు చెబుతూనే ఉంటుంది.

guhudu

 

గుహుడు
———–
ఆతిథ్యం ఇవ్వటం, ఉపకారం చెయ్యటం రెండూ ఉత్తమ ధర్మాలే. ఉన్నతోన్నత సంస్కారానికి నిదర్శనాలే. ఏ వ్యక్తి అయినా ఒకరికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావటం, ఉపకారం చేసే సందర్భం లభించటం తన అదృష్టమని భావించాలి. కాని, కొందరు అతిథి వస్తున్నాడంటే ముఖం త్రిప్పుకొంటారు. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకొంటారు. మరి కొందరు అతిథి సత్కారాలు, ఉపకారాలు చేస్తారు గాని, వాటిని స్వప్రయోజనాల సాధనకు పెట్టుబడులుగా వాడుకొంటారు. ఇంక కొందరు అలా చెయ్యకున్నా మేము కాబట్టి ఆతిథ్యాలు ఇచ్చామని, ఉపకారాలు చేశామని అహంకారాన్ని ప్రదర్శిస్తారు. కాని, లోకంలో అతిథిని పూజించటం, సాటి మానవులకు సాయం చెయ్యటం పుణ్య కార్యాలని భావించే వాళ్ళు, అవి చేసి తమ జన్మ తరించినట్లు తృప్తి పొందే వాళ్ళు చాలా తక్కువ. ఆలాంటివాళ్ళు, అవకాశం వచ్చి ఒక మహానుభావుడికే కష్ట సమయంలో ఆతిథ్య మిస్తే, ఉపకారం చేస్తే, వాళ్ళు పొందే ఆనందానికి అవధి ఉండదు. పైగా ఆలాంటి అవకాశం రావటం తమ జీవితంలో ఎంతో పెద్ద అదృష్టమని భావిస్తారు.

శ్రీ మద్రామాయణంలో గుహుడికి ఆలాంటి అవకాశం లభించింది. అతడు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడికే ఆతిథ్యమిచ్చాడు. ఉపకారం కూడ చేశాడు. జన్మ చరితార్థమైనట్లు భావించాడు. ఆలాగే భరతుడికి కూడ అతిథ్యమిచ్చాడు; ఉపకారం చేశాడు. ఎంతో తృప్తి చెందాడు. రామాయణంలోనే కాదు – లోకంలో కూడ గుహుడు ఒక మరపురాని వ్యక్తిగా నిలిచాడు. గుహుడు మట్టమైన మనిషి. అతడిది దిట్టమైన శరీరం. నల్లటి రంగు. గుండ్రటి ముఖం. ఎఱ్ఱటి కళ్ళు. కొట్ట వచ్చినట్లు ముందుకు దూకే తెల్లటి గుబురు మీసాలు. నెత్తిన పెద్ద తలపాగా. మెడ నిండా రకరకాల పూసల దండలు. ముంజేతులకు, బాహువులకు చిన్న చిన్న అద్దాలు పొదిగిన పెద్ద కంకణాలు. ఇదీ – ఏ రామాయణ పాఠకుడి కైనా పొడగట్టే గుహుడి రూపం.

గుహుడు ఆటవిక ప్రభువు. బల సంపన్నుడు. గంగా తీరంలో అతడి దెబ్బకు తిరుగు లేదు. అతడిది ఐదువందల నౌకాబలం. అంతకు మించిన కాల్బలం. అతడి వీరులందరు మేటి విలుకాళ్ళు. కత్తులు, ఈటెలు, అమ్ములు మొదలైనవి గుహుడి ఆయుధ సామగ్రి. ఆ అడవిలోని మృగపక్షి పదార్థ సంపద, గంగానది లోని జలచర సంపద – అంతా గుహుడిదే. అంతా రామార్పణం అన్న తృప్తి గుహుడిది. వ్యక్తి గొప్పతనానికి, అతడు మహాత్ముల మనస్సుల్లో ఒక ఉన్నత స్థానం సంపాదించటానికి జాతి ముఖ్యం కాదు; కులం ముఖ్యం కాదు. గుణం ముఖ్యం.

గుహుడు ఆటవికుడే కావచ్చు. నాగరికత అట్టే లేనివాడే కావచ్చు. కాని, అతనికి మంచి మనస్సుంది. జీవితంలో కొన్ని విలువలున్నాయి. అన్నింటిని మించి ఆతిథ్యానికి, ఉపకారానికి వెనుక ఉండవలసిన మంచి మనస్తత్వం ఉంది. శ్రీరామచంద్రుడు గుహుడి ఆతిథ్యాన్ని, అతడు చేసిన ఉపకారాన్ని జీవితంలో మరువగలడా! అన్ని గొప్ప గుణాలున్న గుహుడికి తన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఉండగలడా! అందుకే ఆయన రావణ వధానంతరం విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళుతూ, భరద్వాజాశ్రమంలో ఆగి, అదే పనిగా హనుమ చేత తన క్షేమ సమాచారాలు గుహుడికి చెప్పి పంపాడు. ‘ఆత్మ సఖా’ అని గుహుణ్ణి సంబోధించాడు. గుహుడు ధన్య జీవి. రామాయణంలో అతడు ఒక మరపురాని పాత్ర. లోకంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళకు, ఉపకారం చేసే వాళ్ళకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions