రామాయణం అనగానే…. రాముడు, సోదరులు, తండ్రీ తల్లులు… విలన్లు… అంతేనా..? మరి ఇతర కీలక పాత్రలు జటాయువు, శబరి, గుహుడు, తార, మంథర… వీళ్ల మాటేమిటి..? చివరకు వాళ్లంతా ఏమయ్యారు..? అసలు వాళ్ల పాత్ర చిత్రణ మాటేమిటి..? వాళ్లేమయ్యారు..? ఎవరైనా పట్టించుకున్నారా..? జగనానంద కారకా, జయజానకీనాయకా అని పాడుకోవడమేనా, జనం వాళ్లను పట్టించుకున్నారా..? అసలు కథారచయిత వాల్మీకి పట్టించుకున్నాడా..? కీలకపాత్రలేమయ్యాయి..? అసలు ఆ పాత్రల వైశిష్ట్యం ఏమిటి..? అవి కదా…! పోనీ, మనం ఓసారి ముచ్చటించుకుందామా..? చిన్న చిన్న భాగాలుగా ఆ పాత్రల్ని చదవండి… తరువాత ఆ రచయిత పరిచయం చేసుకుందాం… రామాయణం ఎప్పుడూ నిత్యనూతనమే కదా… ఏమంటారు..? పదండి మొదటి భాగంలోకి….
శబరి
——
శ్రీమద్రామాయణంలో శబరి ఒక అడవి మల్లె. అడవిలోనే పుట్టింది. అడవిలోనే పెరిగింది. అడవిలోనే రాలిపోయింది. ఆమె అంతరంగం భక్తి భావంతో పరిమళించింది. ఆమె జీవితం మహర్షుల సేవకే అంకితమైపోయింది. పరిచారికా భక్తికి పెట్టిన పేరుగా నిలిచింది. శబరి తల్లిదండ్రులెవరో తెలియదు. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలియదు. ఆమె గొప్ప సన్యాసిని. ఏ వయసులో మతంగముని ఆశ్రమంలో చేరిందో? ఎందుచేత జీవితాన్నంతా ఆశ్రమ సేవకే అంకితం చేసిందో? బహుశా పూర్వజన్మ వాసన. మతంగాశ్రమంలో ఒక మూల శబరి కుటీరం.
Ads
ఆమెది తీరికలేని జీవితం. కోరికలేని జీవితం. తృప్తికి నోచుకున్న జీవితం.ముక్తికి చేరువయ్యే జీవితం. మతంగాశ్రమం చిమ్మి చల్లటంతోనే ఆమె కోర్కెలు గుండెలో చల్లబడ్డాయి. అక్కడ ముగ్గులు పెట్టడంలోనే- ఆమె తల ముగ్గుబుట్టలా మారిపోయింది. పూజలకు పూలు సేకరించడంలోనే ఆమె కంటిచూపు సన్నగిల్లింది. భోజనానికి పళ్లు ఏరడంలోనే ఆమె నోటి పళ్లన్నీ రాలిపోయాయి.
మడిబట్టలు పిండి పెట్టడంలోనే ఆమె శరీరం అంతా ముడుతలు పడి మెలికలు తిరిగింది. శబరి ఇప్పుడు గాలికి గలగలలాడే ఒక ఎండుటాకు. ఏ క్షణంలోనయినా రాలిపోయే పండుటాకు. అయినా ఆమెకు అలసట లేదు. బాధల్లేవు. భయాల్లేవు. అసంతృప్తి అసలే లేదు. ఆశ్రమంలో మహర్షులంతా ఒక్కొక్కరే ఆమె కనుల ముందే సిద్ధి పొందారు. అయినా శబరి మిగిలి ఉంది. ఒంటరిగా మిగిలి ఉంది. ఎదురు చూస్తోంది. ఎవరి కోసం? ఎందుకోసం?
రాముడి కోసం. ఆ రాముడు రానే వచ్చాడు. రాముడి కాళ్లు కిడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంది. ఏరి కోరి తెచ్చిన పూలను రాముడి పాదాల చెంత ఉంచి- ఆ పాదాలపై తల వాల్చి మొక్కింది. అంతా మౌనం… కాసేపటికి రాముడే శబరిని తట్టి లేపాడు. కళ్లల్లో ఆనందబాష్పాలతో రాముడికి ఒక పండు, లక్ష్మణుడికి ఒక పండు ఇచ్చింది. తనువు చాలించడానికి రాముడి అనుమతి అడిగింది. రాముడు తల ఊపాడు.
రామ లక్ష్మణులు చూస్తుండగా శబరి యజ్ఞగుండంలో ఆహుతి అయి కోటి విద్యుత్తుల కాంతిగా అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. వ్యక్తి ముక్తికి గొప్ప వంశం ఉండనక్కరలేదు. పాండిత్యం ఉండనక్కరలేదు. పదవులు ఉండనక్కరలేదు. అంగబలం ఉండనక్కరలేదు. అర్థబలం అసలు అక్కరలేదు. మనసు, పవిత్రత, చెక్కు చెదరని భక్తి ఇవే ముఖ్యం…. ఆమె పాత్ర రామపట్టాభిషేకంలోపే సంపూర్ణం… (మిగతావి తరువాయి భాగాల్లో…. పమిడికాల్వ మధుసూదన్… 99890 90018)
Share this Article