మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వెనుక ఏ కుట్ర, విద్రోహం లేవని ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే స్పష్టం చేశాడు… తరువాత అరగంటాగంటకే ఆయన ప్రకటన మారిపోయింది… ఫోరెన్సిక్, క్లూస్ టీమ్స్ నివేదికల తరువాతే నిర్ధారణకు వస్తామని మరో ప్రకటన వచ్చింది… అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల ఒత్తిడితో తను మాట మార్చేశాడని..!
ఎస్, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో చాలా లోపాలున్నాయనే విమర్శలు ఈనాటివి కావు… అవినీతి ఆరోపణలు సరేసరి… కానీ ఎలాగైతేనేం, ఓ ప్రాజెక్టు కళ్లముందు నిలబడింది కదాని తెలంగాణ సమాజం మిగతా విమర్శలు, ఆరోపణల్ని తేలికగా తీసుకుంది… కానీ ఇప్పుడు షాకింగ్… పంపు హౌజులు మునిగిపోతాయి, బరాజులు కుంగిపోతాయి… ఎన్నికల వేళ ఈ ప్రాజెక్టు నాణ్యతలోపాలు, దీని భవిష్యత్తుపై భయాందోళనలు జనంలో చర్చకు దారితీస్తున్నయ్…
అందుకే మెల్లిగా దీన్ని కుట్ర, విద్రోహాల వైపు మళ్లిస్తున్నారు… అలాగే ఓ ఏఈతో ఫిర్యాదు ఇప్పించారు… కేసు నమోదు చేయించారు, పైగా ఎల్‌అండ్‌టీ సంస్థే ఈ నష్టాన్ని భరిస్తుందనీ, ప్రభుత్వ ఖజానాకు నష్టం లేదని ఏవో వింత వివరణలు ఇస్తున్నారు… అసలు మునిగిపోయిన పంప్ హౌజులోని మోటార్లలో ఎన్ని రిపేర్ చేశారు..? ఎన్ని నడుస్తున్నాయి..? దాని మీదే ఎవరికీ క్లారిటీ లేదు… ఇవ్వరు, ఇవ్వనివ్వరు… మరి ప్రభుత్వం కట్టిన బరాజుల మాటేమిటి..? అసలు ఏవి ఏ స్థితిలో ఉన్నాయి..? ఇప్పటి కుంగుబాటు సరే, రేపటి మాటేమిటి..?
Ads
సరిగ్గా ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు… హడావుడి కేంద్ర బృందం వచ్చింది… ఏం చూస్తోంది..? రిపేర్లు ఎలా అని ఆలోచిస్తోందట… కాఫర్ డ్యామ్ కట్టేసి, రిపేర్లు చేయాలని సూచిస్తోందట… రిపేర్ల సంగతి సరే, కానీ తేల్చాల్సింది డిజైన్ లోపాల్ని, నాణ్యత లోపాల్ని కదా…? తేలాల్సింది బాధ్యులు ఎవరనేది కదా..? బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహం తెలిసినవాళ్లెవరూ ఈ కేంద్రబృందం ఏదో తేలుస్తుందని ఆశపడరు… ఇదిలాగే కుట్ర వైపు, రిపేర్ల వైపు సాగిపోతుంది…
అసలే ప్రవళిక ఆత్మహత్య కేసు కేసీయార్‌కు తలనొప్పిగా మారింది… టీఎస్పీఎస్సీ వైఫల్యాల నుంచి చర్చను దారిమళ్లించడానికి ఎవడో మోసం చేశాడనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు… ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ… సరే, దీన్ని కూడా విజయవంతంగా దారిమళ్లిస్తారు… ఈ డిబేట్ నడుస్తుండగానే సోషల్ మీడియా కరీంనగర్ తీగల వంతెన దుస్థితిని, నాణ్యతలోపాలను బయటపెట్టింది… ఆ ఫోటో చూస్తే చాలు, దాని గతి ఏమిటో అర్థమైపోతోంది…
నిజమే… ప్రభుత్వ వైఫల్యాలపై ఈగ కూడా వాలనివ్వరు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు… కానీ మేడిగడ్డపై గానీ, తీగల వంతెన మీద గానీ కిక్కుమనడం లేదు… వాళ్లు ఎంత మాట్లాడితే అంతగా జనంలో చర్చ జరుగుతుంది, పార్టీకి నష్టం… అందుకని సైలెన్స్… కాలేశ్వరం కడుతున్నప్పుడు, అంచనాలకు మరీ అధికంగా ఖర్చు సాగుతున్నప్పుడు కేంద్రం కిమ్మనలేదు… డిజైన్‌ను పట్టించుకోలేదు… నాణ్యతపై నిఘా లేదు…
ఒక అంతర్రాష్ట్ర నదీప్రవాహంపై కడుతున్న పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి తనకూ బాధ్యత ఉందనే సోయి లేదు… ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, నాకేం సంబంధం అనుకుంది… మరిప్పుడు ఇంత అర్జెంటుగా రంగంలోకి ఎందుకు దిగింది..? పోనీ, మొత్తం ప్రాజెక్టు నాణ్యత మీద దృష్టి పెట్టకుండా, జస్ట్, రిపేర్ల అంశానికే ఎందుకు పరిమితం అవుతోంది..? హేమిటో…
Share this Article