చుట్టూరా అనంతమైన హిందూ మహాసముద్రం… దట్టమైన అడవులు… దాదాపు 800 దీవుల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ దీవి అది… ఆధునికత, నాగరికత ప్రభావాలు సోకకుండా, ఇంకా ప్రకృతి ఒడిలోనే మనుగడ సాగిస్తున్న వేలాది మంది ఆదిమవాసులు… వ్యవసాయం కూడా ఎరుగని ముందుకాలం నాటి జాతులవి… ఆ జన్యువులు వేరు, ఆ మనుషులే వేరు… ఆ అడవుల్లో జంతుజాలం, వృక్షజాతులు… అదొక అద్భుత సంపద…
ఇప్పుడు ఆ సంపద మీద అభివృద్ధి అనే పడగనీడ పరుచుకుంటోంది… పండోరా గ్రహానికి వెళ్లిన మనుషులు రాక్షసయంత్రాలతో ఆ వాతావరణాన్ని పెకిలించినట్టే గ్రేట్ నికోబార్‌ను తవ్వి, కాంక్రీట్ పరిచి, కృతిమ పట్టణాల్ని నిర్మించబోతున్నాం… 70 వేల కోట్ల పైచిలుకు ఖర్చుతో ఓ మెగా ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాం…
పండోరా వాసుల్లా పోరాడలేరు, ఏ పంజుర్లి దేవుడో అడ్డుకోలేడు… ఎన్నేళ్లుగానే ప్రతిపాదనల్లోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు రెండు నెలల క్రితం The Zoological Survey of India (ZSI), Wildlife Institute of India (WII), Salim Ali Centre for Ornithology and Natural History (SACON) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి… Ministry of Environment, Forests and Climate Change కూడా environmental, coastal regulation zone clearance ఇచ్చేసింది… ఇవన్నీ పర్యావరణ దుష్ప్రభావం పెద్దగా ఉండదనీ తేల్చేశాయి… ఈ మెగా ప్రాజెక్టు మొదటి దశకు రంగం సిద్ధమైంది… మరి జీవ వైవిధ్యం, ఆదిమజాతుల మనుగడ మాటేమిటి అంటారా..? అభివృద్ధి హోరులో కొట్టుకుపోవాల్సిందే…
Ads
దాదాపు 87 మంది మాజీ టాప్ బ్యూరోక్రాట్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిన్న ఓ లేఖ రాశారు… అమ్మా, ఈ ప్రాజెక్టు వద్దు, నువ్వయినా జోక్యం చేసుకో అనేది ఆ లేఖ సారాంశం… సో, ఈ ప్రాజెక్టు ఆగుతుందా..? ఆగదు… ఇప్పుడు అన్నిరకాల పర్మిషన్లు తనే ఇచ్చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇక ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టబోతోంది…
ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనది 35 వేల కోట్ల రూపాయలతో నిర్మించే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు… అంటే పెద్ద పెద్ద నౌకల సరుకు మార్పిడికి అడ్డా… హిందూ మహాసముద్రం, ఆసియా పసిఫిక్ ఏరియాల్లో నౌకావాణిజ్యానికి దీన్ని కీలకస్థావరం చేయాలని ఆలోచన… ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఓ భారీ పవర్ ప్లాంటు, ఓ గ్రీన్ ఫిల్డ్ సిటీ… టూరిజం ప్రాజెక్టులు… నిజానికి 853 చదరపు కిలోమీటర్ల ఈ గ్రేట్ నికోబార్ దీవి ట్రైబల్ రిజర్వ్‌గా ప్రకటించారు… the Andaman and Nicobar Protection of Aboriginal Tribes Regulation, 1956 కింద ఎవరూ అనుమతుల్లేకుండా అసలు ఆ దీవిలోనే అడుగుపెట్టొద్దు… ఇప్పుడవన్నీ బ్రేక్ చేసి, కేంద్రమే అభివృద్ధి కాలుష్యానికి తెరలేపుతోంది…
ఈ అనుమతులకు ప్రభుత్వం చెప్పిన పరిష్కారాలు నవ్వాలో ఏడవాలో తెలియవు… డెవలప్‌మెంట్ కోసం ఈ దీవిలో దాదాపు 13 వేల ఎకరాల అడవి మాయమవుతుంది… ఏడెనిమిది లక్షల చెట్లు నరికేస్తారు… పర్లేదు, దానికి బదులుగా హర్యానా, ఆరావళి ఏరియాలో అడవుల్ని పెంచుతామని కేంద్రం చెప్పింది… గ్రేట్ నికోబార్‌లో కొట్టేసే లక్షల చెట్ల స్థానంలో హర్యానాలో చెట్లు పెంచుతారట… ఇలాంటివి బోలెడున్నాయి…
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత దృష్టి పెట్టడానికి మరో ప్రధాన కారణం చైనా… ఆ దేశం హిందూ మహాసముద్రం, ఆసియా పసిఫిక్ జలాల్లో పెత్తనం కోసం దూకుడుగా ముందుకొస్తోంది… దాని యుద్ధనౌకలు, జలాంతర్గాములు కూడా తిరుగుతున్నాయి… పలు దేశాల్లోని పోర్టులకు రుణాలిచ్చి, మెల్లిమెల్లిగా వాటిని స్వాధీనం చేసుకోవడం చైనా మరో దుర్నీతి… అది ఇండియాకు బహుముఖంగా థ్రెట్… అందుకని గ్రేట్ నికోబార్ కేంద్రంగా ఓ డిఫెన్స్ కారిడార్ నిర్మించాలనేది మన ప్రణాళిక… ఇప్పుడు కట్టబోయే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు ఇండియన్ నేవీ ఆధీనంలోనే ఉంటుంది… మిగతా ప్రాజెక్టులన్నీ ఎయిర్ ఫోర్స్ పరిధిలోకి తీసుకొస్తారు… బలమైన యుద్ధస్థావరంగా మారుస్తారు… రక్షణ కోణంలో ఇండియాకు ఇది అవసరమే… కానీ ప్రత్యామ్నాయంగా ఏదేని జనాల్లేని దీవిని ఎంచుకోవచ్చు కదా అనేది ఓ ప్రశ్న…!!
Share this Article