Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ప్రశ్నలు అలాగే ఉన్నయ్… అమరావతి రాజధానిపై అదే సందిగ్ధస్థితి…

November 29, 2022 by M S R

మూడు రాజధానులు అంశంపై సుప్రీం తీర్పును తెలుగు మీడియా తమ పార్టీల ధోరణులకు అనుగుణంగా రాసుకున్నయ్… అసలు సుప్రీం ఏమన్నదో సరిగ్గా రిపోర్ట్ చేయకుండా… ప్రభుత్వానికి రిలీఫ్ అని కొందరు, జగన్‌కు షాక్ అంటూ ఆ పచ్చ పైత్యపు మీడియా నిన్నంతా తెగఊదరగొట్టాయి… నిజానికి సుప్రీం వ్యాఖ్యలు గానీ, తీర్పు గానీ సబబుగానే ఉన్నయ్… అదేసమయంలో ఇప్పుడే తను ఏమీ చెప్పలేని సంకటస్థితినీ కనబరిచింది…

కొన్ని కీలకప్రశ్నలకు అది జవాబు వెతుకుతోంది… అసలు రాజధాని అంటే ఏమిటి..? దీనికి జవాబు పరిపాలన వ్యవస్థల కేంద్రం… అయితే హైకోర్టు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు ఒకేచోట ఉండాల్సిన అవసరం ఏముంది..? వేరే రాష్ట్రాల్లో రాజధానులు ఒకచోట, హైకోర్టులు ఇంకోచోట పనిచేయడం లేదా..? రాజధాని అంటే ఏయే వ్యవస్థలు ఉండాలి..? అసలు రాజధాని అంటే రాజ్యాంగం ఏం చెబుతోంది..? రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదా..? కేంద్రానిదా..? ప్రభుత్వాలు మారేకొద్దీ రాజధానులు మారితే జరిగే నష్టం మాటేమిటి..? అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కావడం సరికాదు, కానీ ఇప్పటిదాకా అమరావతిలో పెట్టిన వేల కోట్ల ప్రజాధనం సార్థకత మాటేమిటి..?

ఇన్ని ప్రశ్నలకు జవాబు దొరకలేదు కాబట్టే… రాజధానిపై రాష్ట్రానికి నిర్ణయాధికారం లేదనే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం తిరస్కరించింది… ఈ ప్రశ్నలకు స్పష్టత ఎలా అనేదీ తేలడం లేదు, తెలియడం లేదు… కేంద్రం తన అధికారాల పరిమితి ఏమిటో, రాష్ట్రాల అధికారం ఎంతో తేల్చాల్సి ఉంది… అదే అల్టిమేట్ అనేమీ కాదు… కానీ కేంద్రం తన వైఖరి ఏమిటో, పైన చెప్పిన కొన్ని ప్రశ్నలకు తన జవాబులు ఏమిటో చెప్పాల్సి ఉంది…

సుప్రీం హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రం పరుషవ్యాఖ్యలు చేసింది… హైకోర్టు అభివృద్ధి పనులకు కాలపరిమితి పెట్టడం మీద… హైకోర్టు ప్రభుత్వం కాదు, టౌన్ ప్లానర్ కాదు అంటూనే, ఆ అంశాలపై స్టే విధిస్తూనే, హైకోర్టు తన పరిధి దాటిందని తప్పుపడుతూనే… అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం అయితే ఎలా అని ప్రశ్నించింది… అంటే మూడు రాజధానుల వైపు ఒకింత మొగ్గు కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది… వైసీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ అనిపిస్తుంది అదే… కానీ విచారణల్లో చేసే వ్యాఖ్యలే అంతిమ తీర్పులు కావు… కానీ..?

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానికి లేదు అనే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడం లేదు సుప్రీం… అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదనే హైకోర్టు తీర్పు అమలులో ఉన్నట్టే… రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా మూడు రాజధానులపై ముందుకు వెళ్లే మార్గం లేనట్టే… నిజానికి ఏం చేయాలో జగన్ ప్రభుత్వానికే క్లారిటీ లేదు… అమరావతిలోనే హైకోర్టు ఉంటుందంటున్న ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేసేదేమిటి..? ట్రిబ్యునళ్లు, చిన్న చిన్న జుడిషియల్ సంస్థలా..? అది న్యాయరాజధాని అవుతుందా..? అవి నిజంగా మూడు రాజధానులేనా..?

విశాఖకు ఎగ్జిక్యూటివ్ పాలన కేంద్రం ఏదో నెపంతో తరలిస్తారు సరే, మరి పొలిటికల్ రాజధాని..? ఆల్‌రెడీ అసెంబ్లీ, మండలి భవనాలు కట్టిపెట్టారు కదా… ఈ సందిగ్ధావస్థ ఎన్నాళ్లో కూడా తెలియదు… సుప్రీం ఎదుట మరో కీలకాంశం ఉంది… రాజధాని కోసం రైతుల నుంచి ఒప్పందపూర్వకంగా భూమిని తీసుకుంది ప్రభుత్వం… అలాంటప్పుడు దాన్ని ఇతరత్రా అవసరాలకు వాడటం గానీ, తాకట్టు పెట్టడం గానీ, ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరించడం గానీ ప్రభుత్వం చేయవచ్చా..? నైతికత, విశ్వసనీయత కోణంలో చేయకూడదు… కానీ ప్రజావసరాలకు ప్రభుత్వాలు భూమిని సేకరించినప్పుడు, ఆ భూమిని తనకు ఇష్టం వచ్చినట్టు భిన్నావసరాలకు కేటాయిస్తోంది… అమరావతి కేసు వేరు… ఓ నిర్దిష్ట అవసరం పేరు చెప్పి, సమీకరించింది… కట్టుబడక తప్పదు…

అభివృద్ధి వికేంద్రీకరణ అనేదే ఓ భ్రమాత్మక పదం… నాలుగు ప్రభుత్వ ఆఫీసులు కట్టగానే ఏరియాలు డెవలప్ కావు… అన్నిరకాల ప్రజావసరాలకు కేంద్రాలుగా మారితేనే జనం వస్తారు… నగరం డెవలప్ అవుతుంది… చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ కట్టుకున్నారు… ఏం సుఖం..? ఏముందక్కడ..? నిజానికి చంద్రబాబు అమరావతిలో వైద్యం, విద్య తదితరాల కోసం కూడా ఆలోచించాడు, వాటికీ భూమి ఇచ్చాడు… కనెక్టివిటీ ఆలోచించాడు… శాసన, పాలన, న్యాయ వ్యవస్థల్లో పనిచేసేవాళ్లకు వసతికీ ప్లాన్ చేశాడు… ఇప్పుడేమో రెడ్డొచ్చె మొదలాడు… ఎందుకు..? అన్నీ మార్మికం… పలు స్వార్థాలు, సమీకరణాలు… సింపుల్‌గా చెప్పాలంటే… అరాచకం… రాజనీతిజ్ఞతారాహిత్యం…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
  • దటీజ్ అమితాబ్..! ఈరోజుకూ తిరుగులేని నంబర్‌వన్ స్టార్… సర్వే చెప్పిందిదే…!
  • సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!
  • గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
  • వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
  • కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
  • చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
  • అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
  • జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…
  • ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions