Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవిశ్రీప్రసాద్‌ను తిట్టిపోశాం సరే… మరి దిగ్రేట్ శోభారాజ్ చేసిందేమిటిట..?!

December 22, 2021 by M S R

ట్యూన్ ఒకటే… అందులో ఏ భావంతో పదాలు ఇరికిస్తే ఆరకం పాట అవుతుంది… కిక్కిచ్చే సరదా, సరసమైన పదాలు పడితే అది రక్తి పాట… దేవుడిని ప్రార్థించే పదాలు ఇమిడితే అదే భక్తి పాట… శ్రోతకు నచ్చకపోతే అది అంతిమంగా విరక్తిపాట… అంతే కదా… సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పింది కూడా ఇదే కదా… తను చెప్పిన తీరు బాగా లేదు గానీ కొందరు ఆధ్యాత్మిక వాదులకూ ‘‘ఊ అంటావా’’ ట్యూన్ బాగానే ఎక్కేసినట్టుంది… ఇక మీమ్స్, రీల్ వీడియోలు గట్రా చెప్పనక్కర్లేదు… సోషల్ మీడియాలో ఒకటే హడావుడి… ఒకవైపు ఆ ఐటం సాంగ్‌ను భక్తి పాటతో పోలుస్తూ దేవిశ్రీ చేసిన బాష్యం మీద రాజాసింగ్ సహా హిందుత్వవాదులు మండిపడుతుంటే మరోవైపు ఆ ట్యూన్‌తో భక్తి పాటలు అర్జెంటుగా అల్లేస్తున్నారు కొందరు… హేమిటో ఇదంతా…

నిజానికి గతంలో సూర్య నటించిన అదేదో సినిమా నుంచి ఆ ట్యూన్ కాపీ చేశాడనే విమర్శలు, ఆరోపణలు మరోవైపు… పాతవాటి అనుకరణ, అనుసరణ లేకపోతే వేలాది కొత్త ట్యూన్లు ఎలా పుట్టుకొస్తాయి, ఎలా సాధ్యం మరి అంటారేమో… అంతేకదా మరి అనుకోవాలి… కానీ ఏ విషయంలో మనం దేవిశ్రీప్రసాద్‌ను తప్పుపడుతున్నామో, తను చెప్పినట్టే చేస్తున్నారు కదా కొందరు… దాన్నేమనాలి..? దేవుడిని కీర్తించడానికి, భక్తితత్వాన్ని ఆలపించడానికి కూడా అలాంటి ఐటం ట్యూన్స్ కావాలా..? దిగువన ఓ వీడియో ఉంది చూడండి ఓసారి…

https://youtu.be/oBoq9IOHyEM

Ads

ఈమెకేమైందో హఠాత్తుగా… అన్నమయ్య కీర్తనలను వినసొంపుగా పాడి పరవశింపజేసేది, ఆ పాటలు, భక్తి ప్రచారం పేరిట సర్కారువారి సాయం కూడా పొందింది… ఇప్పుడు ఆమె కూడా అదే ట్యూన్ ఆశ్రయించి దేవుడిని కీర్తిస్తోంది… దేవుడా…!! దిగువన అలాంటిదే మరో ప్రయత్నం చేసిన వీడియో కూడా ఉంది… ఇవి రెండూ యూట్యూబులో ఉన్నవే… దేవుళ్లను ప్రార్థించడానికి వీళ్లకు వేరే రాగాలు, తాళాలు దొరకలేదా..?

ఆమధ్య ఓ వివాదం గుర్తుంది కదా… వరుడు కావలెను అనే ఓ సినిమాలో ఓ పాట… దిగుదిగుదిగు నాగ అంటూ… అనంతశ్రీరాం రాశాడు ఓ పాట… థమన్ అనే ఓ కట్ అండ్ పేస్ట్ ఆర్టిస్ట్ దానికి సంగీత దర్శకుడు… రీతూవర్మ ఐటం స్టెప్పులతో కిర్రెక్కించేలా నటించి పారేసింది… నిజానికి అది ఓ భక్తి ట్యూన్, లక్షల మంది పాడుకునే అయ్యప్ప భజనగీతం… దాన్ని ఐటం ట్యూన్ చేసేశారు థమన్, అనంతుడు కలిసి… అఫ్ కోర్స్, జనం ఛీకొట్టారు, అది వేరే సంగతి…

varudu kavalenu

వెరసి చెప్పుకునేది ఏమిటయ్యా అంటే… రక్తి పాటల్ని భక్తి పాటలు చేసేస్తున్నారు, భక్తి పాటల్ని రక్తిపాటలు చేసేస్తున్నారు… జనం మీదకు వదులుతున్నారు… దేవిశ్రీ చెప్పిన అంతిమ సారాంశమూ అదే, మనవాళ్లు చేసి చూపిస్తున్నదీ అదే…!! అన్నట్టూ… ‘‘పుట్టువేళ తల్లికి నువ్వు పురుటి నొప్పివైతివి… గిట్టువేళ ఆలికేమో మనసునొప్పివైతివా..? బట్టమరక పడితే నువ్వు కొత్త బట్టలంటివి… ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా..? పైన పటారం, ఈడ లోన లొటారం… విను బాసూ చెబుతాను ఈ లోక యవ్వారం……. ఈ పాట ఎక్కడో విన్నట్టు గుర్తుందా..?

anasuya

పైనపటారం లోన లొటారం అనే పాట… సినిమా పేరు చావు కబురు చల్లగా… మంగ్లీ పాడినట్టుంది, బాగా పాడింది… మంచి ఫిలాసఫీ దట్టించినట్టుగానే ఉంది కదా పాట… కానీ ఆ సినిమాలో ఇది ఐటం సాంగుగా పెట్టారు, అనసూయ తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ స్టెప్పులు వేసింది, తీరాచూస్తే కంటెంటు అంతా వైరాగ్యం… అంటే రక్తి, భక్తి జుగల్‌బందీ అన్నమాట… అందుకని రక్తి, భక్తి బోత్ ఆర్ నాట్ సేమ్ అని బాలయ్య స్టయిల్‌లో ఓ అంచనాకు రాకండి… మన మూవీ క్రియేటర్స్, మీమ్స్ క్రియేటర్స్ ఎలా సృష్టిస్తే అలా… ఎలా మిక్స్ చేస్తే అలా… అదేలెండి, మ్యూజిక్ మిక్సింగు, సౌండ్ మిక్సింగు, కంటెంట్ మిక్సింగు…! అసలే ఇది మిక్స్ మసాలా కాలం కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions