రాజకీయ పార్టీల్లో ఓ సంప్రదాయం ఉంటుంది… ఎవరైనా ఎవరినైనా తిడితే, వెంటనే సంబంధిత కులం నాయకులతో కౌంటర్ విమర్శలు చేయించడం..! ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో, టీవీ సర్కిళ్లలో కూడా ఈ ధోరణి తెగపెరిగిపోతోంది… చివరకు మల్లెమాల వంటి ప్రొఫెషనల్ టీవీ ఎంటర్‌టెయిన్‌మెంట్ కంపెనీలు కూడా ఈ బురదలో కాలేస్తున్న తీరు విచిత్రంగా కనిపిస్తోంది…
నిన్నా మొన్నా ఆర్పీ అనబడే కమెడియన్ మీద బొచ్చెడు వార్తలు, ట్యూబ్ వీడియోలు కనిపిస్తున్నాయి… విషయం ఏమిటంటే..? ఈ ఆర్పీ అనబడే కమెడియన్ ఈటీవీ, మల్లెమాల నుంచి విముక్తి పొంది, మాటీవీలో స్కిట్స్ చేసుకుంటున్నాడు… అక్కడ తన దేవుడు నాగబాబు ఉన్నాడు కాబట్టి తనకు కంఫర్ట్… మొన్న ఎక్కడో మాట్లాడుతూ మల్లెమాల (ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి సొంత కంపెనీ ఇది)లో వ్యక్తులను నీచంగా చూస్తారని ఏదో ఆరోపించాడు…
నిజానికి ఆర్పీ పెద్ద మెరిట్ ఉన్న కమెడియన్ ఏమీ కాదు… తను మాట్లాడుతుంటే సగం మాటలు సరిగ్గా అర్థమే కావు… ఆ స్కిట్స్ కూడా నాసిరకంగా ఉంటయ్… తనను జబర్దస్త్‌లో కొనసాగించాలా లేదానేది మల్లెమాల కంపెనీ ఇష్టం… దాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన పనిలేదు… కాకపోతే ఆ కంపెనీ ‘బాండెడ్ లేబర్’ అన్నట్టుగా రాయించుకునే బాండ్లు, అగ్రిమెంట్లు, జరిమానాలు, పని వాతావరణం, తమతో పనిచేసే ఉద్యోగుల పట్ల కాస్త అభిమానం కూడా లేకపోవడం, డైరెక్టర్ల రాజకీయాల మీద టీవీ సర్కిళ్లలో చాలా విమర్శలున్నయ్, అసంతృప్తి కూడా ఉంది…
Ads
అందుకే చాలామంది నాణ్యత కలిగిన కమెడియన్లు కూడా సదరు కంపెనీ నుంచి పారిపోయారు… అవినాష్ అయితే పది లక్షలు మల్లెమాల మొహం మీద పారేసి మరీ వెళ్లిపోయాడు… సుధీర్, అనసూయ, అభి, చంద్ర సహా చాలామంది వెళ్లపోయారు, ఆది కూడా బయటపడబోతున్నాడు… ఇప్పటికే మల్లెమాల ప్రోగ్రామ్స్ వెలవెలపోతున్నయ్… ఈ స్థితిలో ఆర్పీ చేసిన విమర్శలు ఎక్కడో బాగా కాలినట్టున్నయ్…
మల్లెమాల హుందాగా ఆ విమర్శల్ని వదిలేస్తే సరిపోయేది… తాము పంపించేశామనే కోపంతో, కడుపుమంటతో ఏదో తిట్టేస్తున్నాడులే అనుకుంటే సరి… కానీ మల్లెమాల వాళ్లు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్‌లతో అదేదే ట్యూబ్ చానెల్‌లో ఇంటర్వ్యూ ఇప్పించినట్టున్నారు… వాళ్లు ఆర్పీ మీదకు రివర్స్ అటాక్ చేస్తూ, మల్లెమాల కంపెనీని మోయడానికి విశ్వ, విఫల ప్రయత్నం చేశారు… ఫాఫం, అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి తప్పలేదేమో, అర్థం చేసుకోవచ్చు…
మధ్యలో ఓ వెటరన్ సినిమా నటుడు కమ్ రాజకీయవేత్త రంగప్రవేశం చేసి, ఠాట్, అన్నం పెట్టిన చెయ్యికే సున్నం పూస్తావా అని అగ్గిఫైరయ్యాడు… ఇందులో అన్నం పెట్టడం ఏముంది..? డబ్బులిచ్చారు, పనిచేయించుకున్నారు… ఆర్పీ అనే కేరక్టర్‌ను వాడుకున్నారు… ఉత్త పుణ్యానికి ఆర్పీని మల్లెమాల పోషించలేదు కదా… వాళ్లు అంత సత్సంబంధాల్ని చూపించేవాళ్లయితే ఇంతమంది ఆ కంపెనీని వదిలేసి ఎందుకు పారిపోతున్నట్టు..? మాటీవీలాగే జీటీవీవాడు గనుక జబర్దస్త్ వంటి కామెడీ షో స్టార్ట్ చేసి, గట్టిగా ఓ ఈల వేస్తే… మల్లెమాలలో ఉన్న ఈ కాస్త మెరిట్ కూడా అటు జంపైపోవడం ఖాయం… షెడ్డు ఖాళీ..!! ఇప్పుడు మల్లెమాల చేయాల్సింది ఆర్పీల మీద ఏడవడం కాదు, దిద్దుబాటు..!!
Share this Article