.
చాలామంది మిత్రులు అసలు పురూలియా కేసు ఏమిటి..? ఒక విదేశీ విమానం మన గగనతల భద్రతను క్షేమంగా దాటేసి, పశ్చిమ బెంగాల్‌లో ఓచోట ఆయుధాలను జారవిడిస్తే… అవి ఎవరి కోసం..? ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనడుగుతున్నారు… ఈరోజుకూ అవి ప్రశ్నలు మాత్రమే… జవాబుల్లేవు…
రా, మిలిటరీ ఇంటలిజెన్స్, ఐబీ, సీబీఐ, పీఎంవో తదితర కీలక కార్యాలయ రికార్డులు ఏమైనా చెప్పగలవేమో… ఏమో, ఉంటే కదా అంటారా..? అదీ నిజమే… ఎల్‌బీ శాస్త్రి మరణం, నేతాజీ అదృశ్యంలాగే పురూలియా కూడా ఇక చరిత్రపుటల్లో శాశ్వతంగా జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోవచ్చు… కాకపోతే స్థూలంగా కేసును టచ్ చేయొచ్చు…. ఇదే నిజమని చెప్పలేం, నిజమేమో అనుకుని చదువుకోవడానికి మాత్రమే…
Ads
నెవ్వర్, మోడీ కూడా దీన్ని బయటపెట్టించడు, ఎందుకంటే..? ఇది దేశం పరువు యవ్వారం కాబట్టి… ఇది 1995లో జరిగింది… అది రష్యన్ తయారీ ఎంటనోవ్-26 కార్గో విమానం… పురూలియా జిల్లాలో ఆయుధాల్ని జారవిడిచింది… అందులో AK-47లు, రాకెట్లు, గ్రెనేడ్లు, లక్షల బుల్లెట్లు, ఇతర మిలిటరీ గ్రేడ్ సామగ్రి…
అప్పుడు బెంగాల్‌లో సీపీఎం ప్రభుత్వం… కేంద్రంలో పీవీ ప్రధాని, కాంగ్రెస్ ప్రభుత్వం…. ఆ ఆయుధాల్ని ఆనంద మార్గ్ సంస్థ కోసం వచ్చాయనేది స్థూలంగా వినిపించే ఓ రఫ్ వాదన… ఎందుకు..?
ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే ఆ సంస్థ భావజాల పరంగా సీపీఎంకు పడదు… అదేమో జనాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో పెరుగుతోంది… సీపీఎం ఘర్షణలు ఎలా ఉంటాయో తెలుసు కదా… తరచూ ఆ సంస్థ కార్యకర్తల మీద దాడులు… 1960 నుంచే ప్రారంభమైనా 1980, 1990 నాటికి తీవ్ర స్థాయికి చేరాయి… మే 1, 1971న బెంగాల్‌లో ఏడుగురు ఆనంద మార్గ్ స్వాములను దారుణంగా బండరాళ్లతో కొట్టి, నిప్పుతో కాల్చి చంపారు… అర్థమైంది కదా…
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్డినెన్స్‌లు… ఆనంద మార్గ్ కార్యకలాపాలపై కఠినమైన నిర్బంధం… కొన్ని ఆలయాలు, కేంద్రాలు మూసివేయబడ్డాయి… ఈ సంస్థ తన కార్యకర్తలకు యుద్ధ శిక్షణ ఇస్తూ… బలగాలను సాయుధం చేస్తూ… సీపీఎంకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చే పనిలో ఉందని సీపీఎం ఆరోపణ… అదీ అసహనం…
ఆనంద మార్గ్ పెద్దలకూ ప్రాణభయం… అందుకని పూర్తి స్థాయిలో ఆయుధాలు కావాలని ప్రయత్నించింది… సముద్ర, రోడ్డు మార్గంలో సీపీఎం రానివ్వదు, సో, ఎయిర్ వేలో ఆయుధాలు వచ్చాయనేది ఆరోపణ…
…. ఎవరు చేశారు? ఈ కేసులో ప్రధాన వ్యక్తి : Kim Davy అనే డేన్మార్క్ (Denmark) వ్యక్తి. (అతని అసలు పేరు Niels Christian Nielsen)… ఆయుధాలు వేసిన విమానంలో సహ నిందితుడు: Peter Bleach అనే బ్రిటిష్ వ్యక్తి, బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన మాజీ అధికారి. మిగతా ఐదుగురు లాట్వియన్లు (విమాన సిబ్బంది)…
ఏమైనా శిక్షించగలిగామా..? Peter Bleach సహా లాట్వియన్ విమాన సిబ్బంది 1995లో అరెస్టు అయ్యారు… 2000లో వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది… అయితే, 2004లో బ్రిటన్ ప్రభుత్వ ఒత్తిడి వల్ల పీటర్ బ్లీచ్‌ను విడుదల చేశారు…. లాట్వియన్ సిబ్బందిని కూడా విడుదల చేశారు…
Kim Davy మాత్రం తప్పించుకున్నాడు… అతడు ఇప్పటికీ డెన్మార్క్‌లో ఉన్నాడు… భారత్ అతని ఎక్స్‌ట్రడిషన్ కోసం ప్రయత్నించింది గానీ, డెన్మార్క్ అతన్ని అప్పగించలేదు…. అంటే ఎవడినీ మనం శిక్షించలేకపోయాం.., ఆయుధాల జారవేత నిజం.., ఎవడినీ మనం ఏమీ చేయలేకపోయాం అనేదీ నిజం…
విదేశాలు అడగ్గానే నిందితుడిని వదిలేశాం, ఓ నిందితుడిని తిరిగి తీసుకురాలేకపోయాం… నిజాలేమిటో చెప్పలేకపోయాం… ఎవరో కీలకవ్యక్తులు కేంద్రంలో సహకరించకపోతే ఈ ఆపరేషన్ అసాధ్యం..? వాళ్లెవరు..? పీవీకి తెలిసి ఈ ఆపరేషన్ జరిగిందని నమ్మలేం… అలా తనే సహకరించి ఉంటే, ఆ విమానం రిటర్న్ జర్నీలో మన విమానాలు వెంబడించి, కిందకు దింపి, ఈ అరెస్టులు చేసి ఉండేవారు కాదు…
తరువాత ఆ ఆయుధాలు ఏమయ్యాయి..? అసలు ఆ ఆనంద మార్గం ఏమైంది..? మధ్యలో సీపీఎం మరో ఆరోపణ… కేంద్రమే ఇదంతా చేసి, ఈ సాకుతో రాష్ట్రపతి పాలన పెట్టేసి, సీపీఎం అధికారాన్ని కూలదోయాలని కుట్ర చేసింది అని..! ఏవో సాకులతో ఆర్టికల్ 356 ప్రయోగించే వీలుండగా ఈ ఆపరేషన్ అవసరమా..?
మరి, ఆనంద మార్గ్ సంస్థే కేంద్రంలో కొందరి సాయంతో, తనే బయట ఆయుధాలు కొని, జారవేత పనిని ఔట్ సోర్సింగ్ చేసిందా..? అదే నిజమైతే కేంద్రానికి ఈ నిజాలు దాచిపెట్టాల్సిన పనేమిటి..? 2011లో సీపీఎం ఓ ప్రకటన చేసింది…
‘‘ఆయుధాలు జారవిడిచే సమయంలో కలైకుండ వైమానిక స్థావరంలోని రాడార్ పనిచేయలేదు… అంటే ఎవరు సహకరించారు..? ఆ విమానం థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి తిరుగు ప్రయాణం అంత స్వేచ్ఛగా ఎవరి సాయమూ లేకుండా చెన్నైలో ల్యాండ్ అయి ఎలా టేకాఫ్ అవ్వగలిగింది..? డేవీ అనేవాడు తప్పించుకుని పోయాక పప్పూయాదవ్ తనకు సహకరించాడని చెప్పాడు, అదే యాదవ్ సీపీఎం ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో ఉన్నాడు, తనెలా సహకరించాడు..? సో, నిజాలు బయటరావడానికి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి…’’
అసలు కేజీబీ, బ్రిటిష్ గూఢచార సంస్థల ప్రమేయం ఏమైనా ఉందా..? ఉంటే ఎందుకు..? ఇదుగో ఇలాంటి అనేక ప్రశ్నలు…. అనేక డాక్యుమెంటరీలు, విచారణలు, వార్తా కథనాలు, పుస్తకాలు, వాట్ నాట్..? కొన్నేళ్లపాటు ఇదొక సంచలనం… వెరసి అంతా శూన్యం… చెప్పుకున్నాం కదా… దేశ చరిత్రలో ఓ మిస్టరీ అధ్యాయం..!! ఇండియా ఇది… చేతనైతే ఎవడు ఏ ఆటైనా ఆడుకోవచ్చు… మొరార్జీ గాడి ధూర్తత చెప్పుకున్నాం కదా నిన్న..!!
Share this Article