మిత్రుడు మంగళంపల్లి శ్రీహరి పోస్టు ఓసారి సావధానంగా చదవండి…
అమ్మా కూతురు కల్యాణి సౌజీ స్నేహితుల్లా ఉంటారు… బెంగళూరులో జాబ్ లో జాయిన్ అయ్యాక మూన్నెల్లకి గానీ రావడం కుదరలేదు సౌజీకి…
మొదటి వారం రోజూ ఫోన్ మాట్లాడుకున్నా… షిఫ్టులు సరిగా ఉండకపోవడం… ఎక్కువ టైం వర్క్ ఉండడం వల్ల ఫోన్ కూడా కుదరలేదు…. ఇద్దరికీ…
ఈ వారం రోజులు అన్నీ చెప్పేసుకోవాలి… కూతురుకిష్టమైనవన్నీ చేసి పెట్టాలి…
రాత్రి తిన్నాక ఇద్దరూ రూఫ్ గార్డెన్ లో కూర్చున్నారు…
ఎలా ఉందే బెంగళూరు…?
ఫైన్ మామ్… ట్రాఫిక్ ఇబ్బంది తప్ప… మన హైదరాబాద్ కంటే వెదర్ బాగానే ఉంది…
ఫుడ్ ఎలా ఉంది…?
Ads
ఫస్ట్ వన్ వీక్ తప్ప… ఇప్పుడు అంతా బాగానే ఉంది…
మరి ఆ హాస్టల్లో బాలేదన్నావు కదా… ఇప్పుడు చెఫ్ మారాడా ఏంటి…
లేదు మామ్… నేనే హాస్టల్ వదిలేసా… ఫ్లాట్ తీసుకున్నాం కదా…
తీసుకున్నాం అంటున్నావు…ఎ వరెవరూ…
రాకేష్ నేనూ….
ఒక్కసారి అదిరిపడింది కల్యాణి… మైండ్ బ్లాంక్ అయిపోయింది…
కూల్ మామ్… నువ్వేమీ ఎక్కువ టెన్షన్ పడకు… మేమిద్దరం సిట్యుయేషన్షిప్ లో ఉన్నాం….
అంటే సహజీవనమా… అంది కళ్యాణి తన నాలెడ్జ్ అంతా ఉపయోగించి…
కాదమ్మా… దాంట్లో ఓ కమిట్మెంట్ ఉంటుంది… ఇందులో మనకి అలాంటివేమీ ఉండవు…
అంటే… ఫిజికల్ రిలేషన్ కూడా ఉంటుందా… ఉందా… అంది వణుకుతూ…
ఇష్టం అయితే ఉంటుంది మామ్… మా రిలేషన్షిప్ లో ఒక క్లారిటీ లేనప్పుడు…ఎ మోషనల్ గా బాండింగ్ ఎందుకు… విడిపోయేటప్పుడు అనవసరమైన డ్రామా కూడా ఉండదు…
కళ్యాణి కళ్లు తిరుగుతున్నాయి… 70 ,80 ల్లో పుట్టిన మనిషి కదా…
వీళ్ళ డాడీకి చెబితే ఇది ఏ మాత్రం అర్థం కాదు… ఉపయోగమూ లేదు…
అంటే ఏ కట్టుబాటు లేని… ఏ బాదరబంది లేని … ఎటువంటి మానసిక కృంగుబాటూ ఉండబోని… తాత్కాలిక సంబంధం…
సి.. ట్యు… యే… ష.. న్.. షి ప్…
ఇంకా కళ్యాణికి బెంచింగ్ గురించి… కఫ్ఫింగ్ గురించీ కూడా తెలియాలి…
బెంచిన్గ్ అంటే… పార్టనర్ మిమ్మల్ని ఇష్టపడతారు… కానీ ఇంకా పూర్తిగా కలిసుండే అంత పరిస్థితి నమ్మకం లేదు… అందుకని కొంత కాలం ఇంకా అవకాశాలు ఇచ్చి పుచ్చుకుంటారు… లాక్ చేసుకోరు ఒకరిని ఒకరు… ఒక చోటే కలిసి ఉంటారు కూడా…. అన్ని విధాలా…
ఇంక కఫ్ఫింగ్ అంటే… శీతాకాలం … అంటే చల్లటి వేళలో వెచ్చదనం కోసం కలిసి… వేసవిలో విడిపోవడం అన్నమాట…
ఈ కొత్తిజం మన దేశంలోకి రకరకాల రూపాల్లోకి దిగి చాన్నాళ్లయ్యింది… ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పింది కాదు…
హైదరాబాద్ లో కూడా చాలా జంటలు ఇలాగే ఉంటున్నాయి.. జెన్ – జెడ్ అంటే… ఇప్పుడు ఇరవై లోపు ఉన్న పిల్లలందరికీ ఈ రకరకాల రిలేషన్ షిప్పుల గురించి బోల్డంత అవగాహన ఉంది…
ఈ ఫేసుబుక్కు సైన్యం అంతా ఉత్తమోత్తమ సాంస్కృతిక వ్యవహారాల చర్చల్లో మునిగి తేలితే… మన పిల్ల సైన్యం మాత్రం ఇన్స్ట స్నాప్ ల్లో యాభైకి పైగా ఉన్న కొత్త బంధాల పరిధిలో ఉన్నారు… ఇది తెలుసుకోవడానికి ఇష్టపడని వాళ్ళూ నా మిత్రుల్లో ఉండి ఉంటారు… ఇప్పటికే తెలిసినా చర్చించడానికి ఇమేజ్ పోతుందని భయపడుతూ ఉంటారు…
నేను సిన్మా వాడ్ని కదా.. కొంచెం ధైర్యం ఎక్కువ… ముంబై లో చేసిన ఒక సర్వే లో జెన్ – జెడ్ పిల్లల్లో 70 శాతం మంది కమిట్మెంట్ ఉన్న బంధాన్ని కోరుకోవడం లేదని తేలిందట… అబద్ధం కావచ్చు…
ఇది చదువుతుంటే… మానవ సంబంధాలు, పెళ్లిళ్లు, భౌతిక సంబంధాలు, ఆడామగా బంధాలకు సంబంధించి కాలం ఎంత పరిణామ దశలో ఉందో తలుచుకుంటే విస్మయం కలుగుతోంది… ఇది స్వయంసమృద్ధ కాలం… ఎవరినీ ఏదీ నిర్దేశించలేదు… ఎవరి ఇష్టానుసారం వాళ్ల జీవనగమనం…
అప్పట్లో, అంటే చాలా ఏళ్ల క్రితమే… బహుశా యండమూరి కావచ్చు, ఆ నవల ఆనందోబ్రహ్మ కావచ్చు… ‘‘ఇంట్లో గోడల్లేవు, కర్టెన్లు తప్ప… పెళ్లి గాకముందే కూతురు గర్భవతి అని తెలిసి ఆయన ఏమీ మండిపడలేదు… బీపీ తెచ్చుకోలేదు… ఆమాత్రం జాగ్రత్తలు తీసుకోలేకపోయావా అని విసుక్కుంటాడు, అంతే…’’
ఆశ్చర్యపోకండి… ఇంకా చాలా చూడాలి మనం… లావణ్య – రాజ్ తరుణ్ కథ ఫాలో అవుతున్నారా..? ఆడ- మగ తేడా లేదు… ఏమిటామె తెగింపు అని మరీ హాశ్చర్యపోవద్దు… ఇంకా మనం చాలా చూడబోతున్నాం… మన తరువాతి తరం ఇంకా విపరీత పరిణామాల్ని కూడా చూడబోతోంది… సారీ, విపరీత అనే పదం కరెక్ట్ కాదేమో… పరిణామ దశలో ఇవన్నీ సహజమేనేమో..!!
‘‘చూశావా పిన్నీ… గతంలో పెళ్లి అనే బంధంలో జీవితాంతం బందీలుగా ఉండేవారట…’’ అని అమ్మలక్కలు వీడియో కాల్స్‌లో నవ్వుకునే రోజులు చూడబోతున్నాం… ఎస్, మనం గాకపోతే మన తరువాత తరం..!! ‘‘అవునట, ఆ ఎదురు ఫ్లాటులో ఉన్నామె ఐదేళ్లయింది, ఇంకా అతనితోనే ఉంటోందట, చిత్రంగా…’’ అనే జవాబు ఆ పిన్నికి వస్తుంది..!!
Share this Article