.
పల్లె గుండె గులాల్… ఎగసిన గులాబీ జెండా… హస్తం పార్టీకి ముచ్చెమటలు… కారు జోరుకు ‘చెయ్యి’ విరిగిన కాంగ్రెస్… బీఆర్ఎస్ హవా…
ఈ విశేషణాలు, ఈ విశ్లేషణలు బీఆర్ఎస్ క్యాంపు నుంచి వినిపిస్తుంటే నవ్వొస్తుంది… ఏందీ, బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయా…? కాంగ్రెస్ మీద ఆధిక్యత వచ్చిందా అనే డౌట్ వచ్చేలా రాతలు, కూతలు…!!
Ads
నిజానికి జరిగింది ఏమిటి..? రెండు విడతల్లోనూ కాంగ్రెస్‌కు సగానికి ఎక్కువ సీట్లు… బీఆర్ఎస్‌కన్నా రెట్టింపు సీట్లు సాధించింది… మరి అంత స్పష్టమైన ఆధిక్యతను… నిజం చెప్పాలంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకన్నా ఎక్కువ ఆధిపత్యాన్ని సాధించిన కాంగ్రెస్ ఏమని చెప్పుకోవాలి ఇక..!?
అబద్ధాలతో ఆనందంగా జబ్బలు చరుచుకునే ఈ ధోరణికి తెలుగులో ఏ పదం ఉందో తెలియదు… ఈ వార్తలు చూడండి…

మరిక గులాబీ పరిమళాలు ఏమున్నట్టు..? గులాల్ చల్లుకునే ఆనంద సందోహం ఏమున్నట్టు..? అంటే, ఎంపీ ఎన్నికల నాటి పరాభవంకన్నా ఘోరమైన రిజల్ట్ వస్తుందనుకున్నాం, ఇప్పుడు కాస్త నయమే అనే ఆత్మానందమా ఇది..? లేక ఎంపీ ఎన్నికల నాటితో పోలిస్తే దారుణంగా చతికిలపడిన, దయనీయంగా ఉన్న బీజేపీని చూసి సంబరమా..? మేమే కాంగ్రెస్‌కు ప్రతిపక్షం అనే మాటలు అందుకేనా..?
ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే..? రెండు దశల్లోనూ సేమ్ రిజల్ట్… తరువాత విడతలో కూడా ఇదే రిపీట్ అవుతుంది… ఐతే… మామూలు పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు పెద్ద పెద్ద బాష్యాలు ఉండవు…
ఎందుకంటే… పల్లెల్లో రాజకీయాలు వేరు… పార్టీలు కావు, వ్యక్తులు- కులాలు- కూటములు- రకరకాల సమీకరణాలు పనిచేస్తాయి… అలాగే పట్టణాల్లో ఆయా స్థానిక పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి… కాకపోతే స్థూలంగా రాష్ట్రంలో జనం మూడ్ ఎలా ఉందనే ఓ సూచనను అందిస్తాయి… సూచనప్రాయంగా..!!

ఉదాహరణకు… కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుందాం… పట్టణాలు, పల్లెల్లోనూ స్పష్టంగా సీపీఎం (లెఫ్ట్) ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉందనే మూడ్, ట్రెండ్, ఇండికేషన్ కనిపించింది… చివరకు రాజధానిని కూడా బీజేపీకి వదిలేసుకుంది సీపీఎం… కాంగ్రెస్ కూటమి (యూడీఎఫ్) చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది…
ఇదే ధోరణి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు… కానీ జనం మార్పు కోరుకుంటున్నారనే ఓ సూచన కనిపించింది… తెలంగాణకు వద్దాం… గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చిందే తప్ప మొత్తంగా బీఆర్ఎస్ మీద బంపర్ మెజారిటీ ఏమీ రాలేదు… కాకపోతే ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కలిపి కొట్టిన దెబ్బలకు బీఆర్ఎస్ మరింత మట్టికరిచింది…
మరి ఇప్పుడు..? మొన్నటి జుబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం గానీ, నేటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు గానీ… బీఆర్ఎస్ పట్ల వోటరు వ్యతిరేకతను చెప్పడమే కాదు… కాంగ్రెస్ ఇంకా ఇంకా బీఆర్ఎస్ మీద సాధిస్తున్న ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి…
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి… ఇది ఓ జనరల్ అబ్జర్వేషన్… అది అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు, నిన్నామొన్నటి కేరళ వోటరు తీర్పులాగా..! తెలంగాణ స్థానిక ఎన్నికల తీర్పు పరిశీలిస్తే ఒకటి మాత్రం నిజం…
బీజేపీకన్నా బీఆర్ఎస్ బెటరే… తెలంగాణ ఆత్మను వదిలేసుకుని, పరాజయ భారంతో అధినేత అజ్ఞాతవాసంలో బతుకుతున్నా సరే, దాని పునాదులింకా బలంగానే ఉన్నాయి… ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ మీద ఆధిక్యత సాధించేంత సీన్ ఏమీ లేకపోయినా… రాబోయేది మా రాజ్యమే అని బీజేపీ సగటు కార్యకర్త చెప్పగలిగేంత సీన్ మాత్రం లేదనే స్పష్టతను గ్రామీణ వోటరు ఇచ్చాడు…
ఎంపీ ఎన్నికల్లో వోటరు దేశనాయకుడిని, జాతీయ అంశాలను చూస్తాడు… మోడీ ఫ్యాక్టర్ కనిపించింది… అదే అసెంబ్లీ ఎన్నికల్లో వోటరు పార్టీల ధోరణులతోపాటు నాయకుడు ఎవరా అని చూస్తాడు… అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌లాగా డామినేట్ చేసే నాయకుడు, అన్నీ తానై నడిపించే కనిపించలేదు… అందుకే రెండుసార్లు వరుస ఓటములు… తరువాత రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చాక సీన్ రివర్స్… బీఆర్ఎస్ క్లీన్ బౌల్డ్… సో, పార్టీయే కాదు, నాయకుడూ ముఖ్యమే…
ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది గ్రూపులుగా ఉన్న బీజేపీ నుంచి ఇప్పటికిప్పుడు ఆశించేదేమీ ఉండదు… బీఆర్ఎస్‌లో యూటీ, బీటీ బ్యాచులు కలిసిపోయి, అందినకాడికి దండుకున్నాయి… దాని తీవ్రత ఏమిటో సాక్షాత్తూ దొరవారి బిడ్డే చెబుతోంది… కానీ బీజేపీలో సంఘ్ బ్యాచ్, నాన్-సంఘ్ బ్యాచ్‌కు నడుమ ఏమాత్రం సయోధ్య లేదు… నడిపించే నాయకుడు లేడు… ఇంకా ఇంకా కేసీయార్‌కే కోవర్టులుగా పనిచేస్తారనే అపప్రథ ఉన్న కొందరు నాయకులతో ఊదు కాలదు… పీరు లేవదు…!!
Share this Article