ప్చ్… వింత అంటే ఇదీ… మనుషుల మెదళ్లలో నానారకాల కాలుష్యాల్ని నింపే టీవీ సీరియళ్ల ద్వారా ఓ పురాణ విషయాన్ని తెలుసుకోవడం..! అదుగో మరి… మీరూ అపనమ్మకంతో చూస్తున్నారు… నిజమే… నిన్న ఏదో సీరియల్‌ను చూడబడ్డాను కాసేపు… అందులో ఓ నిమిషం బిట్ ఇంట్రస్టింగ్ అనిపించింది… ఆహా, నానా చెత్తాచెదారం నడుమ ఇదొక్కటీ భలే మెరిసిందే అనుకున్నాను…
మామూలుగా దేవుళ్లకు వాహనాలు ఉంటాయి తెలుసు కదా… ఆయా దేవుళ్లతో సమానంగా పూజలు అందుకుంటాయి ఆ వాహనాలు… సపోజ్, వినాయకుడికి ఎలుక, విష్ణుమూర్తికి గరుత్మంతుడు, శివుడికి నంది, కుమారస్వామికి నెమలి, యముడికి మహిషం, కాళిమాతకు సింహం… ఇలా… కుబేరుడి వాహనాలపై మళ్లీ కాస్త సందిగ్ధం… నరుడే వాహనమని సూచిస్తారు కొందరు… నిజం, మనిషి మీద స్వారీ చేసేది కుబేరుడే, అంటే డబ్బే… అది ప్రతీకాత్మక వాహనమా..? లేక పురాణాల్లో చెప్పిన నిజవాహనమా..? ఏనుగు, ముంగిస కూడా తన వాహనాలే అంటారు…
సరే, మరి హనుమంతుడికి ఓ వాహనం ఉందా…? ఇదీ ఓ డౌటనుమానం… ఒకసారి సరూర్‌నగర్‌లోని ఓ పాత ఆలయానికి వెళ్లినప్పుడు హనుమంతుడి విగ్రహం ఎదుట ఒంటె శిల్పం కనిపించింది… నిజమా..? హనుమంతుడి వాహనం లొట్టిపిట్టా..? అక్కడే అదే గుళ్లో పూజలు చేస్తున్న ఆచార్యులను అడిగితే అవునూకాదూ అన్నట్టుగా ఏదో చెప్పాడు… దగ్గరలోని మరో హనుమంతుడి ఆలయంలో అడిగినా అంతే… ఆ సందేహం అలాగే ఉండిపోయింది…
Ads
చాలా చాలా తక్కువ చోట్ల మాత్రమే ఆంజనేయుడు విగ్రహం ఎదురుగా ఒంటె కనిపిస్తుంది… అన్నిచోట్లా ఉండవు, అంతెందుకు ఆ పూజారులే సరిగ్గా చెప్పలేరు… దేవుళ్లతోపాటు వాహనాలు కూడా విగ్రహాల దగ్గరే ఉంటాయి… ఉదాహరణకు ఎలుక బొమ్మ లేకుండా దాదాపుగా వినాయకుడి విగ్రహం ఉండదు… కానీ హనుమంతుడి వాహనానికి ఆ ప్రాధాన్యత కూడా ఉండదు… అనుకోకుండా కలిసిన ఓ ప్రవచనకారుడిని ఇదే అడిగితే నవ్వి జవాబు దాటవేశాడు… అసలు ఒంటె వాహనమని కూడా తనకు తెలియదు…
సదరు జ్ఞానగుళికను బోధించిన టీవీ సీరియల్ చూస్తుంటే… ఓ పాత్ర స్పష్టతనిచ్చింది… అంత వేగంగా పయనించే, అంటే సముద్రాల్నే అవలీలగా లంఘించే హనుమంతుడికి మెల్లగా నడిచే ఒంటె వాహనం ఎలా అయ్యింది..? పంపానది తీరాన ఆంజనేయుడు నడుస్తున్నప్పుడు బలశాలి అయిన అతని బరువుకు పాదాలు ఇసుకలో కూరుకుపోతుండేవి అట… అప్పుడు శివుని వాహనం అయిన నంది ఒంటె రూపంలో తన స్వామి మరో అవతారానికి సేవ చేయాలి అని వచ్చాడట… (ఆంజనేయుడు రుద్రాంశ)…
ఆ బసవుడి కోరికను మన్నించి హనుమంతుడు ఆ ఒంటెను అధిరోహించాడని కథ… ఆ ఒంటె పేరు పులిన జవుడు… అంటే ఇసుకలో వేగంగా అడుగులు వేసేవాడు అని అర్థం… ఇదీ ఆ టీవీ సీరియల్ చెప్పిన కథ… వెతకగా వెతకగా ఇన్‌స్టాలో ఓచోట ఇంకాస్త వివరంగా కనిపించింది… ఇలా…
పంపా తీరమందు శ్రీరాముని దర్శనం పొందిన హనుమంతుడు రోజూ సేతు ప్రదక్షిణ చేసినట్లుగా పంపాతీరమందలి ఇసుకయందు కూడా విహారము చేయుచుండెడివాడు. ఇసుక తిన్నెల మీద వారి కష్టమయిన విహారం చూచి మైందుడు మొదలయిన వీరులు స్వామివారికి ఒక వాహనమును వారి ఆశయముతో కల్పించాలని ఆలోచించారు. హనుమంతుడు స్వజనులయిన వానర, భల్లూకాదులను వాహనంగా స్వీకరించటానికి అంగీకరించలేదు.
అప్పుడు హనుమత్పరివారము విభిన్న జంతువులను, పక్షులను పిలిపించారు. ఏనుగులు, గుఱ్ఱాలు, పులులు, సింహాలు, గాడిదలు, ఒంటెలు మొదలయిన జంతువులు; హంసలు, భేరుండపక్షులు, గరుడపక్షులు, చిలుకలు, నెమళ్ళు మొదలయిన పక్షిజాతులు సర్వాలంకార శోభితులై హనుమంతుని ముందు నిలిచి వివిధ రీతుల అటునడిచి, ఇటునడిచి విన్యాసాలు చేశాయి…
హనుమంతుడు ఆప్రదర్శనను తిలకించి ఒంటెను పిలిచి దానిని స్పృశిస్తూ, ఈ ఒంటె నాకు ఇష్టుడు. నేను శివునిగా ఉన్నప్పుడు నాకు నందిరూపంలో నిత్యము వాహనంగా ఉండేవాడు. నేను ఎప్పుడు వానరరూపాన్ని ధరించటానికి నిశ్చయించుకొన్నానో, అప్పుడు మీ అంశావతారంలో కూడా మీ వాహనంగా ఉండి సేవించే భాగ్యం అనుగ్రహించండి అని ప్రార్థించగా నేను ఆతని కోరికను అంగీకరించాను. ఆ నందియే తన అంశతో ఈ ఒంటెగా వచ్చాడు. ఇతని పేరు పులినజవుడు. నేను లోకంలో ఉష్ట్రవాహనుడనియు, ఉష్ట్రధ్వజుడనియు కీర్తిపొందెదను అని అన్నాడు.
అప్పుడు వానరులు ఒంటెను ఒంగునట్లు చేసి దానిపై పరుపును పరిచి సుఖకరమయిన ఆసనమును ఏర్పాటు చేశారు. సువర్చలా సమేతుడై హనుమంతుడు ఆ ఉష్ట్రాన్ని అధిరోహించగా వానరులందరూ వాహనోత్సవము జరిపారు… మళ్లీ ఇక్కడ బ్రహ్మచారి పక్కకు సువర్చల ఎలా వచ్చింది అనేది మరో కథ… మరో వివరణ… దాని జోలికి మనం ఇక్కడ పోవడం లేదు… సెలవు… చివరగా ఓ ప్రశ్న… పలు ఆలయాల్లో తాబేలు బొమ్మను గర్బగుడికి ఎదురుగా ప్రతిష్టిస్తారు దేనికి..? అది కూడా వాహనమా ఎవరికైనా..? లేక మరేదైనా విశేషమా..?
Share this Article