.
తిరుమల వెంకన్నను నిలువు దోపిడీ చేసే వ్యాపారులు కోకొల్లలు… లక్షల కోట్ల ఆస్తులు, వేల కోట్ల సంపాదన… ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన హిందూ దేవుడు… పైగా రాజకీయాలతో కలుషితమైన యాజమాన్యం… అక్కడ అన్నీ దందాలే…
ఏపీలో అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే, తాబేదార్లతో నిండిపోయే ట్రస్టు… దాదాపు అందరూ దేవుడి మీద భక్తుల ’ట్రస్టు‘కు గండికొట్టేవాళ్లే… దర్శనాలు, సేవలు… చివరకు స్వామికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మోసాలే… కానీ, అధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హయాంలో పరాకాష్ట…
రోజూ చదువుతూనే ఉన్నాం కదా… అసలు నెయ్యి కాని కెమికల్ నెయ్యితో లడ్డూలు… పరకామణిలోనే చోరీ యవ్వారాలు… గతంలోనూ బోలెడు చదివాం కదా, ఇప్పుడు తాజాగా మరొకటి… అసలు పట్టు కాని పాలిస్టర్ పట్టు శాలువాలు… ఇదీ తక్కువేం కాదు, 55 కోట్ల స్కాం…
Ads
అసలు ఏమిటి ఈ స్కామ్..?
ఆలయానికి ‘పట్టు’ పేరుతో ‘పాలిస్టర్’ దుపట్టా (శాలువా, కండువా)లను సరఫరా చేయడం… అన్ని స్కాముల్లాగే ఇదీ కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాాదు, దేశవిదేశాల్లోని భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని దెబ్బతీయడం… ఒక సాధారణ విజిలెన్స్ తనిఖీ ఈ భారీ మోసాన్ని బయటపెట్టింది…
తిరుపతిలోని గోదాము, వైభవోత్సవ మండపంలో ఉన్న కొత్త స్టాక్ నుండి నమూనాలను సేకరించి, అత్యున్నత వస్త్ర పరీక్షా ప్రయోగశాలలకు పంపిస్తే, రెండు ల్యాబ్‌లు కూడా ఆ మెటీరియల్‌ను సింథటిక్ (పాలిస్టర్) గా నిర్ధారించాయి…
సో, పట్టు పేరిట పాలిస్టర్ సరఫరా చేస్తున్న ఈ మోసం పది సుదీర్ఘ సంవత్సరాలు పాటు ఎవరికీ తెలియకుండా కొనసాగింది… M/s VRS ఎక్స్‌పోర్ట్ అనే కేంద్ర సంస్థ తమ ‘సోదర సంస్థలైన’ తిరుమల ఫ్యాబ్రిక్స్, నానా కాటేజెస్, VM రాజా పవర్ లూమ్ యూనిట్‌ల ద్వారా 2015 నుండి 2025 వరకు TTDకి మొత్తం ₹54,95 కోట్ల విలువైన వస్త్రాన్ని సరఫరా చేసింది… ఇది ఒక దశాబ్దం పాటు నిరంతరాయంగా కొనసాగింది…
ఈ సంస్థ వ్యాపార కేంద్రం నగరి… ఇది వైసీపీ మాజీ మంత్రి రోజా నియోజకవర్గం… ఐతే ఈ స్కామ్‌లో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్… నమూనాల మార్పిడి… అంటే పరీక్షల కోసం ల్యాబులకు పంపించే శాంపిల్స్…
గతంలో గోదాము నుంచి కాంచీపురంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్‌కు పంపిన నమూనా ‘పట్టు’గా ఆమోదం పొందింది… అంటే శాంపిల్స్ పంపించేటప్పుడు అసలు సిల్క్ దుపట్టాలు పంపించి, పట్టు అనే సర్టిఫికెట్ పొందేవాళ్లన్నమాట…
ఈసారి విజిలెన్స్ అధికారులు అదే స్టాక్ నుండి తీసిన నమూనాలను రొటీన్‌గా పంపించే కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డుకు బదులు బెంగళూరు, ధర్మవరంలోని ల్యాబ్‌లకు పంపించారు… రెండూ అవి పట్టు కాదని తేల్చేశాయి…
అంటే ఏమిటి..? శాంపిల్స్ మార్చారా..? లేక ల్యాబులోనే మేనేజ్ చేస్తున్నారా..? రెండూ జరుగుతున్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది…
టెండర్ నిబంధనల ప్రకారం శాలువా 100% స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో ఉండాలి, సిల్క్ మార్క్ హోలోగ్రామ్ కలిగి ఉండాలి, నిర్దిష్ట బరువు (కనీసం 180 గ్రాములు) మరియు కొలతలు ఉండాలి…
కానీ, సరఫరాదారు కేవలం ₹350 నుండి ₹400 విలువ చేసే పూర్తి పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసి, ఒక్కో శాలువాకు ₹1,389 చొప్పున TTDకి బిల్లు వేశారని విజిలెన్స్ నివేదిక చెబుతోంది…
కుంభకోణం పూర్తిగా బయటపడగానే, TTD బోర్డు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది… పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాల్సిందిగా డీజీ, ఏసీబీ (Anti-Corruption Bureau) ని కోరింది…
కొనసాగుతున్న అన్ని టెండర్లను వెంటనే రద్దు చేసింది… కేవలం 15 రోజుల ‘సర్వైవల్ స్టాక్’ కోసం మాత్రమే అత్యవసర కొనుగోళ్లకు ఆదేశించింది…

పెద్ద ప్రశ్న: పదేళ్లు ఎలా కొనసాగింది?
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత అసౌకర్యకరమైన ప్రశ్న ఏమిటంటే – ఇది పదేళ్లుగా ఎలా కొనసాగింది?. భారీ పరిమాణంలో కొనుగోళ్లు జరిగినా, టెండర్ నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘించినా, ఒకే సరఫరాదారు ఆధిపత్యం చెలాయించినా ఎవరూ పట్టుకోలేదా..? లేదా అందరికీ తెలిసే సాగుతోందా..?
ఇదే ఒక ప్రైవేట్ సంస్థలో జరిగితే… మొత్తం ఆ విభాగంలోని ఉద్యోగులందరినీ తొలగించేవాళ్లు… కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు జవాబుదారీగా ఉండాల్సిన TTD లో మాత్రం, ఈ మోసం పెరగడానికి వ్యవస్థే సహకరించింది…
పదేళ్లుగా పట్టు’ సడలని దోపిడీ అంటే… ఆ కాలంలో చంద్రబాబు ఏపీని ఉద్దరించిన అయిదేళ్ల కాలమూ ఉన్నట్టే కదా… ఆ తరువాత జగన్ పీరియడ్ సరేసరి…
భక్తులు భక్తితో సమర్పించిన కానుకలు, మోసగాళ్ల లాభాలుగా మారడం…, శ్రీవారికి సమర్పించే దుపట్టా కూడా ఓ మోసపూరిత వస్తువుగా మారడం… ఇదే అసలు గాయం, విశ్వాసానికి జరిగిన ద్రోహం…
దేవుడికి అత్యంత భక్తిపరులు నిలువుదోపిడీ ఇస్తుంటారు... కానీ, ఇక్కడ దేవుడినే నిలువు దోపిడీ చేస్తున్నారు... ఈ వ్యవస్థ అక్రమార్కుల్ని శిక్షించగలదా..? నెవ్వర్, ఎవరికీ నమ్మకం లేదు... స్వామీ, ఎందుకైనా మంచిది నీ ఆభరణాలు లెక్క ప్రకారం ఉన్నాయా, ఓసారి చెక్ చేయించు..
Share this Article