.
మంచి దర్శకుడు, అంటే సమర్థుడైన దర్శకుడు నటీనటులు ఎవరైనా సరే… తన కథను బట్టి, తన ప్రజెంటేషన్‌ను బట్టి, తనకు కావల్సిన నటనను పిండుకోగలడు… మరీ భావోద్వేగాలు ఇసుమంతైనా పలకని మొహాలైతే తప్ప…
ఒక సినిమాలో పేరున్న, పాపులర్, పెద్ద నటీనటులు ఉన్నంతమాత్రాన కథకు తగినట్టు పాత్రలకు న్యాయం చేస్తారని పూర్తిగా ఆశించలేం… పైగా పేరున్న నటీనటులు అయితే ఆమేరకు కథలో మార్పులుంటాయి, కథలో ఒరిజినాలిటీ దెబ్బతిని, అనవసర ఎలివేషన్లు, కమర్షియల్ అంశాలు జతచేరతాయి… స్థూలంగా అది మొదటికే మోసం తీసుకొస్తుంది…
Ads
ఇక చదవండి… వేణు యెల్దండి నుంచి పక్కా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో, బలమైన కుటుంబ బంధాల్ని ఆవిష్కరించగలిగిన బలగం సినిమాను మొదట్లో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు… తన నేపథ్యం అప్పటిదాకా జస్ట్ ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్… కానీ భలే తీశాడు సినిమాను, లక్షల మంది గ్రామీణులను కన్నీళ్లు పెట్టించాడు…
మరి అదే నమ్మకాన్ని తను ఇప్పుడు ఎందుకు తన రెండో సినిమాకు కనబరచలేకపోతున్నాడు..? సినిమా పేరు ఎల్లమ్మ అని పెట్టుకున్నాడు… అణిచివేతకు గురయ్యే ఓ గ్రామీణ గాయక కులానికి సంబంధించిన కథ అంటున్నారు… తనకెలాగూ క్లారిటీ ఉంటుంది… సగటు తెలుగు సినిమా అవలక్షణాలు, కమర్షియల్ దుర్వాసనలు ఏమీ ఉండవు అని ప్రేక్షకుడికీ కాస్త క్లారిటీ అయితే ఉంది…
మరెండు స్టార్ కేస్ట్ గురించి తహతహలాడుతున్నాడు… ముందే చెప్పినట్టు పేరున్న తారలైతే దర్శకుడికి స్వేచ్ఛ ఉండదు… బలగంలో ఎవరున్నారని పేరున్న నటులు..? చేయలేదా..? ఎంచక్కా ఆయా పాత్రల్లో దూరిపోయారు అందరూ… అప్పటికి ప్రియదర్శి మాత్రమే కాస్త పేరున్న నటుడు…
మరి ఇప్పుడు..? ఎల్లమ్మ ఎలాగూ ఓ మహిళ సెంట్రిక్ కథ అంటున్నారు కదా… మరి నాని కోసం ఎందుకు ప్రయత్నించినట్టు..? తను చేయనన్నాడు, తన కారణాలు తనకు ఉండొచ్చు… తరువాత నితిన్ నేనే చేస్తా అంటున్నాడు… తనవి అన్నీ వరుస ఫ్లాపులు, ఓ భిన్నమైన కేరక్టర్ కావాలి… దిల్ రాజు బలగం హిట్ తరువాత ఈ సినిమాకు ఎంత డబ్బయినా పెడతాను అంటున్నాడు…
ఇక్కడే వస్తుంది చిక్కు… వుమెన్ సెంట్రిక్ సినిమా అయితే నితిన్ ఎలా ఫిట్టవుతాడు..? తన కోసం మళ్లీ పాత్రల ప్రాధాన్యాల్ని మార్చాల్సి వస్తుంది… అలాంటప్పుడు నితిన్ ప్రభావం సినిమా మీద పడకుండా ఎవరైనా వేరే నటుడినే తీసుకోవాల్సిందేమో… అలాగే ప్రధాన పాత్ర… ముందుగా సాయిపల్లవి అనుకున్నారు…
ఆమె కన్నంతా ఇప్పుడు బాలీవుడ్ మీదే… కారణాలు ఏం చెప్పిందో గానీ ఆమె నో అనేసింది… కీర్తిసురేష్ అనుకున్నారు… మంచి చాయిసే… కానీ ఆమె కూడా నో చెప్పింది… శ్రీలీల అనుకున్నారు… ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తే అవి ఫ్లాప్ కాబట్టి మళ్లీ వీళ్లే వద్దనుకున్నారట… రెండు ఫెయిలైతే ఇది పాస్ కావద్దని ఏముంది..? పైగా శ్రీలీల ఇప్పటిదాకా కమర్షియల్ పాత్రలు, పిచ్చి స్టెప్పులు తప్ప కాస్త నటనను చూపించగల పాత్రలు ఏవీ చేయలేదు…
సో, కథ మళ్లీ మొదటికొచ్చింది… ఇక్కడే అసలు ప్రశ్న… బలగం మామూలు నటీనటులతో బాగా తీయగలిగినప్పుడు, హిట్ చేయగలిగినప్పుడు… ఆ నమ్మకం ఇప్పుడు ఎల్లమ్మ మీద ఎందుకు కనిపించడం లేదు..? లేరా…? వాళ్లో వీళ్లో ఎందుకు..? తెలుగులో పర్‌ఫామ్ చేయగల హీరోయిన్లు లేరా,.?
జస్ట్, ఒకటీరెండు ఉదాహరణలు,.. బేబీ సినిమాతో పాపులరైన వైష్ణవి చైతన్య… హైదరాబాదీ… డాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ తెలుసు ఆ అమ్మాయికి… అనన్య నాగళ్ల, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది… మల్లేశంలో చేసింది… కోర్టు సినిమాతో లైట్ లైట్‌లోకి వచ్చిన తెలుగు అమ్మాయి కాకినాడ శ్రీదేవి…
మరీ రష్మిక, త్రిష, తమన్నా, నయనతార, అనుష్క, సమంతలు దొరకరు, దొరికినా వాళ్లతో పర్‌ఫామ్ చేయించాలంటే వేణుకు చుక్కలు కనిపిస్తాయి… చేయలేరని కాదు, కష్టం అని…
పరభాష తారలైనా పర్లేదు అనుకుంటే… మాళవిక మోహనన్, సప్తమి గౌడ, మమత బైజు, నిత్యా మేనన్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఆశిక రంగనాథ్, నజ్రియా… ఎవరూ తక్కువ కాదు… అంతెందుకు..? తెలుగు సీరియళ్లలో బాగా పర్‌ఫామ్ చేస్తున్నవాళ్లూ బోలెడు మంది… ఎటొచ్చీ దర్శకుడిలో కనిపించాల్సింది నమ్మకం..!!
Share this Article