హమారే రామ్ ఆగయే హై… ఇదీ నిన్న మోడీ మాట… రాముడు కొత్తగా రావడం ఏమిటి..? కొలువు దీరడం ఏమిటి..? ఆల్‌రెడీ అక్కడే ఉన్నాడు రాముడు, హమారే ఏమిటి… రాముడు అందరివాడు కదా… అక్కడ ఉన్న రాముడికి ఓ కొత్త విగ్రహం ఏర్పాటు, దానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ… జరిగింది ఆ ఆలయ పునర్నిర్మాణం… ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టేయండి… కీలక సందర్భాల్లో, కీలక వ్యక్తుల మాటల ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే…
ఈరోజు దాదాపు ప్రతి మీడియా ‘రాముడొచ్చాడు’ అనే శీర్షికలతోనే బ్యానర్లు రాసుకున్నయ్… టీవీ వార్తలకు అదే హెడింగ్… అదంతే, ఇక సూక్ష్మ పరిశీలనలోకి వెళ్లొద్దు… మరి అదే మోడీ అక్కడ ఇంకా ఏమన్నాడు… ఇదీ…
‘‘తరువాత ఏమిటి..? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటని అయోధ్య ప్రశ్నిస్తోంది… బలమైన, ఘనమైన, దివ్యమైన భారత్‌ను వచ్చే వెయ్యేళ్ల కోసం నిర్మించాలి… దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్… ఇదీ మన నినాదం…’’ ఇదీ మోడీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన వాక్యాలు… మోడీ మాటలు పెద్ద స్ట్రెయిట్‌గా ఉండవు, గుంభనంగా ఏదో గంభీర, మార్మిక భావన ఉన్నట్టు ధ్వనిస్తాయి… వాటిని వేర్వేరుగా బాష్యాలు చెప్పుకోవడానికి ఆస్కారమిస్తాయి…
Ads
ఈ ప్రసంగం విన్న వెంటనే చాలా సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి… వాళ్లు అర్థం చేసుకున్నది ఏమిటంటే..? ‘‘వాట్ నెక్స్ట్ అన్నాడు… అదీ అయోధ్య పూర్తయ్యాక, ఆ వేదిక మీదే అన్నాడు… అంటే ఇక మధుర, వారణాశి గుళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని మోడీ చెబుతున్నాడు… తదుపరి ఎజెండాను గుర్తుచేస్తున్నాడు… ఇక తరువాత ఆ గుళ్లే… జై శ్రీకృష్ణ, జైవిశ్వనాథ…’’ ఇలా సాగాయి ఆ పోస్టుల సారాంశం… కానీ మోడీ మాటల్లో అర్థం అది కాదేమో…
ఎంతోకాలంగా కాషాయశిబిరం ఎజెండాలో ఉన్న గుళ్లలో ఆ రెండూ ఉన్నమాట నిజమే… జ్ఞానవాపి కట్టడం మీద ఆల్‌రెడీ రచ్చ రగులుకుంటూనే ఉంది… రీసెంటుగా హైకోర్టు సర్వేకు అనుకూల తీర్పు, తరువాత సుప్రీంకోర్టు స్టే తదితర పరిణామాల్ని చూస్తున్నాం… జ్ఞానవాపి పాత శివాలయాన్ని కూల్చి 1669లో ఔరంగజేబు మసీదు కట్టాడని చరిత్ర… పాత గుడి అవశేషాలు స్పష్టంగా, ప్రముఖంగా కనిపిస్తూనే ఉంటాయి… వేల గుళ్లను కూల్చేయించిన ఔరంగజేబు ఖాతాలోనే మధుర గుడి కూడా… 1670 లో…
అయోధ్య వేరు, కాశి వేరు, మధుర వేరు… అయోధ్యలో ఓ పాడుబడిన కట్టడమే దర్శనమిచ్చేది… కానీ కాశిలో భక్తగణం ఏళ్లుగా ఆరాధిస్తున్న విశ్వనాథ మందిరాన్ని ఇదే మోడీ – యోగీ డబుల్ ఇంజన్ సర్కారు ఆధునీకరించింది… గంగా తీరం నుంచి గుడి దాాకా రూపురేఖలే మారిపోయాయి… మధురలో కూడా నిత్యపూజలున్నయ్… ఇలా ఒక్కొక్క గుడికి ఒక్కో నేపథ్యం…
కేవలం మంటల్ని రాజేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు, అయోధ్య కూడా చట్టబద్ధమైన, సరైన పద్ధతిలో మాత్రమే పరిష్కారమైంది… (సమస్యను తెర మీదకు తీసుకురావడానికి ఆ కట్టడం నేలమట్టం కావడం కారణమైందనే వాదన కూడా ఉంది…) ఐతే సమస్యకు పరిష్కారాన్ని సరైన దిశలో లీడ్, డీల్ చేయగల నాయకత్వం అవసరం… మోడీ నిన్నటి మాటల్లో కూడా ‘తరువాత ఏమిటి’ అనే పదాలకు సమాధానం మాత్రం మధుర, కాశి కావేమో… తను చెబుతున్నది వేరు… అవన్నీ సరే, ముందుగా మనం ఓ బలమైన భారత్‌ను నిర్మించాలి అనేది తన ఉద్దేశం…
దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్… మర్మం అదే… దేవుడి నుంచి దేశం వైపు, రాముడి నుంచి రాజ్యం వైపు ప్రయాణిద్దాం అంటున్నాడు… ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, అయోధ్య… ఈ మూడు బీజేపీ ఈ పదేళ్లలో తన ఎజెండాలో పూర్తిచేసిన లక్ష్యాలు… కానీ బలమైన భారత్ దిశలో చాలా అడ్డంకులు ఉన్నయ్… మనలోని అనైక్యత ప్రధాన కారణం… విజ్జత, వివేచన లేని విపక్షం మరో సమస్య… మోడీ చెబుతున్నదీ ఐక్యత గురించే… దేశమే ముందు అనే భావన పెరగాలంటున్నాడు…
కామన్ సివిల్ కోడ్, సీఏఏ వంటి సంక్లిష్ట అంశాలే కాదు.., ప్రాంతీయ- విచ్చిన్నకర, అవినీతి శక్తులు, విదేశీ తొత్తుల కోరలు పీకడం కూడా… మోడీ మాటలు ఆ దిశనే సూచిస్తున్నాయేమో… మరి ఆ దిశలో కార్యాచరణ, అంటే ఎజెండాలో ఉన్న అంశాలేమిటేమిటి..? ఆ వివరణ రాబోయే ఎన్నికల ఎజెండాలో సూచనప్రాయంగా ఉండవచ్చునేమో… అంటే మధుర, కాశి వదిలేసినట్టేనా..? కాదు… యావత్ హిందూ సమాజం ముందు నుంచీ చెబుతున్నది ఈ మూడు ఆలయాల్ని మాకు అప్పగించండీ అని… దానికి వ్యతిరేకంగా మోడీ పోలేడు… పోవాలనుకుంటే మోడీయే పోతాడు… అంటే, దిగిపోతాడు… సో, మోడీ చెబుతున్నది కేవలం ప్రయారిటీల గురించి మాత్రమే..!!
Share this Article