Sridhar Bollepalli…………… సౌతిండియా సునామీ.. యష్…. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. వయసు 36. కాలేజీ రోజుల్లోనే వొక డ్రామా కంపెనీలో చేరి స్టేజీ మీద యాక్ట్ చేశాడు. పద్దెనిమిదేళ్ల వయసులో టీవీ సీరియల్లో చేసే అవకాశం వచ్చింది. నాలుగేళ్ల తర్వాత మొదటి సినిమా ఛాన్సు. ఫస్ట్ సినిమా ఎవరికీ పెద్దగా పట్టినట్టు లేదు. రెండో సినిమా “మొగ్గిన మనసు” హిట్. 2008 లో వచ్చిన యీ సినిమాలో హీరోయిన్ రాధికా పండిట్.
మొదట్లో పడేది కాదు. ఎనిమిదేళ్ల తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వెండితెర కెరీర్ మొదలెట్టిన మొదటి పదేళ్లలో దాదాపు డజనున్నర సినిమాలు చేశాడు. మంచి పేరే వచ్చిందిలే కానీ, కర్నాటక బయట అతని గురించి తెలిసినవాళ్లు పెద్దగా లేరనే చెప్పాలి. 2018 డిసెంబర్ 20 న కేజీయఫ్ – ఛాప్టర్ 1 రిలీజ్ అయ్యింది. ద రెస్ట్ యీజ్ హిస్టరీ…
యష్ కి మార్షల్ ఆర్ట్స్ వచ్చో రావో మనకి తెలీదు. కేజీయఫ్ వరకూ చూస్తే.. సుత్తిబెట్టి బలంగా మోదడం తప్ప, గొప్ప టెక్నిక్ తో ఫైట్స్ చేసినట్టు కనిపించదు. ఫిట్ గానే వున్నాడులే కానీ.. సిక్స్ ప్యాక్ కోసం సుడిపడలేదని తెలుస్తూనే వుంది. డాన్సులు కూడా యిరగదీసే టైపు కాదనే అనిపిస్తోంది. ఆవేశం, ప్రశాంతత తప్ప రెండో ఎక్స్ప్రెషన్ కనిపించలేదు కేజీయఫ్ లో ఎక్కడా. అతనికి చేయడం రాదని కాదు. సన్నివేశాలు పెద్దగా డిమాండ్ చేయలేదు. స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకోవాలనే ఆత్రం అతనెక్కడా ప్రదర్శించలేదు. కేజీయఫ్ రెండు ఛాప్టర్లలోనూ ఫైట్లు మినహాయిస్తే.. ఎక్కడా అలుపూ సొలుపూ లేకుండానే లాక్కొచ్చేశాడు. కానీ, యివాళ యష్ అనే పేరు భారద్దేశంలో వొక పెద్ద బ్రాండు..!
Ads
కేజీయఫ్ చూస్తున్నంతసేపూ నాకు “300” సినిమాలో జెరార్డ్ బట్లర్ గుర్తొచ్చాడు. తెలుగులో “300 మంది యోధులు” అనుకుంట. లాజిక్కులు అవసరం లేని వొక సూపర్ హ్యూమన్ ఆరా సినిమా అంతా కమ్ముకోని వుంటుంది. రజనీకాంత్ పీక్స్ లో వున్నప్పుడు అయినా సరే.. ఇదే సినిమా ఆయనతో తీస్తే యింత కన్విన్సింగా వుండేదా? కాదనే అనిపిస్తోంది నాకు. ఈ డైరెక్టర్ (ప్రశాంత్ నీల్), యీ హీరో కాకుండా యింకా వేరే ఏ కాంబో అయినా సరే.. కేజీయఫ్ అనేది కార్టూన్ ఫిల్ముకి ఎక్కువ, సీరియస్ యాక్షన్ ఫిల్ముకి తక్కువ అనే టాక్ తో డిజాస్టర్ అయ్యుండేదేమో. ఇంత విజన్ వున్నందుకు డైరెక్టర్ నీ, అంత రిస్క్ తీసుకున్నందుకు ప్రొడ్యూసర్స్ నీ అభినందించాలి.
“వాట్ నెక్స్ట్” అనేది యష్ కి పెద్ద ప్రశ్న కావొచ్చు. అతణ్ని వొక మానవాతీత శక్తిలా చూడడానికి అలవాటు పడిన జనాలు అతను చిల్లర విలన్లతో ఫైటింగులు చేయడాన్ని స్వాగతిస్తారా? చెప్పలేం. కన్నడ సోదరుల సైకాలజీ గురించి నాకు ఐడియా లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమా జూనియర్ ఎన్టీయార్ తో… కథని నమ్ముకోకుండా.. హీరో గ్లామర్, కేమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్, సెట్టింగుల మీద బేస్ అయిపోయి బ్లైండ్ గా ముందుకెళ్తాడేమో అనే భయం వుంది నాకు…
ప్రశాంత్ నీల్ కి వున్న టెక్నికల్ నాలెడ్జ్ కి మంచి స్టోరీ కూడా తోడైతే.. ఎన్టీయార్ స్టామినాని పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేయగల బీభత్సమైన కమర్షియల్ హిట్ ని ఆశించొచ్చు…. దీనికి ముందే ప్రభాస్ సలార్ రానుంది… అదీ సుప్రీం హీరోయిజమే… పార్ట్- 2 లో ఉన్నాడో పోయాడో తెలియకుండా మాయం అయిన కుర్రాడి పేరు సినిమాలో సలార్ ఫర్మాన్… తల్లి ఈశ్వరీ రావు. సలార్ క్యాస్టింగ్ లో కూడా అలానే ఉన్నాయ్ పేర్లు… చూడాలి… అదయ్యాక ఎన్టీఆర్ తో…!!
Share this Article