రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు సహజమే… తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా పాతుకుపోయి ఉంది… కేసీయార్ చాణక్యుడి బుర్రే దానికి అసలు బలం… ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్… రేప్పొద్దున మూడు పార్టీలూ బలంగా పోటీపడతాయా..? లేక బీజేపీ, కాంగ్రెస్ తన్నుకుని, వోట్లు చీలిపోయి, మళ్లీ కేసీయార్‌కు చాయిస్ ఇస్తారా అనేది వేరే సంగతి… రేపటి గురించి ఇప్పుడే చెప్పలేం.., రాజకీయాల్లో మితృత్వాలు, శతృత్వాలు రేపెలా ఉంటాయో చెప్పడం కష్టం…
అయితే కేవలం నాయకుల అవినీతి మీద మాత్రమే విమర్శలు చేస్తూ… నిర్మాణాత్మక వైఖరిని విడిచిపెడితే దాని వల్ల ఫాయిదా ఏమిటి..? ఇప్పుడు వరంగల్ రాహుల్ సభ లేవనెత్తిన చర్చ ఇది… ఎందుకంటే..? మేం అధికారంలోకి వస్తే, ఇదుగో, రైతులకు ఇది చేస్తాం అని ఓ డిక్లరేషన్ రిలీజ్ చేసింది కాంగ్రెస్… అది అధికారంలోకి వస్తుందా..? అమలు చేయగలదా..? అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయిస్తుందా..? అనేవి అప్రస్తుతాలు… పార్టీ తన సంకల్పాన్ని బహిరంగంగా, ఓ ఎన్నికల వాగ్దానంలాగా ప్రకటించింది… అదీ రాహుల్ గాంధీ ద్వారా హామీ ఇప్పించింది…
ఒకవైపు కేసీయార్‌ది కుటుంబ పాలన, అవినీతి పాలన, రాజరికం, నియంతృత్వం అని తెల్లారిలేస్తే ఇదే కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంటుంది… జనం వింటూనే ఉంటారు… కానీ ఆ విమర్శలకు తోడు ప్రజల కోణంలో ఇదీ మా రాబోయే కార్యాచరణ అని ఓ కన్‌స్ట్రక్టివ్ అడుగు వేసి చూపించింది కాంగ్రెస్… ఎంతోకొంత రైతాంగంలో, ప్రత్యేకించి కౌలు రైతుల్లో, కూలీల్లో చర్చ జరుగుతుంది… అయితే జనం ఈ హామీలపై కాంగ్రెస్‌ను నమ్ముతారా లేదానేది మళ్లీ వేరే విషయం…
Ads
ఇదేసమయంలో బీజేపీ ఏం చేస్తోంది..? ఎంతసేపూ కేసీయార్‌ను జైలులో పెడతాం అనే వీరంగాలు తప్ప… ఇదుగో, మేం గనుక అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం అనే ఒక్క మాట కూడా పార్టీ నేతల నుంచి రావడం లేదు… కేవలం మోడీ పాపులారిటీ మీద ఆధారపడి, కేసీయార్‌ను తిట్టి ఎన్నికల పోరులో తలపడటం కష్టం… ప్రజలు ఓ స్థాయి వరకే లీడర్ల మీద విమర్శలను వింటారు, తరువాత వినడం మానేస్తారు… ఓ లోకల్ ఎజెండా అవసరం… దాన్ని జనంలోకి తీసుకుపోవడం అవసరం…
ప్రత్యేకించి కేసీయార్ మీద ఏయే సెక్షన్లలో వ్యతిరేకత ఉందో గ్రహించడం, కారణాల్ని అధ్యయనం చేయడం, మేమేం చేస్తామో చెప్పడం… అదీ బీజేపీకి అవసరం… కానీ ఆ సోయి ఏమీ కనిపించడం లేదు… కేవలం మతప్రాతిపదికన వోట్ల సాధన తెలంగాణలో అంత సులభమేమీ కాదు… ఎహె, ఎన్నికలు ఎంతోదూరంలో ఉన్నాయి, అప్పటికి మేనిఫెస్టో ప్రకటిస్తాం కదా అనే సమర్థన వినరావచ్చు… కానీ ఆల్రెడీ జనంలోకి వెళ్లడం స్టార్ట్ చేసింది పార్టీ… బండి సంజయ్ పాదయాత్ర ఎన్నికల దిశలో సాగుతున్నదే… సో, ఓ ఎజెండా అవసరమే… మేనిఫెస్టో వేరు… అది తరువాత సంగతి…
పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి గనుక వస్తే బీజేపీకి కొంత ఫాయిదా… కానీ కేసీయార్ అలా రానివ్వడు… అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా రాష్ట్ర సమస్యలే ఎజెండా అవుతాయి… గత ఎన్నికల్లో ఈ వ్యూహంతో, ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీయార్ లబ్ధి పొందాడు… తను భయపడినట్టే పార్లమెంటు ఎన్నికల్లో చేదు ఫలితాలు పొందాడు… ఈ స్థితిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోణంలో బీజేపీకి ఓ క్లియర్ కట్ డైరెక్షన్ అవసరం… అసలు ఈ అవసరాన్ని పార్టీ గుర్తిస్తోందా అనేదే పెద్ద ప్రశ్న…!!
Share this Article