రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే…
చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన పాపులారిటీ కూడా ఒక కోణంలో అబ్బురమే… బట్, తెలుగు ప్రేక్షకలోకానికి సంబంధించి మాత్రమే… కాకపోతే రజినీ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, రాలేదు, రాడు కూడా… చిరంజీవి సొంత పార్టీ పెట్టి, ఏవో కొన్ని సీట్లు సాధించి, కేంద్ర మంత్రిగా కూడా చేసి, తరువాత మొత్తం డిస్పోజ్ చేసేసి, మళ్లీ వెండితెరకు అంకితమయ్యాడు…
Ads
రజినీ మేనరిజమ్స్ చిరంజీవి వల్ల కావు, చిరంజీవి డాన్సులు రజినీ చేయలేడు… ఐతే ఇప్పుడు ఈ వయస్సులో ఇద్దరూ ఓ సమస్థాయి సందిగ్ధతలో పడ్డారు… వయస్సు పైన పడుతోంది… ఫ్యాన్స్ ఎలివేషన్లను కోరుకుంటున్నారు, అవి తప్ప, ఆ కమర్షియల్ పోకడలు తప్ప ప్రయోగాలు చేయలేమని ఇద్దరికీ గాఢ నమ్మకం… ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడు వీళ్లిద్దరూ నటనకు పెద్దపీట వేసి, మంచి చిత్రాలు చేస్తారనేది ప్రేక్షకలోకం ప్రశ్న,..
రజినీకాంత్ రోబో తరువాత 13 ఏళ్లలో ఆ రేంజ్ సినిమా మళ్లీ రాలేదు… మొన్నామధ్య అనుకోకుండా (ఇతర భాషా హీరోలు కూడా కలిసి నటించిన) జైలర్ హిట్టు… చిరంజీవి కూడా వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చాక ‘ఇదీ మా బాస్ సినిమా’ అని చెప్పుకునే సినిమా లేదు, పైగా ఆచార్య విసిగించగా, భోళాశంకర్ దారుణమైన డిజాస్టర్… 2006 స్టాలిన్ తరువాత చిరంజీవిని ఆ రేంజులో చూపించిన సినిమా లేదు… సీన్ కట్ చేస్తే…
రజినీకాంత్ పాత్రను అతిథి పాత్ర అంటున్నారే గానీ… తాజా విడుదల లాల్ సలాంలో నిజానికి తనదే ప్రధాన పాత్ర… ఎక్కువ స్క్రీన్ టైమ్ తనదే… థియేటర్లకు రజినీ సినిమా అనుకునే రావాలి ప్రేక్షకుడు… సొంత బిడ్డ దర్శకత్వం… కానీ తెలుగులో మామూలు డిజాస్టర్ కాదు… పైగా తొలిరోజు నెగెటివ్ షేర్స్… (తమిళంలో కూడా పూర్ స్పందన)… రజినీకాంత్ వంటి హీరో కనిపిస్తే చాలు, మినిమం గ్యారంటీ సినిమా అనుకుంటారు కదా… తన సినిమాకు తొలిరోజే నెగెటివ్ షేర్ రెవిన్యూ అంటే… అది షాక్… మనకు తెలిసి రజినీకాంత్ సినిమా ఈ రేంజులో నోబజ్ ఫెయిల్యూర్ కావడం బహుశా ఇదే తొలిసారేమో…
అసలు విషయానికి వస్తే… చిరంజీవి తత్వాన్ని బట్టి ఇక ప్రయోగాల జోలికి పోడు… కాకపోతే మథనంలో పడ్డాడు… ఎక్కడ తప్పు చేస్తున్నాననే ఆలోచన మొదలైంది… అందుకే సూపర్ సుప్రీం సూపరెస్ట్ ఫాంటసీ కథలో విశ్వంభరను వెంటనే ముందుకు తీసుకొస్తున్నాడు… (తన ప్రతి సినిమాలోనూ ఆయన సూపరెస్టు హీరోయే కదా, ఇంకా అంతకుమించి ఫాంటసీ ఏముంటుంది అంటారా..? ఏమో…) ఎలివేషన్లు, బిల్డప్పులు మరో లెవల్‌కు తీసుకుపోతాడు… తెలుగు ప్రేక్షకుడు సై అంటాడా లేదా చూడాలిక…
ఎస్, రజినీకాంత్ ఖచ్చితంగా ఆలోచించాలి… జైలర్ మూవీ సమయంలో ఇదే ప్రశ్న వేస్తే తనూ నవ్వేవాడేమో… కానీ లాల్ సలాం ఫెయిల్యూర్‌తో తనను తెరపై చూస్తే చాలు కనకవర్షం కురిపిస్తారనే రోజులు గతించాయనే నిజాన్ని గుర్తించాలి… అలాగని తను కాలా, కబాలి అన్నా సరే జనం చూడటం లేదు… కిం కర్తవ్యం..? అదుగో అదే రజినీకాంత్ ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న… తను ప్లస్ చిరంజీవి ఎలాగూ మోహన్‌లాల్, మమ్ముట్టిలు కాలేరు… మరేం చేయాలి..?!
అబ్బే, సినిమాలు దేనికి, ఇన్నాళ్లూ సమాజం వాళ్లకు ఇంత వైభోగం ఇచ్చింది కదా, ఇంకా ఈ అర్జన వేషాలు దేనికి, సమాజానికి ప్రజాసేవ ద్వారా ఎంతోకొంత రిటర్న్ చేయొచ్చు కదా అంటారా..? (ప్రజాసేవ అనగానే మళ్లీ పాలిటిక్సు అనుకోకండి…) భలేవారే… తాము తెర మీద కనిపించడమే సమాజానికి తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ అనుకునే కేరక్టర్లు..!!
Share this Article