Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?

December 7, 2023 by M S R

ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు… దేశమంతా జరుగుతున్నదే… ఎమ్మెల్యేలు, ఎంపీల అమ్మకపు సరుకు కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ…! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం…

మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు… నేను అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..? అనేది తన ఆవేదన… నిజానికి కేసీయార్ కూడా అలా భావించాల్సిందే… తను ఏ ఆంధ్రులనైతే ద్వేషిస్తూ తన పొలిటికల్ కెరీర్‌ను పీక్స్‌లోకి తీసుకెళ్లాడో, ఆ ఆంధ్రులే ఈరోజు తన వెనుక నిలబడి వోట్లేశారు… హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కొన్ని ప్రాంతాల సీట్లు వాళ్ల పుణ్యమే… అవే లేకపోతే కేసీయార్ సీట్లు కూడా ఏ 23 దగ్గరోె ఆగిపోయేవి… ఇది రియాలిటీ…

ఏ తెలంగాణవాదాన్ని నమ్మాడో, ఏ తెలంగాణవాసినే నమ్మాడో ఆ తెలంగాణ మనిషే తనను నమ్మడం లేదు… అది స్వయంకృతం… ఇక్కడ ఆ కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు… కానీ ఆ కారణాల మథనం లేదు ఆ పార్టీలో… దిద్దుబాటు ప్రయత్నం లేదు… పైగా అప్పుడే మొదలు పెట్టేసింది… కేసీయార్ స్వగ్రామం చింతమడక నుంచి వందల మంది ఫామ్ హౌజుకు వచ్చి కేసీయార్‌ను ఓదార్చారు… తను అక్కడ పుట్టాడు అనే కారణంతో ఇంటికి పదీపదిహేను లక్షలు ఇచ్చాక ఆ కృతజ్ఞత లేకపోతేనే తప్పు… ఎవరు తీసుకొచ్చారు, ఈ ఓదార్పు యాత్ర ఎవరు ఆర్గనైజ్ చేశారనేది కాదు ఇక్కడ ప్రశ్న… అప్పుడే మొదలుపెట్టేశాడు కేసీయార్ అనేది గమనార్హం…

Ads

ఈరోజుకూ కేసీయార్ తన ఓటమిని వినమ్రంగా ప్రజల ఎదుట అంగీకరించలేదు… హూందాగా గవర్నర్ దగ్గరకు వెళ్లి రాజీనామా సమర్పించలేదు… ఆమెకు మొహం చూపించలేడు కాబట్టి…! ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని, ప్రజాతీర్పును గౌరవిస్తాననీ అనలేదు… పైగా బీఆర్ఎస్ నేతలు అప్పుడే ఏమంటున్నారు..? ‘‘ఆరు నెలలు ఆగండి, ఏడాది ఆగండి, మళ్లీ మేమే…’’ అని… ఇంకెవరో ముఖ్యనేత ఏదో అన్నాడు… ‘‘సింహంలా కేసీయార్ బయటికి వస్తాడు త్వరలో…’’ అని…

kadiyam

పార్టీ లీడర్ ఒకరు మరణిస్తే, ఆ సంతాప సభలో మాట్లాడుతూ కడియం శ్రీహరి అసందర్భ వ్యాఖ్యలకు దిగాడు… ‘‘మాకు 39 సీట్లు, మా మజ్లిస్ మా పక్షమే… బీజేపీ కూడా కలిసొస్తుంది… ఇంకొందరు కలిస్తే చాలు ఇక…’’ ఇదీ తన లెక్క… (నిజానికి ఎన్నికలకు ముందే తను కాంగ్రెస్‌ వైపు వెళ్లే చర్చలు, రాయబారాలు, ప్రతిపాదనలు వేరే కథ…) ఇక్కడ నిజంగా సిగ్గుపడాల్సింది బీజేపీ… రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎదిగే అవకాశాల్ని చేజేతులా నాశనం చేసుకుంది… బోలెడు ఎత్తుగడ లోపాలు…

అందుకే కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో, రఘునందన్ దుబ్బాకలో, ఈటల హుజూరాబాద్‌లో- గజ్వెల్‌లో, లక్ష్మణ్ ముషీరాబాద్‌లో… పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఓటమి… ఎంత సతాయించినా సరే మళ్లీ రాజాసింగ్ గెలిచాడు… కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు ఓ చరిత్ర… అంటే జనం స్పష్టంగా బీజేపీ హైకమాండ్‌కు చెబుతున్నారు… ఎవరు పార్టీకి అవసరమో, ఎవరు ఇప్పటికీ నష్టకారకులో… బీఆర్ఎస్ లీడర్లు బహిరంగంగానే బీజేపీ తమతో కలిసొస్తుంది అని చెబుతున్నారంటే విడ్డూరమే…

సరే, మజ్లిస్, బీజేపీ కలిసి మద్దతునిస్తాయా లేదా చూద్దాం గానీ మరి మెజారిటీకి మిగిలిన నంబర్ ఎలా..? ఏముంది..? కాంగ్రెస్ నుంచి లాగేయడమే… అలవాటైన కూసు విద్యే కదా… కాంగ్రెస్‌లో లేరా కేసీయార్ కోవర్టులు… ఈరోజుకూ ఢిల్లీ సంబంధాలతో రేవంత్ చుట్టూ చక్రబంధాన్ని బిగించి, అసలు రేవంత్ సీఎం గాకుండా ప్రయత్నించారు… (ఉత్తమ్ యవ్వారం మరీ అనుమానాస్పదం… తెలంగాణ ఏర్పాడ్డాక ఏళ్ల తరబడీ పార్టీని నష్టపరిచి, ఈరోజుకూ అదే ధోరణి…)

కడియం శ్రీహరి మాటలు, కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌రెడ్డికి అనివార్యంగా ఓ సంకేతం ఇస్తున్నారు… నీ ప్రభుత్వం స్థిరంగా నాలుగురోజులు ఉండాలంటే… ముందుగా తనదైన ‘బలాన్ని’ సమకూర్చుకోవాలని..! పార్టీలో సీనియర్లు ఎప్పటికైనా ప్రమాదమే… కేసీయార్ ఊరకే కూర్చోడని శ్రీహరి మాటలు చెబుతూనే ఉన్నాయి… సో, బీఆర్ఎస్ నుంచి లేదా బీజేపీ నుంచి… కొందరిని రేవంత్ తనవైపు ఎలాగోలా తెచ్చుకోవాల్సిన అనివార్య స్థితిలోకి తనను నెట్టేస్తున్నారు…

ఢిల్లీకి మూటలు తప్పవు, రాబోయే జనరల్ ఎన్నికల ఖర్చు అర్సుకునేది కర్నాటక, తెలంగాణ మాత్రమే… మరోవైపు పార్టీ ముఖ్యులను మేనేజ్ చేస్తుండాలి… అలవిమాలిన హామీలను అమలు చేయాలి… అదొక అగ్నిపరీక్ష… సో, తను పాలనపై ద‌ృష్టి పెట్టాలంటే ముందుగా తను ‘పదిలం’ కావాలి… అదే తన ప్రయారిటీ కావాలి… బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా తన పార్టీ సీనియర్లు కూడా తనకు పరోక్షంగా అదే చెబుతున్నాయి..!!

చివరగా… కడియం కాంగ్రెస్‌ను ఉసిరికాయల మూటగా వర్ణించాడు… అది మాత్రం నిజం… ఆ మూటను ఎలా బిగిస్తాడో, ఒక్క కాయ కూడా చెదిరిపోకుండా ఎలా కట్టడిలో పెట్టుకుంటాడో రేవంత్… మొత్తానికి కడియం రేవంత్‌ను భలే అలర్ట్ చేశాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions