ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా… 2 నెలల్లో కేంద్రంలో మార్పు తథ్యం, సంచలన వార్త వింటారు అని వ్యాఖ్యానిస్తే నిజంగా పెద్ద చర్చ జరగాలి… కానీ పెద్ద సారు కేసీయార్ చేసిన ఈ వ్యాఖ్య మీద నయాపైసా చర్చ లేదు… ఎందుకు..? క్రెడిబులిటీ సమస్య..!! గాయిగత్తర, అగ్గిపెడతా వంటి వ్యాఖ్యలతో, తన ఆచరణతో పోగొట్టుకున్న క్రెడిబులిటీ… తను ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్‌గా తీసుకునే సిట్యుయేషన్ లేదు… పీకేలు, ప్రకాష్‌రాజ్‌లు, టికాయత్‌లు ఆ క్రెడిబులిటీని ఇంకాస్త లోపలకు తొక్కేయగలరు గానీ, లేపలేరు… అదే జరుగుతోంది…
ఢిల్లీకి పోయాడు, మధ్యలోనే వాపస్ వచ్చాడు… కేజ్రీవాల్‌తో కలిసి వెళ్లి రైతు కుటుంబాలకు చెక్కులిచ్చాడు… అది కాస్తా తెలంగాణలో మైనస్ అయిపోయింది… జాతీయ స్థాయిలో మీడియా అస్సలు చూడలేదు… మరే ఇతర పార్టీ పట్టించుకోలేదు… యూపీలో సర్వభ్రష్టత్వం దశలో ఉన్న అఖిలేషుడు ఒక్కడు వచ్చి కలిశాడు… అంతే… ఇంకేమీ లేదు… శరద్ పవార్, మమత బెనర్జీ, స్టాలిన్, తేజస్వి యాదవ్ ఎట్సెట్రా ఒక్కరూ పట్టించుకోవడం లేదు… మరి..?
తీరా హైదరాబాద్‌కు వస్తే, ఇటు మోడీ వస్తున్నాడు… అర్జెంటుగా కెసిఆర్ దేవెగౌడ దగ్గరకు వెళ్లిపోయాడు… ఆ దేవెగౌడకు గతంలో పెద్దసారు చేసిన భూరిసాయాల నేపథ్యంలో ఆ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి… ఆ జేడీఎస్ పార్టీతో ఊదు కాలేది లేదు, పీరు లేచేది లేదు… మోడీ వాపస్ వెళ్లిపోయాక తిరిగొచ్చిన కేసీయార్ మళ్లీ ఫామ్ హౌజు వైపు వెళ్లిపోయాడు… రాలేగావ్ సిద్ధీ లేదు, అన్నా హాజారే లేడు… ఇంకెవరినీ కలిసేది లేదు… ఆయన అడుగుల్లో మిస్టరీ ఏమిటో నరమానవుడికి కూడా సమజ్ కాదు…
Ads
ఢిల్లీలో తెర వెనుక ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాదు… తన పర్యటనల మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతుపట్టదు, తెలియదు… చివరకు బొచ్చెడు స్పై కెమెరాలు, ఇయర్ బగ్స్ వాడే ఆంధ్రజ్యోతి వాడికి కూడా అంతుపట్టడం లేదు… పోనీ, 2 నెలల్లో సంచలనం, కేంద్రంలో మార్పు అంటే ఏమిటో ఊరకే అంచనాలు వేద్దాం…
- పాకిస్థాన్‌లోలాగా సైన్యం కుట్ర చేసి, మోడీని దింపేసి, ఇంకెవరైనా తోలుబొమ్మను ప్రతిష్ఠిస్తుందా..? ఇండియాలో ఆ ఆనవాయితీ లేదు, మొత్తం భద్రతా దళాల మీద అజిత్ ధోవల్ పెత్తనం ఉంది… తను మోడీ విధేయుడు… ఆ చాన్స్ కనిపించడం లేదు…
- గడ్కరీ తన ఆర్ఎస్ఎస్ మద్దతుతో మోడీపై తిరుగుబాటు చేసి, దింపేసి, తను ప్రధాని అవుతాడా..? అబ్బే, ఆర్ఎస్ఎస్ దానికీ చాన్స్ ఇవ్వదు… మోడీ, షా వ్యూహాలతో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ఎట్సెట్రా కాషాయ దళాలన్నీ వాళ్ల పట్టులోనే ఉన్నాయి… అద్వానీలు వంటి అతిరథుల్నే అవి వదిలేశాయి, మళ్లీ మోడీయే అధికారంలోకి తీసుకొస్తాడని నమ్ముతున్నయ్… అవెందుకు తిరగబడుతయ్..?
- పోనీ, బీజేపీలో ఓ పెద్ద సెక్షన్ తిరగబడి, ఏ కాంగ్రెస్ రాహుల్‌కో మద్దతు ప్రకటిస్తాయా..? అవి స్వచ్చందంగా ముందుకొచ్చినా సరే, స్వీకరించే స్థితిలో రాహుల్ లేడు… ఆ రేంజులో ఇంకో నాయకుడెవరూ కనిపించడం లేదు…
- ప్రాంతీయ పార్టీల నేతలందరూ మూకుమ్మడిగా రాజ్యాంగ ఉల్లంఘన చేసి, సహాయ నిరాకరణ ప్రకటించేసి… మోడీ దిగితేనే సరి అని భీష్మించుకుంటాయా..? అంత సీన్ లేదు… ప్రాంతీయ పార్టీల్లో అంత ఐక్యత లేదు… ఎవరి అవసరాలు వాళ్లవి… మోడీ స్వయంగా మీలో ఎవరైనా ప్రధాని పదవి తీసుకొండి బ్రదర్ అని పొరపాటున ఆఫర్ ఇస్తే, ప్రాంతీయ పార్టీ నేతలే భీకరంగా పదవి కోసం తన్నుకుంటారు…
- పంజాబ్ వెళ్లాడు కదా, కేజ్రీవాల్‌తో కలిసి రెండు రోజులు తిరిగాడు కదా, బలపడిపోతున్న ఖలిస్థానీ శక్తుల్ని అంచనా వేశాడా..? అవేమైనా హస్తినను హస్తగతం చేసుకుంటాయా..? అంత సీన్ లేదు… ఇండియన్ మిలిటరీ కమిటెడ్, పవర్‌ఫుల్… ఆ ఆటలేమీ సాగవు…
- అమిత్ షా మోడీతో తెగదెంపులు చేసుకుని, ఆదానీ ప్లస్ అంబానీ ఎట్సెట్రా కార్పొరేట్ విషశక్తుల మద్దతుతో తిరగబడి… మోడీని దింపేసి… కుర్చీ ఎక్కేస్తాడా..? అదీ నమ్మబుల్ కాదు… వాళ్లకు మోడీ అయినా ఒకటే, షా అయినా ఒకటే… డబ్బు ఖర్చు వేస్ట్ అనుకుంటారు…
- చైనా జిన్ పింగ్, రష్యా పుతిన్ కలిసి దాడి చేసి, పెత్తనం సంపాదించేసి ఏ సీతారాముడినో గద్దెనెక్కిస్తారా..? వాళ్ల గోచీబట్ట సర్దుకోవడానికే వాళ్లకు టైమ్ లేదు, ఆరోగ్యం లేదు… హాస్పిటల్స్ నుంచి వచ్చే సీన్ ప్రస్తుతానికి కనిపించడం లేదు… ఐనా ఊహకు, కల్పనకు కూడా పరిమితి ఉండాలి బ్రదర్…
- మరి ఇంకా ఏముంటుందబ్బా..?! ఏమో, మళ్లీ పెద్ద సారు బయటికి వచ్చి మాట్లాడినప్పుడు ఆలోచిద్దాం… అప్పటివరకూ సెలవు…
Share this Article