2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలే. మరికొందరి ఆలోచన భిన్నంగా ఉంది. అప్పటికే వరుసగా పదో విడత ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి ఎరుగని నాయకునిగా,14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల వృద్ధుడు, సినీ రచయితగా పేరుమోసి అభిమానులందరూ కలైంజ్ఞర్ (కళాకారుడు) అని పిలుచుకునే ముత్తువేల్ కరుణానిధి విషయంలో జయలలితకు అరెస్ట్ చేయించేంత కోపం ఉండకపోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది.
Ads
జయలలిత ఆలోచనావిధానాన్ని దగ్గరగా గమనిస్తూ ఉండే వారు మాత్రం ఆమె మొండి ఘటమనే చెబుతూ వచ్చారు. అలాంటివాళ్ళు సైతం కరుణానిధి అరెస్ట్ ను ఆశించకపోయినా, కచ్చితంగా ఊహించారు. కాకపోతే ఎప్పుడు, ఎలా జరుగుతుందన్నది మాత్రమే తెలియదు.
.
జూన్ 30 న ఆమె చెన్నై నుంచి గురువాయూర్ వెళ్లారు. ప్రత్యర్థులమీద ఆధిపత్యం కొనసాగటానికి గురువాయూర్ గుళ్ళో ఏనుగు దానమివ్వాలని ఒక పేరుమోసిన జ్యోతిష్కుడు ఆమెకు సలహా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 50 రోజులు నిండుతున్న సమయంలో గురువాయూరు వెళ్ళేముందు
ఆమె ఏం చేశారన్నదే అసలు కథ.
ఇక్కడ కొంత పాత కథ తెలుసుకోవాలి.
జయలలిత హయాంలో శ్మశానవాటికల నిర్మాణంలో కుంభకోణం జరిగిందనేది ఒక అభియోగం. అందులో జయలలిత మొదటి ముద్దాయి. ప్రజాపనుల శాఖామంత్రి సెల్వగణపతి రెండో ముద్దాయి ఇప్పుడు డిఎంకె మంత్రి). తెలుగువాడైన ఐఎఎస్ అధికారి జేటీ ఆచార్యులు (సొంత ఊరు కడపజిల్లా నందలూరు) మూడో ముద్దాయి. ఈ కేసులో ముగ్గురూ అరెస్టయ్యారు. కొడుకు పెళ్ళికి కూడా జేటీ ఆచార్యులుకు బెయిల్ దొరకలేదు.
***** ***** *****
జయలలిత ప్రభుత్వం రాగానే జేటీ ఆచార్యులుకు మళ్ళీ మంచి రోజులొచ్చాయి. నెలన్నరలోనే ఆయనకు మంచి పోస్ట్ సిద్ధమైంది. 2001 జూన్ 28 ఆచార్యులుకు చెన్నై నగరపాలకసంస్థ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అందులోనే నర్మ గర్భంగా ఆయనకు హింట్ ఇచ్చారు. 29 న ఆయన బాధ్యతలు చేపట్టారు. చెన్నైలో ఫ్లై ఓవర్లు కట్టటంలో అవినీతి జరిగిందని కొద్ది గంటల్లోనే అనుమానించటమే కాదు, నిఘా, ఆవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) కు అప్పగించటం, వాళ్ళు సీబీసీఐడీకి అప్పగించటం కూడా ఆగమేఘాలమీద జరిగిపోయింది. అదే వేగంతో ఆ రాత్రికే అరెస్టుకు రంగం సిద్ధమైంది.
సన్ టీవీ అంటే కరుణానిధి చానల్. ఆయన కుటుంబం నడుపుతున్న చానల్. డిఎంకె ని, కరుణానిధిని అనుక్షణం కాపాడుకోవటం ఆ చానల్ కర్తవ్యం. ఆ మాటకొస్తే, ఆ చానల్ ఉన్నది డిఎంకె కార్యాలయ భవనం ‘అన్నా అరివాలయం’ లోనే. అందుకే ఈ వార్త అందరికంటే బాగా కలవర పరచిందీ, అప్రమత్తం చేసిందీ సన్ టీవీనే.
ఫ్లై ఓవర్ల కుంభకోణంలో అప్పటి మేయర్ స్టాలిన్ ను అరెస్ట్ చేసే అవకాశముందనే సమాచారం మీడియాకు అందింది. ఆ రాత్రి 10 గంటలనుంచి పోలీసు వాహనాలు వేలచ్చేరిలోని స్టాలిన్ నివాసం పరిసరాలలో తిరగటం మొదలైంది. అప్పట్లో ఆ ప్రాంతం నగర శివార్లలో (నగరం నడిబొడ్డున ఉన్న సన్ టీవీ ఆఫీసుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో) ఉండేది. మీడియా కూడా స్టాలిన్ ఇంటి దగ్గర్లోనే తచ్చాడటం మొదలుపెట్టింది. సన్ టీవీ కూడా స్టాలిన్ అరెస్ట్ తప్పకపోవచ్చుననే నిర్ణయానికొచ్చింది. అక్కడికి రెండు కెమెరా యూనిట్లు పంపింది.
సన్ నెట్ వర్క్ లో భాగమైన జెమినీ టీవీ న్యూస్ విభాగంలో చీఫ్ ఎడిటర్ గా ఉన్నానప్పుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ న్యూస్ విభాగాలు అప్పట్లో చెన్నై నుంచే పనిచేసేవి. రాత్రి పదిన్నర న్యూస్ తరువాత ఇంటికి బయల్దేరుతూ, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయమని చెప్పా.
ఇంటికెళ్ళిన కాసేపటికే ఫోనొచ్చింది. స్టాలిన్ అరెస్ట్ ఖాయమైందని, ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు. ఎందుకైనా మంచిదని వెంటనే ఆఫీస్ చేరిపోయా. రెండు రోజుల పాటు అక్కడే ఉండి పోవాల్సి వస్తుందని అప్పుడు తెలియదు.
పోలీసులు స్టాలిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఊళ్ళో లేరు. స్టాలిన్ భార్య దుర్గ ఆమాటే చెప్పినా వినకుండా పోలీసులు ఇల్లంతా సోదా చేసి, లేరని నిర్థారించుకొని వెనుదిరిగారు. ఇదంతా సన్ టీవీతోబాటు ఇతర చానల్స్ కూడా రికార్డ్ చేశాయి. ఇక ఆ రాత్రికి అదొక్కటే వార్త అనుకున్నాం.
12 దాటాక ఒక సమాచారం అందింది. గోపాలపురంలోని కలైంజ్ఞర్ కరుణానిధి ఇంటికి వెళ్ళే వేరు వేరు దారుల్లో కూడా పోలీసుల కదలికలు ఉన్నాయని. టార్గెట్ కరుణానిధి అనుకోవాలా, స్టాలిన్ అరెస్ట్ వార్త తెలిసి కార్యకర్తలు కరుణానిధి ఇంటికి వస్తారని ఊహించి బందోబస్తు ఏర్పాటైందా? అనే చర్చ జరుగుతోంది సన్ టీవీ ఆఫీసులో. ఎందుకైనా మంచిదని మొత్తానికి 12.45 కి ఒక కెమెరా యూనిట్ కరుణానిధి ఇంటికి బయల్దేరింది.
కానీ అప్పటికే రెక్కీ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలుసు. కరుణానిధి ఆ రోజు గోపాలపురం ఇంట్లో లేరని, ఆళ్వార్ పేట – వివేకానంద కాలేజ్ దారిలో ఉన్న ఆలివర్ రోడ్ లోని రెండో భార్య రాజాత్తి అమ్మాళ్ (కనిమొళి తల్లి) ఇంట్లో ఉన్నారని. అప్పటిదాకా సన్ టీవీ స్టాఫ్ కూడా ఆయన గోపాలపురంలో ఉన్నారనే అనుకుంటున్నారు.
సరిగ్గా అప్పుడే సీబీసీఐడీ చీఫ్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు ఆలివర్ రోడ్ ఇంటికి చేరుకున్నారు. వరండాలో పడుకున్న డ్రైవర్ సంజీవిని లేపారు. తలుపు తీయించమన్నారు. “ఇప్పుడు నిద్రలో ఉంటారు, లేపలేను” అన్నాడు. సెక్యూరిటీ పోలీసుదీ అదే మాట. మహమ్మద్ అలీ మాటమీద పోలీసులు ఆ ఇద్దర్నీ చితకబాది, తలుపు పగలగొట్టి లోపలికెళ్ళారు.
ఈ హడావిడికి నిద్రలేచిన కరుణానిధికి పరిస్థితి అర్థమైంది. మేనల్లుడు మురసొలి మారన్ (అప్పటి కేంద్రమంత్రి)కి ఫోన్ చేశారు. కరుణానిధి పై అంతస్తులో ఉన్నారని తెలిసిన పోలీసులు అక్కడికెళ్ళారు. “ఈ టైమ్ లో ఏంటి? ఎందుకొచ్చారు?” అని అడిగితే ఫలానా కేసులో అదుపులోకి తీసుకోవటానికి వచ్చామన్నారు. డ్రెస్ వేసుకోవాలి వెళ్ళండంటూ వాళ్ళను కిందికి పంపారు. నిజానికి కాస్త టైమ్ తీసుకొని అందరూ వచ్చేదాకా వాళ్ళను ఆపాలన్నదే కరుణానిధి ఉద్దేశం.
సన్ టీవీ యూనిట్ మరొకటి అప్పుడే అక్కడికి చేరింది. రిపోర్టర్ కేకే సురేశ్ కుమార్, కెమెరామన్ మారి వెళ్ళేసరికి లాండ్ లైన్ ఫోన్ వైర్లు తెంపేసి ఉన్నాయి. వాళ్ళను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మారన్ తోబాటు ఆయన కొడుకులు కళానిధి మారన్ (సన్ టీవీ ఎండీ), దయానిధి మారన్ (తరువాత కాలంలో కేంద్ర మంత్రి) కూడా చేరుకున్నారు. పైన గదిలో ఉన్న కరుణానిధి దిగివస్తారని ఎదురుచూస్తున్న సమయంలో మారన్ బృందం రావటం చూసి పోలీసులు హైరానా పడ్డారు.
తెల్లచొక్కా, గళ్ళ లుంగీతో కరుణానిధి అప్పుడే దిగటం మొదలుపెట్టారు. మారన్ లోపలికి వస్తూనే పోలీసులను నిలదీస్తూ గట్టిగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజులకిందటే ఆయనకు పేస్ మేకర్ అమర్చారు. అయినా, ఆయన ఏ మాత్రమూ తగ్గలేదు. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని గద్దిస్తున్నారు. కేంద్రమంత్రి కాబట్టి కొంత అధికార దర్పమూ ఆ స్వరానికి తోడైంది. అప్పటిదాకా సహకరిస్తున్నట్టు కనబడ్డ కరుణానిధి ప్రతిఘటించటంతో పోలీసులు కంగారు పడ్డారు.
అదే సమయంలో, ఎలాగైనా తీసుకెళ్లాల్సిందేనన్న పట్టుదల కూడా పెరిగింది. లిఫ్ట్ చేయటమొక్కటే మార్గమని మహమ్మద్ అలీకి అర్థమైంది. ఆజానుబాహుడైన అలీకి ఇంకో బలిష్టుడైన మైలాపూర్ ఏసీపీ మురుగేశన్ తోడయ్యాడు. ఇద్దరూ కరుణానిధిని పట్టి లేపారు. 75 ఏళ్ల కరుణానిధి ఆశక్తుడయ్యారు. చుట్టూ అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కరుణానిధి చొక్కా చినిగింది. “కొలై పండ్రాంగప్పో” (చంపేస్తున్నారయ్యో) అనే అరుపుల మధ్య కరుణానిధిని వాన్ ఎక్కించారు.
ఒకటింబావుకు అంతా పూర్తయింది. అసలు సీన్ రెండు నిమిషాల 18 సెకెన్లు మాత్రమే. సన్ టీవీ కెమెరామన్ మారి తన కెమెరాలో ఉన్న మినీ డీవీ కాసెట్ తీసి వెంటనే రిపోర్టర్ సురేశ్ కి ఇచ్చి కొత్త కాసెట్ వేశాడు. అరెస్ట్ దృశ్యాలు బైటికి వెళ్ళకుండా పోలీసులు కాసెట్ లాక్కుంటారని ముందే ఊహించాడు. నిజంగానే పోలీసులు లాక్కోవటం, ఖాళీ కాసెట్ మాత్రమే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం చకచకా జరిగిపోయాయి. వాన్ కదిలింది. అప్పటికే అక్కడికి వెళ్ళిన ఇంకో రిపోర్టర్ రెండు ఖాళీ కాసెట్లు అందజేసి షూట్ చేసిన కాసెట్ తీసుకొని ఆఫీసుకు బయల్దేరాడు.
అరెస్ట్ చేసిన కరుణానిధిని, మారన్ ను ముందుగా ‘హిందూ’ పత్రిక ఆఫీస్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఎస్టేట్ (అక్కడి రాజాజీ హాల్ లో అప్పట్లో ప్రముఖుల పార్థివ దేహాలు ప్రజల సందర్శనార్థం ఉంచటం ఆనవాయితీ. స్వతంత్ర భారత దేశంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి తొలి ముఖ్యమంత్రి, తెలుగువాడు అయిన ఓమందూర్ రామస్వామి రెడ్డి పేరుమీద ఇప్పుడక్కడ 400 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టారు) కు తీసుకు వెళ్ళారు. అక్కడే సీబీసీఐడీ ఆఫీస్. మీడియా హడావిడి ఎక్కువవటంతో అక్కడినుంచి డీసీపీ ప్రభాకర్ ముందుగా వేపేరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అస్వస్థుడిగా ఉన్న మారన్ అక్కడే ఒక బెంచ్ మీద పడుకున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఉదయం 4 గంటలకు కరుణానిధిని మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ ఇంటికి తీసుకువెళ్ళారు. బాగా నీరసంగా ఉన్న 75 ఏళ్ల కరుణానిధిని ఆ స్థితిలో చూసి మేజిస్ట్రేట్ భార్య చలించిపోయారు. హడావిడిగా పక్కింటికెళ్ళి పాలు తీసుకొచ్చి కాచి, హార్లిక్స్ కలిపి కరుణానిధికి ఇవ్వటం మీడియా దృష్టిని దాటిపోలేదు.
కరుణానిధిని ముందుగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని, ఆ తరువాత జైల్లో రిమాండ్ లో ఉంచాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కరుణానిధి చెన్నై సెంట్రల్ జైల్ కోరుకుంటుండగా పోలీసులు మాత్రం వేలూరు జైలుకు పంపే ఆలోచనలో ఉన్నారు. కరుణానిధి న్యాయవాది అయిన డిఎంకె నాయకుడు విల్సన్ (ఇప్పుడు డిఎంకె రాజ్యసభ సభ్యుడు) ఈ విషయం కరుణానిధి చెవిలో చెప్పి గట్టిగా ప్రతిఘటించమని సూచించారు. వేపేరి స్టేషన్ ముందు బైఠాయించి కరుణానిధి పట్టుబట్టటంతో పోలీసులు మెత్తబడ్డారు.
అర్థరాత్రి దాటాక అరెస్ట్ చేస్తే పత్రికలకు వార్త అందే అవకాశం లేదని, టీవీలకు సమాచారం అందకుండా అరెస్ట్ కార్యక్రమం పూర్తి చేయగలిగితే ఆ హడావిడి ఒక రోజు ఆలస్యంగా మాత్రమే ప్రపంచానికి తెలుస్తుందన్నది జయలలితకు పోలీసులు చెప్పిన మాట. వాళ్ళ ఆలోచన బాగానే అమలైంది గాని సన్ టీవీ ఒక్కటే అడ్డుపడింది. అదీ వాళ్ళ కోపం.
ఇక సన్ టీవీ ఆఫీసులో ఒకటే హడావిడి. కాసెట్ రాగానే ఆరు కాపీలు చేయించారు. మాకు తలా ఒకటి ఇచ్చారు. అప్పటికే పోలీసులు సన్ టీవీ ఆఫీసును చుట్టుముట్టారు. ఏ క్షణంలోనైనా ఆఫీసుమీద దాడి చేసి కాసెట్ తీసుకువెళ్ళే ప్రమాదముందని కాసెట్ రాగానే ఆరు కాపీలు చేయించారు. నాతో సహా హెడ్స్ కి తలా ఒకటి ఇచ్చారు. కాసెట్ ప్లే చేసి చూస్తే 2 నిమిషాల 18 సెకెన్లు ఉంది. కానీ ఆ కొద్దిపాటి క్లిప్ ఏమంత ఎఫెక్టివ్ గా ఉండదేమో అనుకుంటూ ఉండగా సన్ న్యూస్ లో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న జ్ఞానేశ్వరి రంగప్రవేశం చేసింది.
అప్పటిదాకా ఆ సీట్లో ఉన్న ఎడిటర్ ని లేపి ఆమె కూర్చుంది. ఒకసారి మొత్తం వీడియో చూడగానే ఆమె మనసులో ఒక నిర్ణయానికొచ్చినట్టు కనబడింది. కళానిధి మారన్, సన్ టీవీ ఎడిటర్ రాజా, నేనూ వెనక నిలబడి చూస్తూ ఉండి పోయాం. కాసేపట్లో ఆమె చేసిన ఎడిటింగ్ తో అది ఎనిమిది నిమిషాల క్లిప్పింగ్ గా మారిపోయింది. ఎక్కడా వీడియో రిపీట్ అయినట్టు అనిపించలేదు. జాగ్రత్తగా గమనిస్తే తెలిసిందేంటంటే, మామూలుగా వాడే లూప్ పద్ధతి వాడుకోలేదు. లూప్ అయితే ఒకే చోట నుంచి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు తెలిసిపోతుంది. అందుకే అదే క్లిప్పును అక్కడక్కడా వేరు వేరు చోట్ల నుంచి కత్తిరించి జోడిస్తూ ఎక్కడా అనుమానం రాకుండా విజయవంతంగా సాగదీయగలిగింది. ఆడియో విడిగా కట్ చేసి జోడించింది. అంతా పూర్తి చేసి మాకోసం మొదటినుంచీ ప్లే చేసింది. కళానిధి మారన్ అవాక్కయ్యారు. నాలుగు రెట్లు పెంచి ఆ పెనుగులాటను అద్భుతంగా ఎడిట్ చేసిన జ్ఞానేశ్వరిని ఎంతగానో మెచ్చుకున్నారు.
ఈ వీడియోలో “కొలై పండ్రాంగప్పో” (చంపేస్తున్నారయ్యో) అనే వాయిస్ నేపథ్యంలో వినిపిస్తుంది. అది దయానిధి మారన్ ది. అది ఘటనాస్థలంలో ఆయన అరిచిన అరుపు. చూసేవాళ్ళకు కరుణానిధి అరుస్తున్నట్టే అనిపిస్తుంది. ఇది నిజం. కావాలని డబ్బింగ్ చెప్పించారని జయలలిత లాంటివాళ్ళు ఆరోపించారుగాని అది అబద్ధం. ఎక్కడా అది కరుణానిధి గొంతు అని సన్ టీవీ చెప్పుకోలేదు కూడా. జనం మాత్రం కరుణానిధిదే అనుకున్నారు.
రెండున్నరకు వీడియో రెడీ అయింది. ఈ అర్థరాత్రి అరెస్ట్ మీద అప్పటికప్పుడు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లెటర్లు రాసి ఫాక్స్ చేశారు. కానీ సన్ టీవీలో మాత్రం ఆ వార్త ఇంకా ప్రసారం చేయలేదు. వీడియో ను ముందుగా స్టార్ టీవీకి పంపారు. జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించటానికి అదొక వ్యూహం. ఉదయం 6 గంటలకు ఈటీవీకి పంపారు. సన్ గ్రూప్ చానల్స్ అన్నీ 7గంటల వార్తలనుంచి ప్రసారం చేయటం మొదలుపెట్టాయి.
అప్పుడు తమిళనాడులో ఏ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నా, వరుసగా అన్ని ఇళ్ళలో నుంచీ అవే అరుపులు వినిపిస్తున్నాయని మాకు ఫోన్ చేసి చెప్పినవాళ్ళున్నారు.
మేం ఆఫీసులోనే ఉండిపోయాం. బైటికి వస్తే అరెస్ట్ చేయటానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఆఫీస్ లోపలికి రావచ్చునన్న అనుమానాలూ ఉండటంతో జాతీయ, ప్రాంతీయ టీవీ చానల్స్ కు కబురు చేశారు. ఏది జరిగినా కెమెరాల ముందే జరగాలన్నది మా అభిప్రాయం. మధ్యాహ్నం దాకా ఏమీ తినలేదు. మమ్మల్ని రిలీవ్ చేయటానికి ఏ మాత్రం అవకాశమున్నా రావటానికి రెడీగా ఉన్నామని సన్ టీవీ స్టాఫ్ ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది వెనుక రాజ్ టీవీ వైపు నుంచి రహస్యంగా వచ్చారు కూడా. అలా వస్తూ వాళ్ళు తెచ్చిన బిస్కెట్లు లాంటివే కాస్త ఆదుకున్నాయి. 30 రాత్రికి మాకు భోజనం అందింది. బైట పడేసిన ఖాళీ బాక్సులు చూపిస్తూ, ‘కరుణానిధి అరెస్ట్ తో వచ్చిన మైలేజ్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్న సన్ టీవీ ఉద్యోగులు’ అని జయా టీవీలో వార్త ప్రసారమైంది. మొత్తానికి 1 వ తేదీ మధ్యాహ్నం బైటికి రాగలిగాం.
***** ***** *****
అదే సమయానికి గురువాయూర్ లో ఏనుగును దానమిస్తున్న దృశ్యాలు టీవీలో ప్రసారమవుతున్నాయి. కరుణానిధికి ఎలాంటి నమ్మకాలూ లేకపోవచ్చుగాని కనిమొళి పట్టుబట్టి మరీ ఆరోజు కరుణానిధి అరెస్టయిన ఇంటిని అమ్మేశారు. దాన్ని సినీ హీరో, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొనుక్కున్నారు.
– తోట భావనారాయణ, 9959940194
Share this Article