.
గత ఏప్రిల్ 20, 21 తారీఖుల్లో కదా వర్దమాన గాయని ప్రవస్తి తను పార్టిసిపేట్ చేసిన పాడుతా తీయగా కార్యక్రమం మీద ఆరోపణలు చేసింది..?
సింగర్ సునీత సహా, చంద్రబోస్, కీరవాణిని విమర్శించింది… అంతేకాదు, బాడీ షేమింగు, అసభ్యకరమైన డ్రెస్సుల గురించి ఆ కార్యక్రమ నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్‌టెయిన్‌మెంట్ వాళ్లనూ బజారుకు లాగింది…
Ads
పాటల పోటీల్లో ఎలిమినేషన్లు ఉంటాయి, అవి జడ్జిలు వేసే మార్కులు, ఆ కార్యక్రమం నిర్మాతల ఇష్టం… దాన్ని ప్రశ్నించడానికి ఏమీ ఉండదు… అన్యాయం అనిపించినా సరే కిమ్మనకుండా ఉండిపోవల్సిందే… ఐతే ప్రవస్తి మాత్రం జడ్జిల మీద విమర్శలు చేయడంతోపాటు అసలు ఆ షో నిర్వహణ తీరునూ ప్రశ్నించింది…
సరే, సునీత, జ్ఞాపిక ఏవో వీడియోలు విడుదల చేసి ఏవో వివరణలు ఇచ్చుకున్నారు ఉలిక్కిపడి… అవసరం లేదు… చంద్రబోస్, కీరవాణి అయితే నవ్వుకుని ఊరుకుండిపోయారు, అదే కరెక్టు… కాకపోతే ప్రవస్తికి మీడియా విపరీతమైన కవరేజీ ఇచ్చింది అదే కాస్త ఆశ్చర్యం, మనం అదీ చెప్పుకున్నాం…
ఐతే తాజా ప్రోమో చూస్తే అందులోనూ ప్రవస్తి ఉంది… అంటే, దాదాపు 45 రోజులు… ప్రవస్తి ఆరోపణలు చేసి ఆరేడు వారాలు గడిచిపోయాయి… ఇంకా ప్రవస్తి ఎలిమినేషన్ బాపతు షో ఈరోజుకూ ప్రసారం కాలేదు… అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు కూడా… టీవీల షోల గురించి తెలియనివారైతే… ఆ అమ్మాయి తిట్టగానే షోలోకి మళ్లీ తీసుకున్నారా అనేట్టుగా ఉంది…
సునీత మీద ఆమె ప్రధాన కంప్లయింట్… అందుకే ఆమెను షో నుంచి తప్పించారా..? ఈ ప్రోమోలో అందుకే ఏకంగా ఎస్పీ చరణ్ ఆమె ప్లేసులో జడ్జిగా కూర్చున్నది అందుకేనా అనే సందేహాలు కూడా వస్తుంటాయి… కానీ ఈటీవీ వంటి టీవీ చానెళ్లలో ఇలాంటి రియాలిటీ షోలు షూటింగ్ జరిగాక, ఇదుగో ఇలాగే ఆరేడు వారాల తరువాత గానీ ప్రసారం కావు… (కాకపోతే పాడుతా తీయగా షూట్‌కూ, ప్రసారానికీ నడుమ బాగా గ్యాప్ ఉంటుంది ఎందుకో మరి…)
ఒకవేళ ఏదైనా పని ఉండి ఎవరైనా జడ్జి రాకపోతే (ఏ రియాలిటీ షో అయినా సరే) ఆ కుర్చీ అలా వదిలేస్తారు… లేదా అక్కడ ఆల్రెడీ చరణ్ సంగీతం తెలిసినవాడే కాబట్టి తనూ జడ్జి ప్లేసులో కూర్చున్నాడు… (ష్, సునీత జడ్జిమెంట్లలో రంధ్రాన్వేషణ ఉందనే అభిప్రాయాలు వినివస్తుంటాయి… సో, సునీతకన్నా తను బెటర్ జడ్జి…)
ఇదంతా ఆలోచిస్తుంటే… అసలు ఈ షోకు జనాదరణ ఎంత అనే సందేహమొచ్చింది… ఈటీవీ రియాలిటీ షోలు రాను రాను ఘోరంగా టీఆర్పీల సాధనలో ఫెయిలవుతున్నాయి కదా… మరి దీనికి రేటింగ్స్ తెలుసా..? జస్ట్, 1.07 మాత్రమే…
అత్యంత దయనీయమైన రేటింగ్స్… అంటే జనం ఈ షోను అస్సలు పట్టించుకోవడం లేదు అని అర్థం… మరీ సుమ అడ్డా వంటి నాసిరకం, బోరింగ్ షోతో సమానం అయిపోతోంది ఫాఫం… ప్రవస్తి వివాదం కూడా షో రేటింగ్స్‌కు ఉపయోగపడలేదు…!!
Share this Article