Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాకు అక్కడ వోటు లేదు… ఉంటే ఈ ’’విజిల్ బ్లోయర్’’కే వేసేవాడిని..!

November 28, 2023 by M S R

Aranya Krishna……..   ద విజిల్ బ్లోయర్! కర్నె శిరీష నిజంగా ఒక ఫినోమినన్ అని చెప్పొచ్చు. నిజానికి ఇది పూర్తిగా శిరీష ఘనత కాదు. ఆమెకి ఇవ్వాల్సిన క్రెడిట్ ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదుకే! మరి ఈ ఫినోమినన్ కి ముఖ్యమైన కారణం ఎవరంటే సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామిక భావాలను పరివ్యాప్తం చేసేవారే. వర్తమాన రాజకీయాలు పరమ నీచంగా వున్నాయని, మన ప్రజాస్వామ్య పునాదులు ధనస్వామ్యం మీద వున్నాయని, అవినీతి, ఎన్నికల అక్రమాలు, అబద్ధపు హామీల మోసాలు రాజ్యమేలుతున్నాయని గుర్తించి, ఆక్రోశించిన చైతన్యవంతులైన సామాన్యులే శిరీషని తమ ప్రతినిధిగా భుజాల మీద మోస్తున్నారు.

శిరీషకి వున్న పెద్ద బలం సోషల్ మీడియానే. ఇక్కడ ఆమెకి దొరుకుతున్న మద్దతు చూస్తుంటే అసలు ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజక వర్గంలో పోటీ చేస్తున్నట్లు కాకుండా ప్రభుత్వం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నట్లుంది. అంతేకాదు మనం నిజంగా సంతృప్తి చెందాల్సిన విషయం ఏమిటంటే ఒక పేద, దళిత కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువతి ఐన శిరీషకి ఇంత సామాజిక మద్దతు దొరకడం! ఈ పరిణామం అపురూపమనే చెప్పాలి. ధనమయమైన ఎన్నికల్లో చేబదుళ్లు తెచ్చి డిపాజిట్ అమౌంట్ కట్టిన శిరీష గెలుపు కోసం తపిస్తున్న వారిని చూస్తే నిజంగా ఆనందమే వేస్తుంది. యువత, అందునా మహిళల రాజకీయ ప్రవేశానికి శిరీష ఊతం ఇవ్వొచ్చు.

శిరీష పాపులర్ అవడం పాలకుల స్వయంకృతం. వైఫల్యాల్ని ఒప్పుకోలేకపోయినా కనీసం విమర్శని సహించలేనితనం ఆమె మీద సామాజిక శాంతికి సంబంధించిన కేసులు పెట్టిస్తే ఆమెతో ఐడెంటిఫై ఐన యువత, ఆమె పట్ల సహానుభూతితో ఆలోచించే వారికి ఆమె నామినేషన్ వేయడం గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. అది వారిలోని ప్రజాస్వామిక స్ఫూర్తీ బైటకి తీసి ఆమె గెలుపు కోసం యుద్ధోత్సాహంతో పని చేసేలా పురికొల్పింది. ఆమె ద్వారా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల యువత ప్రభుత్వాల మీద ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నట్లుంది. ఆమె చేస్తున్న విమర్శలు పార్టీల పరంగా రాజకీయమైనవి కాకుండా ప్రజల, ముఖ్యంగా యువత నిరాశా నిస్పృహలకి ఒక వాయిస్ ఇవ్వడం అనేది గమనించాల్సిన విషయం.
శిరీష గెలవొచ్చు గెలవక పోవచ్చు. ఆమె గెలిచి తీరుతుందన్న భరోసా ఏమీ లేదు. ఐతే శిరీష పోటీ చేసే పద్ధతిలో, ఆమె తరపున జరిగే ప్రచారం జరిగే విధానం చూస్తుంటే ఎన్నో విస్మయకరమైన అంశాలు బైటపడతాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలకి డబ్బు పంచడం కాకుండా వారి నుండే ప్రచార ఖర్చుల కోసం చందాలు స్వీకరించడం అనే ఎప్పుడో కమ్యూనిస్టులు బలంగా వుండే కాలంలో సంభవించిన గొప్ప ప్రజాస్వామ్య సాంప్రదాయం ఇప్పుడు పునరావృతమైంది.
ఎన్నో వందల కార్లు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమాన్యులైన వోటర్లు తమ స్వంత డబ్బులతో వాటిలో ఆయిల్ కొట్టించి ఆమె ప్రచారానికి అందుబాటులో పెట్టడమే కాదు వారు ఆ కార్లలోనే నిద్రిస్తున్నారు. వారు ఏ సదుపాయాలు కోరుకోవడం లేదు. ఇదో అద్భుతమే. ఇంతా చేసి వోట్లేయాల్సింది స్థానికులే కానీ ఇతర నియోజకవర్గాల, పక్క జిల్లాల, అటు పక్క రాష్ట్రాల ప్రజలు కాదు కదా అని ఎవరైనా పెదవి విరచొచ్చు. విరుచుకోనివ్వండి. కానీ ఇంత మద్దతు సామాన్యుల నుండి వస్తున్నదంటే అది ఇతర ప్రాంతాలకు రేపెప్పుడైనా పాకొచ్చు. పోరాటానికి గమ్యం చైతన్య విస్తరణే కానీ గెలుపోటములు కావు. బిందువు బిందువు సింధువుని తయారు చేసినట్లు ఏ పోరాటమైనా రగిల్చే చైతన్యం వృధా పోదు.
నిజమే, శిరీష స్థానికులకి పెద్దగా ఏమిటి? అసలు తెలియనే తెలియక పోవచ్చు. శ్రామిక వర్గం, నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా వున్న గ్రామీణ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆలోచనలు శిరీష నామినేషన్ వెనుకనున్న ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని అర్ధం చేసుకోలేక పోవచ్చు. అలవాటైన పార్టీలకు సంబంధించి రాజకీయ పరిజ్ఞానం వుండి, కొత్తగా ఆలోచించేంత రాజకీయ చైతన్యం లేనివారు ఆమెకున్న అనుభవం గురించి ప్రశ్నించొచ్చు. ఆమె సామర్ధ్యం గురించి శంకించొచ్చు. అసలు ఆమె ఓటర్లు అందరినీ కలిసి తనని తాను పరిచయం చేసుకొని తన ఆలోచనల్ని పంచుకునే అవకాశం కూడా పూర్తిగా లేకపోవచ్చు.
అనుభవం, సామర్ధ్యం అంటే ఏమిటి? కాంట్రాక్టుల్లో వందల కోట్లు నిదులు నొక్కేయడమా? అవినీతితో స్వంత ఖజానాలు నింపుకోడమా? ఎన్నికల ముందు ఓటుకి ఇంత అని డబ్బులు పంచి, సారా బాటిల్స్ జనం జేబుల్లో కుక్కడమా? ఆమె సామర్ధ్యం, అనుభవం గురించి ప్రశ్నలు వేసేవారు తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నలివి.
నిజానికి ఎన్నికల నాణేనికి ప్రజాస్వామిక చైతన్యం ఒక వైపైతే, గెలుపోటములు రెండో వైపు! కానీ మన వ్యవస్థలో డబ్బు ఒక వైపైతే, ఫలితం రెండో వైపుంటుంది. ఇప్పుడు ఆ డబ్బు స్థానంలో శిరీషని ప్రజాస్వామిక వాదులు నిలబెట్టారు. ఫలితం ఏదైనా రానివ్వండి. పర్లేదు. స్వీకరిద్దాం. ఈ అతి కొద్ది సమయంలో ఈ ప్రజాస్వామిక సైనికులు ఆమెని నియోజకవర్గ ప్రజలకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేర్చగలిగి, గట్టిగా పరిచయం చేయగలిగితే సానుకూల ఫలితానికి దగ్గరగా వెళ్లొచ్చేమో అనిపిస్తుంది.
ఆమెకి ఎన్ని వోట్లొచ్చినా, విజేతగా ప్రకటించబడినా లేకున్నా ఆమె ఇప్పటికే నైతికంగా విజయం సాధించినట్లే. ఐతే ఆమె నిజంగానే గెలవగలిగితే ఆ గెలుపు ఎంతోమంది నిజాయితీపరులైన యువతకి స్ఫూర్తి కాగలదనే అనుకుంటున్నా.

ప్రధాన పార్టీలు ఎన్నికల ముందు డబ్బు, సారా పంచడాన్ని ఆమె తరపున అహర్నిశలు పని చేస్తున్న వారు చెక్ చేయగలిగితే, వోటర్లు ప్రలోభాలకు గురి కాకుండా చూడగలిగితే ఆమెకి విజయం దక్కొచ్చు. అంతే కాదు రేపు గెలిస్తే “నియోజకవర్గ అభివృద్ధి, ప్రయోజనాల నిమిత్తం” అనే పేరుతో ఏ ప్రధాన పార్టీలూ శిరీషని ప్రలోభ పెట్టకుండా కూడా ఆపొచ్చు. నాకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఓటు లేదు. వుంటే శిరీషకే వేసేవాడిని. ఇక్కడి నుండే విజిల్ మోగిస్తున్నా….

Ads

(నాలుగు బర్రెలు మేపుకున్న శిరీష కాదు నేడిప్పుడు… ఆమె ప్రచారం తీరు వీడియో ఓసారి చూడండి… దండలు, దండాలు, సెల్ఫీలు, శాలువాలు, మెచ్చుకోళ్లు, నినాదాలు, దారి పొడవునా అభినందనలు, బౌన్సర్లు, కార్లు… ఏ ప్రధాన పార్టీ అభ్యర్థికన్నా ఆమె ఇప్పుడు తక్కువ కాదు ప్రచారంలో… డబ్బు వచ్చిపడుతోంది… డబ్బు పంచేందుకు సరిపోకపోవచ్చుగాక… ఆమె ఎవరికీ రూపాయి ఇవ్వకపోవచ్చుగాక… అసలు ఇవ్వొద్దు, ఇస్తేనే ఓ స్పిరిట్ దెబ్బతింటుంది… తన ప్రచార వ్యయం మాత్రం దండిగానే సమకూరుతోంది… సొసైటీ ఆమె వెన్నుతట్టి, ఈ భరోసా ఇవ్వడమే ఆమె ప్రథమ విజయం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions