మొన్న అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో భగిని నివేదిత పేరును ప్రస్తావించాడు… కాషాయ శిబిరంతో టచ్ ఉన్న వాళ్లు ఆశ్చర్యపోలేదు ఆమె పేరు విని… నిజానికి ఆయన ఆమె పేరు ప్రస్తావించకపోతేనే ఆశ్చర్యపోయేవాళ్లేమో…
సోషల్ మీడియా మిత్రుడు Ag Datta ఏమంటాడంటే..? ‘‘భగిని నివేదిత పేరును, ఆవిడ మాటలను భగవత్ ప్రస్తావించకపోతే, అదేంటీ నివేదిత గురించి ఈయన మాట్లాడలేదేమిటని వేదికపైన, వేదిక ముందు ఆసీనులైన వారు, లేదా ఇతరతేర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న జనాలు ఎవ్వరైనా అడుగుతారా? అడగరు… కానీ, ఆర్‌ఎస్‌ఎస్ అంతరాత్మ అడుగుతుంది, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాల్లో ప్రతిష్టించబడిన భారతమాత అడుగుతుంది… అందుకే భగిని నివేదితను స్మరించుకున్నారు భగవత్’’…
నిజంగానే ఈ తరానికి, చాలామందికి తెలియని పేరు… ఇంతకీ ఎవరామె..? ఆమె జన్మరీత్యా ఇండియన్ కాదు… ఐరిష్ మహిళ… పుట్టినప్పుడు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్… ఓ క్రిస్టియన్ కుటుంబం… తరువాత భారతీయతను అక్షరాలా ఆవాహన చేసుకుంది, భారతదేశం కోసమే ప్రయాసపడింది… సర్వస్వమూ త్యాగం చేసింది… బహుశా హిందూ మతాన్ని స్వీకరించిన తొలి విదేశీ మహిళ…
Ads
తోటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండటమే భగవంతుడికి నిజమైన సేవ అని తండ్రి చెప్పిన మాటలు ఆమెను బాల్యం నుంచే సోషల్ సర్వీస్ వైపు నడిపించాయి… మొదట్లో ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది… 1895లో భారత మహిళ ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్ చేసిన ప్రసంగాలు ఆమెను బాగా ప్రభావితం చేశాయి… 1898లో ఇండియాకు వచ్చేసింది… వివేకానంద శిష్యురాలు… ఆయన ఆమెకు నివేదిత అని పేరు పెట్టాడు…
మొదట్లో టీచర్ కదా, ఇండియాకు వచ్చాక బాలికల విద్య మీద కాన్సంట్రేట్ చేసింది… 1898లో కలకత్తాలో ఓ స్కూల్ ప్రారంభించింది… విశ్వకవి ఠాగూర్, జగదీష్ చంద్రబోస్ తదితరులతో స్నేహసంబంధాలు… 1899లో కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు గానీ, 1906 భారీ వరదల విపత్తు వేళ గానీ ఆమె తన శిష్యులతో కలిసి అందించిన వైద్య సేవలు అనుపమానం… భారతీయ మహిళల గురించి ఆమె న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లోనూ ప్రసంగాలు చేసింది… మన స్వతంత్ర పోరాటంలోనూ ఆమె భాగస్వామి… 1911లో డార్జిలింగులో కాలం చేసింది…
నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం విషాదభరితమే… టీనేజ్‌లో ఉన్నప్పుడు ఒక యువకుడి ప్రేమలో పడింది… ఇక పెళ్లి చేసుకోవాలని అనుకునే తరుణంలో ఆ యువకుడి మరణం ఆమెకు పెద్ద షాక్… ఇండియాకు వచ్చాక పదేళ్లకే ఆమెలో తాను ఎక్కువ కాలం బతకననే భావన మొదలైంది,,, ఆమె ఎందుకు అలా భావించిందో, ఏ దైహిక బాధను అనుభవించిందో తెలియదు గానీ 1898లోనే ఓ స్నేహితురాలికి రాసిన లేఖలో బహుశా తను రెండేళ్లకు మించి బతకపోవచ్చునని పేర్కొంది…
ఆ స్నేహితురాలు కూడా అదే స్థితిలో ఉండి, తనను చూడాలని కోరుకుంటున్నదని తెలిసి నివేదిత తన అరోగ్యం బాగాలేకపోయినా సరే బోస్టన్ వెళ్లింది… కానీ ఆ స్నేహితురాలి కూతురే నివేదిత మీద ఫిర్యాదులు చేసింది… తన తల్లిని మభ్యపెట్టి ఆస్తిని ఇండియాకు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణ… అసలే అనారోగ్యం, దానికితోడు ఈ అకారణ నిందలు… స్నేహితురాలి మరణం… ఆమెలో వైరాగ్యాన్ని మరింత పెంచాయి… మనసుకు విశ్రాంతి కోసమని డార్జిలింగ్ వెళ్లింది… అక్కడే కన్నుమూసింది…
Share this Article