మిస్టర్ బచ్చన్… రవితేజ మరో సినిమా… ఏదో పాట రిలీజ్ చేశారు… ఇంకేముంది..? సైట్లు, ట్యూబర్లు ఆహా ఓహో అని ఎత్తుకున్నారు… అబ్బో, అంత బాగుందా అని తీరా చూస్తే… జస్ట్, ఓ సాదాసీదా ట్యూన్… బాగా లేదని కాదు, మరీ ఇంత ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు…
ఏదో కొన్ని పదాలను అక్కడక్కడా అతికించి, ఏదో సాహిత్యం అనిపించేశాడు గీత రచయిత ఎవరో గానీ… పాటగాళ్లు కూడా అంత కష్టపడలేదు, కష్టపడనక్కర్లేని ట్యూన్ కట్టాడు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్… చాలా పదాలు సరిగ్గా వినిపించడం లేదు సగటు తెలుగు సినిమా పాటలాగే…
కానీ ఒకచోట మాత్రం బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా అని వినిపించింది… తీరా చూస్తే ఆమె ఏదో పిచ్చి డ్రెస్ వేసుకుని ఉంది, బొట్టూబోనం మన్నూమశానం ఏమీ లేవు… అప్పట్లో చిరంజీవిది ఏదో సినిమా, నల్లంచు తెల్లచీరా అని పాట వస్తూ ఉంటుంది, రాధిక ఏదో పిచ్చి డ్రెస్ వేసుకుని ఎగురుతూ ఉంటుంది… అదే గుర్తొచ్చింది… ఐనా పాట రాసేదొకరు, కొరియోగ్రఫీ చేసేదొకరు, పాటకు దర్శకత్వం మరొకరు… సరిగ్గా సాహిత్యం (?)లో ఉన్నట్టే సీన్, లుక్కు ఉండాలనేముంది..? అసలే తెలుగు సినిమా… ఔచిత్యాలు, లాజిక్కులు గట్రా కుదరవు కదా…
Ads
ఒళ్లు సరిగ్గా కనిపించేట్టు ఓ మోడరన్ డ్రెస్… రవితేజ వయస్సు అయిపోతుంది కదా, కొరియోగ్రాఫర్ పెద్దగా కష్టపడనక్కర్లేని స్టెప్స్ కంపోజ్ చేశాడు… మరి కొత్త పిల్ల భాగ్యశ్రీ బోర్సే కదా… వీలైనంతవరకూ ఈ పాటలోనే ‘చూపిద్దామనే’ తాపత్రయమే ఎక్కువగా కనిపించింది దర్శకుడి ప్రతిభలో… ఆమె బ్యాకు సీటుకు రెండు జేబులు కుట్టించారు… నాలుగైదు రంగుల్లో డ్రెస్సులు ఉంటే అన్నింటికీ అవేచోట జేబులు…
వాటిల్లో శ్రీమాన్ రవితేజ అనబడే హీరోగారు ముందు నుంచి చేతులు పెట్టి తబలా వాయిస్తుంటాడు… కెమెరా ఫోకస్ మొత్తం అక్కడే… ఆహా, ఏం క్రియేటివిటీ దర్శకుడు గారూ… పదే పదే తెలుగు ఇండస్ట్రీ పెద్దలు భాగ్యశ్రీ బోర్సే పేరును ఎందుకు కలవరిస్తున్నారో కూడా అర్థమైంది… బక్కపలుచగా ఉన్న ఈ అమ్మాయి మంచి అందగత్తె… చూడబోతే శ్రీలీల ప్లేసును అర్జెంటుగా ఆక్రమించేట్టుగా ఉంది…
కొత్త అందగత్తెను వెతికి పట్టుకోవడం… వీలైనంతవరకూ తెలుగు మొహాలు అక్కర్లేదు… నార్త్ పిల్లలు లేదంటే మలయాళీ పిల్లలు… ఎంత వయస్సు తక్కువుంటే అంత బెటర్… కొన్నాళ్లు విపరీతంగా హైప్… బోలెడు అవకాశాలు… తరువాత కరివేపాకులు… శ్రీలీల కూడా అంతే కదా… వరుసగా సినిమాల్లో బుక్ చేసి, అడ్డమైన డాన్సులన్నీ చేయించారు, పాతబడింది కదా వదిలేశారు పాపం…
మమత బైజు మీద పడ్డాయి కళ్లు… కానీ ఆమె ఆచితూచి ఒప్పుకుంటోంది… దాంతో ఇదుగో ఈ భాగ్యశ్రీ దొరికింది… ఔరంగాబాద్ అమ్మాయి… మోడల్, అంతకుమించి బయోడేటా ఎవరికీ తెలియదు… నైజీరియాలో ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందో కూడా తెలియదు… ఇండియాకు వచ్చాక బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసింది… తను చేసింది ఒకే సినిమా… యారియాన్2 అనే హిందీ సినిమాలో చేసింది… అందులోనూ లీడ్ రోల్ ఏమీ కాదు, మందలో మనిషి…
ఐనా ఏముందిలే… టాలీవుడ్ పైకి లేపుతుంది… ఎటొచ్చీ ఆ ప్లేసు నిలబెట్టుకోవడమే ముఖ్యం… నిజానికి నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు దక్కే ప్రయారిటీ ఎంత..? మంచి రోల్స్ ఎన్ని..? అన్నీ రొటీన్ పిచ్చి గెంతుల పాత్రలే కదా… ఈ భాగ్యశ్రీ సరిగ్గా ఆ గెంతులకు సరిపోయేట్టుగానే కనిపిస్తోంది..!
Share this Article