ఎవరు సార్… విపక్షాలు రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాయట ఆయన్ని… పేరు గోపాలకృష్ణ గాంధీ అట… తను కూడా గాంధీ పేరుతో చెలామణీ అయ్యే నెహ్రూ కుటుంబ వారసుడా..? అదే బాటలో ప్రయాణించే మరొకరా అనడిగాడు ఓ మిత్రుడు… అరె, గాంధీ మనమడు గుర్తుపట్టలేదా అన్నాను నేను… ఓహో, ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రక్త వారసులూ ఉన్నారా అన్నాడు తను… అదేమిటి అంత మాటనేశావ్ అన్నాను…
అవునూ, ఇంతకీ ఎవరీ గాంధీ..? కొత్త జనరేషన్‌కు తెలియకపోవచ్చుగాక… అప్పట్లో గాంధీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు, వైఖరికి మాత్రం వారసుడే… ఈ హార్ష్ వ్యాఖ్య దేనికో తెలుసా..? ఈ జాతికి, ఈ దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచాడు కాబట్టి… అప్పట్లో ముంబై ఉగ్రవాద దాడుల బాధ్యుడు యాకూబ్ మెమన్‌కు క్షమాభిక్ష పెట్టాలని బాగా ప్రయత్నించాడు కాబట్టి… సదరు యాకూబ్‌ను క్షమించి వదిలేయాలని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు కాబట్టి… ఎందుకంటే..? తను టిపికల్ భారతీయ మేధావి కాబట్టి… దీనికి మాజీ రాష్ట్రపతి కాలం పేరును కూడా వాడుకున్నాడు కాబట్టి…
అవునా..? అలాంటి మనిషా..? మరి ఈ ప్రతిపక్షాలు తనను రాష్ట్రపతి పదవికి ఆలోచించడం ఏమిటి..? ఎందుకంటే..? స్థూలంగా జాతి ఆత్మగౌరవం, పౌరుషం అనే పదాలకు మన విపక్షాలు దూరం కాబట్టి…!! గాంధీ మనమడు అని చెప్పి, ఆ చెట్టు పేరు చెప్పి కథ నడిపించాలనే ఓ నికృష్టమైన భావదరిద్రంలో విపక్షాలు కొట్టుకుపోతున్నాయి కాబట్టి…!! మరో ఆదర్శనీయమైన పేరు వాటికి గుర్తొచ్చే తెలివిడి లేదు కాబట్టి…!!
Ads
ఏం తక్కువ చేసింది ఈ దేశం ఈ గోపాలకృష్ణ గాంధీ అనే వ్యక్తికి..? పలు దేశాలకు రాయబారి, రాష్ట్రాలకు గవర్నర్, టీచర్… గాంధీ నాలుగో చిన్న కుమారుడి కొడుకు దేవదాస్ కొడుకు… రాజగోపాలాచారి మనమడు… ఈ జాతికి ఎంత ఆదర్శంగా నిలవాలి..? కానీ జాతిని ఛిన్నాభిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచాడు… అదీ తన కేరక్టర్… గాంధీ అనే ఇంటిపేరుకు అర్హుడా కాదా జాతి తేల్చుకోవాలి… ఇదుగో, ఇలాంటివే బీజేపీకి బలం…
ఇతనే గత ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి మీద పోటీకి నిలబడింది… ఇప్పుడిక ఏకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తాడట… కాదు, విపక్షాలు పోటీకి నిలబెడతాయట… శరద్‌పవార్ అను ఓ వృద్ధ నేత ఓడిపోయే యుద్ధం చేయను అన్నాడట… సంఖ్య సరిపోదు అన్నాడట… పైగా రాష్ట్రపతిభవన్, రాజభవన్‌కు పరిమితం కాదల్చుకోలేదట… ఓడిపోయే యుద్ధం అని తెలిసి బీరువుగా తెరవెనక్కి వెళ్లేవాడు వీరుడు ఎలా అవుతాడు..? అసలు తను యుద్ధరంగంలో నిరూపించుకున్నది ఎప్పుడు..? గెలుపో ఓటమో జానేదేవ్, పోటీ అనేది ఓ ప్రజాస్వామిక స్పూర్తి అనే సోయి లేనివాడు పోటీలో లేకపోవడమే మంచిది… నిజమే…
యుద్ధమంటేనే భయపడేవాడు వీరుడు ఎలా అవుతాడు..? అదొక దిక్కుమాలిన చాయిస్… ఇప్పుడిక గోపాలకృష్ణ గాంధీ అట… కాంగ్రెస్ లేకుండా మమత భేటీ పెడుతున్నది కాబట్టి ప్రతినిధులు వెళ్తారట కానీ, ముఖ్యులు వెళ్లరట… సీపీఎం కూడా జస్ట్, ప్రతినిధుల్ని పంపిస్తుందట… కేసీయార్ వైఖరి మరీ గందరగోళం… కాంగ్రెస్ వస్తుంది కాబట్టి వెళ్లరట… అంటే పరోక్షంగా బీజేపీకి పనికొచ్చే వైఖరి తీసుకోవడం… ఒకవైపు ప్రబల ప్రత్యర్థి బీజేపీ అని చెబుతూనే మరోవైపు బలమైన ఉమ్మడి అభ్యర్థి అనే ప్రతిపాదనకు తూట్లు పొడవడం..!! అవునూ, తన మనమడి వైఖరి పట్ల గాంధీ ఆత్మ ఘోషిస్తుంది అంటారా..? నెవ్వర్… చాలా సందర్భాల్లో తను కూడా ఆ బాటలోనే ప్రయాణించాడు కాబట్టి…!!
జోక్ ఏమిటంటే..? 2017లో ఇదే గాంధీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తే… ది గ్రేట్ శివసేన వ్యతిరేకించింది… తన అభ్యర్థిత్వమే జాతి వ్యతిరేకం అని సూత్రీకరించింది… ఇప్పుడు అదే శివసేనకు గాంధీ వంటి సంజయ్ రౌట్ అనే ఓ పవార్ కోవర్టు నేతృత్వం… తను చెప్పిందే వేదం ఆ పార్టీలో… ఫాఫం, ఇప్పుడు కాంగ్రెస్, పవార్ పొత్తులో ప్రభుత్వాన్ని ఉద్దరిస్తున్న శివసేన అనివార్యంగా ఇదే గోపాలకృష్ణ గాంధీకి మద్దతు చెప్పే పరిస్థితిలో ఇరుక్కోవడం… ఏం బతుకైపోయింది ఉద్దవ్ ఠాక్రే నీది…!!
Share this Article