ఈసారి మన ఐపీఎల్ జట్టు దంచికొడుతోంది సర్, కప్పు కొట్టే చాన్స్ కూడా కనిపిస్తోంది… అని ఆనందపడిపోయాడు ఓ యువకుడు… మన అంటే ఏమిటి అన్నాను… మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సార్ అన్నాడు నావైపు ఆశ్చర్యంగా చూస్తూ… హైదరాబాద్ జట్టు అంటే మన వాళ్లదా అనడిగాను మళ్లీ అదే టోన్‌లో…
పేరులోనే హైదరాబాద్ ఉంది, మనది కాదా అంటూ ఇంకా ఆశ్చర్యంగా చూశాడు నావైపు, ఇలాంటివాళ్లు ఇంకా ఈలోకంలో ఎందుకు కనిపిస్తారో అన్నట్టుగా… హైదరాబాద్ సరే, ఏ హైదరాబాదీ జట్టు అది, అందులో ఉన్న హైదరాబాద్ ప్లేయర్లు ఎందరు అనడిగాను మొండిగా… ఈసారి తెలియదు అన్నాడు నిజాయితీగా… కాస్త దిగివచ్చి…
చెప్పాను… మన జట్టు ఏమీ కాదు… అది చెన్నై రాజకీయ, వ్యాపార, ఆర్థిక, సినిమా, టీవీ, మీడియా సామ్రాజ్యానికి సంబంధించిన ఓ ప్రైవేటు క్రికెట్ జట్టు.,. అంతకుమించి ఏమీ కాదు, ఆల్‌రెడీ చెన్నై పేరిట ఇండియన్ సిమెంట్స్ వాళ్ల జట్టు ఉంది… దీనికి హైదరాబాద్ పేరు పెట్టుకున్నారు… ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ, బెంగుళూరు, లక్నో ఇలా…
Ads
గతంలో బలిసిన వ్యాపారవేత్తలు, సంస్థానాధిపతులు, రాజులు సొంతంగా కుస్తీ, మల్లయుద్ధ వీరులతో జట్లు తయారుచేసుకునేవాళ్లు… పెద్ద పెద్ద పోటీలు ఏర్పాటు చేసి, కోడిపందేల్లాగా ఎంజాయ్ చేసేవాళ్లు… ఐపీఎల్ కూడా అంతే, ఎక్కడెక్కడి క్రికెటర్లనో ఎంగేజ్ చేసుకోవడం, బరిలో దింపడం, బంతి కనిపిస్తే చాలు బాదడం, అందరూ కేరింతలు కొట్టడం, యాడ్స్, డబ్బు, కీర్తి, ఆనందం… అన్నీ…
స్టేడియంలో కనిపిస్తుంది కదా సార్, నవ్వుతూ, ఎగురుతూ, గెంతుతూ, చప్పట్లు చరుస్తూ, కొన్నిసార్లు మొహం దిగాలుగా పెట్టి… ఆమే కదా సార్ కావ్య పాప… ఇంతకీ ఆమె ఎవరు అనడిగాడు సదరు యువకుడు పూర్తిగా దిగివచ్చి…
ఆమె ఈ జట్టుకు సీఈవో… కావ్య మారన్… ఇంకా పెళ్లి చేసుకోలేదు… ఓ బలమైన ఆర్థిక సామ్రాజ్యపు వారసురాలు… కరుణానిధి కుటుంబంలో ఒకరు… ఆ కుటుంబం తెలుసు కదా… ఈ దేశాన్ని శాసించే ప్రతిరంగంలోనూ ఉన్నారు వాళ్లు… పాలిటిక్స్, క్రికెట్, సినిమా, టీవీ, మీడియా, థియేటర్లు, హాస్పిటాలిటీ, హాస్పిటల్స్… వాట్ నాట్..? అత్యంత బలమైన సన్ గ్రూపు అది… దాని ఓనర్ కళానిధి మారన్… ఆయన బిడ్డ ఈమె… న్యూయార్క్‌లో ఎంబీఏ చేసింది…
అంటే కరుణానిధికీ, స్టాలిన్‌కూ ఏమవుతారు అనడిగాడు… ‘కరుణానిధి అక్క కొడుకు, అంటే సొంత మేనల్లుడు మురసోలిమారన్, ఆయన కొడుకు కళానిధిమారన్… సన్ గ్రూపు ఫౌండర్ చైర్మన్ తను… ఆయన బిడ్డే కావ్య మారన్… అదీ వాళ్ల నేపథ్యం… ఈ దేశంలో డబ్బు పోటెత్తే ప్రతి ఫీల్డులోనూ ఈ కుటుంబం ఉంటుంది… అందులో ఈ క్రికెట్ దందా కూడా ఒకటి…
ఐనా సరే, మనకంటూ ఓ జట్టు ఉందని ఫీలై, దాని గెలుపూ ఓటముల్ని మనమూ ఫీలయితే తప్పేమిటి సార్ అనడిగాడు… తప్పేమీ లేదు… మన దేశపు జట్లు వేరే దేశపు జట్ల మీద గెలిస్తే వచ్చే ఆనందం వేరు… ఈ ప్రైవేటు దందా జట్లను ఓన్ చేసుకోవడం వేరు… అఫ్ కోర్స్, ఇంకా స్థూలంగా వెళ్తే… ఆటను ఆటలాగా… నా దేశపు జట్టు అనే పరిధులు కూడా దాటి ఆస్వాదించగలిగితే అది మెచ్యూరిటీ… పైగా ఇందులో ఫిక్సింగులు, బెట్టింగులు మన్నూమశానం…
ఏమో సార్, నాకవన్నీ తెలియవు… అంతగా ఆలోచించను… మన హైదరాబాద్ పేరు పెట్టుకున్నారుగా… మనదే జట్టు… కావ్య పాప మొహంలో ఆనందం కనిపించాలి… అంతే… మ్యాచ్‌కు వెళ్తున్నా సార్, బై అని వెళ్లిపోయాడు వడివడిగా…
Share this Article