Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!

June 24, 2025 by M S R

.

కుబేర సినిమాకు సంబంధించిన అనేకానేక కథనాలు, సమీక్షలు, విమర్శలు, పెదవి విరుపులు, చప్పట్లు అన్నీ చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం కదా… ఎందుకోగానీ తెలుగు తెరకు వచ్చిన కొత్త విలన్‌కు దక్కాల్సినంత అప్లాజ్ దక్కడం లేదేమో అనిపించింది…

హఠాత్తుగా మన పాత విలన్ రఘువరన్ గుర్తొచ్చాడు… కాస్త అలాగే ఫేస్ కట్, బాడీ లాంగ్వేజీ, కళ్లల్లోనే పలికించే స్మార్ట్ క్రూర విలనీ… అప్పట్లో నాగార్జున, రఘువరన్… ఇప్పుడు అదే నాగార్జున ఈ విలన్… పేరు జిమ్ సర్బ్… పేరు, మొహం చూడగానే విదేశీయేమో అనుకున్నా…

Ads

అచ్చమైన ముంబైకర్… పార్శీ జొరాస్ట్రియన్ ఫ్యామిలీ… తల్లి ఫిజియో థెరపిస్ట్… తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్… కొన్నాళ్లు అమెరికాలో కూడా చదువుకున్నాడు… సైకాలజీ గ్రాడ్యుయేట్… నటన అన్నా నాటకాలన్నా ప్యాషన్… అట్లాంటాలో ఏదో థియేటర్ కంపెనీకి వర్క్ చేశాడు… ముంబై వచ్చాక కూడా అదే పని…

తను రచయిత, నాటక దర్శకుడు, నటుడు… నీర్జా, పద్మావత్, సంజు, మేడ్ ఇన్ హెవెన్, గంగూభాయ్ తదితర సినిమాల్లో పాత్రలు… రాకెట్ బాయ్స్‌ వెబ్ సీరీస్‌లో హోమీ బాబా… సినిమాలు, వెబ్ సీరీస్ బాగానే చేస్తున్నా రావల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపించింది… శేఖర్ కమ్ములకు ఎవరు సజెస్ట్ చేశారో గానీ, కుబేరలో డర్టీ అండ్ క్రుయల్ బిజినెస్‌మ్యాన్ పాత్రకు మాత్రం సరిగ్గా సూటయ్యాడు…

అటు ధనుష్, ఇటు నాగార్జున… ఐతేనేం, బలమైన విలనీని చూపించాడు… తెలుగు డైలాగ్స్ రాసుకుని, కంఠస్థం చేసి, సరైన ఉచ్ఛరణతో సొంతంగా డబ్బింగ్ చెప్పిన తీరు బాగుంది… ఎక్కడా తడబాటు, తొట్రుబాటు కూడా లేవు… సరిగ్గా వాడుకుంటే సౌత్ తెరకు ఓ మంచి విలన్ దొరికినట్టే…

శేఖర్ కమ్ముల సినిమాలో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ సంబంధిత నటులే చెప్పుకుంటారు కదా… రష్మికతోనూ తెలుగులో డబ్బింగ్ చెప్పించాడు… ఆమె తెలుగు బాగానే మాట్లాడగలదు, చాన్నాళ్లుగా తెలుగు ఫీల్డ్‌లోనే పనిచేస్తుంది కదా, తెలుగు చక్కగా నేర్చుకుంది… బాగానే ఉంది డైలాగ్ డెలివరీ… పదీపదిహేనేళ్లుగా తెలుగు తెరను ఏలినా కొందరు తారలకు ఈరోజుకూ తెలుగు రాదు, నేర్చుకోరు…

కొన్ని పాత్రలకు విభిన్నమైన ఎంపికలు… విలన్ తండ్రిగా దలిప్ తహిల్ చేశాడు గానీ ఆ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు… మరో నటి గురించీ చెప్పాలి… సునైనా… ఈమెది కూడా మహారాష్ట్రే… మోడల్, నటి… ఎక్కువగా సౌత్ సినిమాలు, వెబ్ సీరీస్, టీవీ సీరియల్స్ గట్రా చేసేది… ఉన్నవి నాలుగైదు సీన్లే అయినా కుబేరాలో నాగార్జున భార్యగా బాగానే చేసింది…

రోబో పాత్రలో సౌరవ్ ఖురానా లుక్ కాస్త సోనూ సూద్‌లా ఉన్నాడు… ఆ పాత్రకు అవసరమైన దుష్టత్వాన్ని చూపించాడు… ఎటొచ్చీ ఫాఫం సాయాజీ షిండేను సరిగ్గా వాడుకోలేదు… తను ఆ పోలీస్ పాత్రకు సూట్ కాలేదు కూడా… మంత్రి సిద్దప్ప పాత్రకు హరీష్ పేరడి పర్లేదు… ఓ అనామక సాధువు పాత్రలో నటుడు, దర్శకుడు భాగ్యరాజా, ఏదో సరదాగా చేసి ఉంటాడు ఆ పాత్రను…

మరో చిన్న పాత్రలో నాజర్ కూడా… ఏదో అతిథి పాత్రలు అనుకుని చేసినట్టున్నారు వీళ్లంతా… సబ్ రిజిస్ట్రార్ పాత్రలో జయప్రకాష్, గ్యాస్ ఫీల్డ్ సైంటిస్టుగా అళగం పెరుమాళ్… చూడబోతే నాగార్జున తప్ప అంతా తెలుగేతరులే… అందుకే కాస్త కొత్తకొత్తగా ఉంది సినిమా… అఫ్‌కోర్స్, నాగార్జున కూడా కొత్తగానే కనిపించాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
  • శుకపికముల కలరవముల స్వర లహరులలో… ఏదో రసాన్వేషణ..!!
  • ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!
  • పాకిస్థాన్ వెళ్లడానికి మిల్కాసింగ్ ససేమిరా… నెహ్రూ ఒత్తిడి… ఎందుకు..?!
  • గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
  • కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!
  • కాజోల్ మీదొట్టు… రామోజీ ఫిలిమ్ సిటీ దెయ్యాలన్నీ పారిపోయాయ్..!!
  • ఇది శేఖర్ కమ్ముల సినిమా కానేకాదు… కుబేరపై ప్రశంసలకు మరో కోణం…
  • ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…
  • ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions