ఆమెకు అలవాటే… వివాదాలు ఏమీ కొత్తకావు… ఏదైనా అనడానికి జంకు, బెరుకు ఏమీ ఉండవ్… బడబడా అనేస్తుంది… ఎవరి మీదనైనా వ్యాఖ్య చేయడానికి రెడీ… పైగా వెనక్కి తగ్గదు… సారీలు, ఐడోన్ట్ రిపీట్లు ఏమీ ఉండవు… పార్లమెంటులో అంతే, బయటా అంతే… అవును, ఇవన్నీ ఆమె గురించే… తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురించే…
కాళి మద్యం తాగుతుంది, మాంసం తింటుంది అని వ్యాఖ్యలు చేసి… ఎవరో మనకు పెద్దగా తెలియని దర్శకురాలు మణిమేగలై వైపు కమ్ముకునే దుమారాన్ని తన నెత్తి మీదకు తెచ్చిపెట్టుకుంది… అసలే నూపుర్ శర్మ వివాదంలో కాస్త డిఫెన్స్‌లో ఉన్న బీజేపీ ఇక డైవర్షన్ కోసం మహువాను బలంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది… బెంగాలీలు పార్టీలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలకు అతీతంగా కాళిని మాతగా ఆరాధిస్తారు… వాళ్లకు కాళి అంటే బెం‘కాళి’… అంతగా ఓన్ చేసుకుంటారు…
మహువా వ్యాఖ్యలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందనే సందేహమో లేక మహువాకు కాస్త పగ్గాలు అవసరమనే భావించారో … పార్టీ మహువా వ్యాఖ్యల్ని ఖండించింది… తమ ఎంపీ కదాని వెనకేసుకురాలేదు… తాజాగా మమత కూడా ‘‘తప్పుల్ని దిద్దుకోవచ్చు’’ అని స్పందించడం ద్వారా మహువాను తప్పుపట్టింది పరోక్షంగా..! మహువా మరో ట్వీట్ పెట్టింది… ఆమె టెంపర్‌మెంట్ తెలిసిందే కదా… పార్టీ ట్విట్టర్ ఖాతాను ‘అన్ ఫాలో’ చేసి పడేసింది… తద్వారా ఏ చర్యకైనా రెడీ అనే సంకేతాన్నిచ్చింది… వ్యవహారం ముదిరితే, అవసరమైతే పార్టీకి బైబై చెప్పడానికీ రెడీ అయిపోతోంది…
Ads
నలభై ఎనిమిదేళ్ల మహువా వ్యాఖ్యల్ని పార్టీ డిస్-ఓన్ చేసుకోవడం ఇప్పుడు కొత్తకాదు… గతంలోనూ జరిగింది… 2020లో మీడియాను ఉద్దేశించి దోపైసా అంటూ ఏవో కటువైన వ్యాఖ్యల్ని విసిరింది… దాంతో లోకల్ మీడియా ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది… ఆ సందర్భంలో పార్టీ ఆమెవి వ్యక్తిగత వ్యాఖ్యలనీ, పార్టీకి సంబంధం లేదనీ ప్రకటించి, చేతులు దులుపుకుంది… అప్పట్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మీద ‘‘తన గౌరవాన్ని కించపరిచాడు’’ అని కేసు పెట్టింది…
తను ఎవరిని విమర్శిస్తున్నదో, వాళ్లు ఏ హోదాలో ఉన్నారో కూడా ఆమె పట్టించుకోదు… పార్లమెంటులో ఓసారి మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ మీద కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసింది… బీజేపీ అంటే ఫుల్ మండిపడే ఆమె ఓసారి జీటీవీ మీద వ్యాఖ్యలు చేస్తే జీమీడియా కేసు పెట్టింది… ఢిల్లీ కోర్టు ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చింది, కేసు నడుస్తోంది… 2018లో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌ను బహిరంగంగానే వాయించేసింది… అదీ పెద్ద గొడవ… ఇప్పుడు కాళి వివాదం… ఆరేడు కేసులు పడ్డాయి… ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ కస్సుమని లేస్తోంది… అసలు ఎవరీమె..?
అస్సాంలోని కచార్ జిల్లా, లబాక్‌లో పుట్టిన ఈమె కలకత్తాలో చదువుకుంది… అమెరికాలోని మసాచుసెట్స్‌లో గ్రాడ్యుయేషన్… ఎకనమిక్స్, మ్యాథ్స్… చదువు కాగానే కొన్నాళ్లు జేపీ మోర్గాన్ కోసం న్యూయార్క్, లండన్‌లలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది… తరువాత ఇండియాకు వచ్చేసింది… 2010లో కాంగ్రెస్‌లో చేరి, కొంతకాలానికి జై టీఎంసీ అనేసింది… నిజానికి ఇంటిపేరు మొయిత్రా కాదు, మైత్ర లేదా మైత్రేయ… వరేంద్ర శాఖకు చెందిన బెంగాలీ బ్రాహ్మణుల పురాతనమైన ఇంటిపేరు…
తరువాత ఓసారి అసెంబ్లీకి ఎన్నికై, మొన్నటి జనరల్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది… సహజంగానే బెరుకు లేని దూకుడు తత్వం కావడం, ఇంగ్లిషులో మంచి ఫ్లుయెన్సీ కారణంగా పార్లమెంటులో కూడా ధాటిగా మాట్లాడుతుంది… కొన్నాళ్లు టీఎంసీకి అధికార ప్రతినిధిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించింది… గోవా ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జిగా కూడా చేసింది… ఆమె వ్యక్తిగత కుటుంబ వివరాలు పెద్దగా ఎక్కడా కనిపించవు… తను కొన్నాళ్లు స్కాండినేవియాలో ఉన్నాననీ, డేనిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రార్సన్ తన మాజీ భర్త అనీ మహువాయే ఓసారి వెల్లడించింది..! ఆమెను కోల్పోవడం వల్ల టీఎంసీకి నష్టమేనా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి…!!
Share this Article