ఒకప్పటి దర్శకుడు నర్సింగరావుకు మస్తు కోపమొచ్చింది… ఎవరి మీద..? కేటీయార్ మీద..! ఎందుకు..? ఈయన 40 రోజుల నుంచి కలవాల్సి ఉందని అపాయింట్‌మెంట్ కావాాలన్నడట… ఆయన ఇస్తలేడట…! సో వాట్..? ఆయన యాక్టింగ్ సీఎం, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నెత్తి మీద బొచ్చెడు పనులు, టైమ్ ఇవ్వలేకపోయాడేమో…! వాట్… సొసైటీలోని అత్యంత ఉన్నత వ్యక్తులకే టైమ్ ఇవ్వడా…? అవునండీ, ఇవ్వడు, ఇవ్వలేడు, ఇంతకీ అత్యంత ఉన్నత వ్యక్తులు అనగానెవ్వరు..? ఎవరు అలా సర్టిఫికెట్ ఇచ్చారు..? ఎవరో ఏమిటీ ఇచ్చేది… సెల్ఫ్ సర్టిఫికేషన్..!
రోజుంతా సోషల్ మీడియాలో వైరలయింది ఈయన కేటీయార్‌కు పెట్టిన బహిరంగలేఖ… కేటీయార్ అంటే పడవి సెక్షన్ బాగా ప్రచారం చేసింది… చూశారా, ఈయన సీఎం కూడా గాకముందే ఎంతగా ఎక్కిపోయిందో… అంతటి నర్సింగరావుకే టైమ్ ఇవ్వడం లేదట, 40 రోజులుగా… మరీ ఇంత అరాచకమా..? అనే వ్యాఖ్యలు స్ప్రెడ్ చేశారు… ప్రజాదర్భారుల పట్ల వ్యతిరేకంగా కేటీయార్ వ్యాఖ్యలు చేసిన రోజే ఈ నర్సింగరావు లేఖ వైరల్ అయ్యింది… చూశారా, తండ్రీకొడుకులు ఎవరినీ కలవరు అనే ప్రచారానికి ఈ లేఖను కూడా బేస్ చేసుకున్నారు కేటీయార్ వ్యతిరేక సెక్షన్…
కేసీయార్ ఎవరినీ కలవడు..? నిజమే… తనకు అవసరమున్న వ్యక్తులనే కలుస్తాడు… సేమ్, కేటీయార్… అయితే టైమ్ ఇవ్వకపోవడానికి కారణాలు ఉంటయ్… ఊరికే ఇక్కడ కేటీయార్‌నో, కేసీయార్‌నో నిందించే పనిలేదు… ఎందుకంటే..? ఈ 76 ఏళ్ల నాటి తెలంగాణ దర్శకుడు నర్సింగరావు ఒకరకంగా కేసీయార్ కుటుంబానికి చుట్టమేనట… మరి అంత దగ్గరి చుట్టానికి కూడా కేటీయార్ లేదా కేసీయార్ టైమ్ ఎందుకు ఇవ్వడం లేదు..? అసలు ఈయన వాళ్లను ఎందుకు కలవాలని అనుకున్నాడు..? బహిరంగంగా ఓ పోస్టు పెడతాడు, కానీ కారణం చెప్పడు..? ప్రజలకు ఏమాత్రం బోధపడని ఇదేం దర్శకత్వం మహాశయా… ఒక్కసారి ఆయన సోషల్ లేఖ చదవండి…
Ads
ఇదీ లేఖ పూర్తిపాఠం
‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు
నేను నచ్చలేదా?
ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు?
40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడిగితే.. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు..
రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు..
అంత గొప్ప హీనులు నీ సలహాదారులు. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల (అడుగుల) ఆనవాళ్ళు ఏమిటి?
ఇవన్నీ రేపు బహిరంగంగా మాట్లాడుకుందాం..
బి నర్సింగరావు.
- సొసైటీలో అత్యంత ఉన్నత వ్యక్తులు అంటే ఎవరో నిర్వచించాల్సి ఉండింది… మీరేనా దర్శకా..? అయితే మిమ్మల్ని అలా అత్యంత ఉన్నత వ్యక్తులు అన్నదెవరు..? మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారా..? ఫాఫం, కేటీయార్ దానికి బాధ్యుడెలా అవుతాడు..?
- నలభై రోజులుగా టైమ్ అడిగిన కారణం ఏది..? ప్రజలకు చెప్పలేని కారణం అయితే… దానికి సోషల్ రచ్చ దేనికి..? కేటీయార్ సోషల్ మీడియాలో వస్తే, పత్రికలు రాస్తే, సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎలాగూ చూస్తాడు, నేను అనదలుచుకున్న మాటలు ఆయనకు చేరతాయిలే అనే భావనా..?
- ఐనాసరే, కేటీయార్ ఖండించడం లేదు, స్పందించడం లేదు… అంటే నర్సింగరావు తనను కలవాలనుకున్న కారణం పట్టించుకోదగింది కాదని చెబుతున్నట్టే కదా… ఇందులో అత్యంత ఉన్నత వ్యక్తులను అణిచివేయడం ఏముంది…? టైమ్ ఇవ్వకపోతే ఇక అణిచివేసినట్టేనా..?
- ఇందులో హఠాత్తుగా 2 లక్షల కోట్ల అభివృద్ధి అనే ప్రస్తావన ఎందుకొచ్చింది..? ఇంత భారీ అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాను, కలవడం కుదరదుపో అన్నాడా కేటీయార్..? అదైనా స్పష్టంగా చెప్పొచ్చు కదా…
- ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు అని ఆగ్రహించాడట… కేటీయార్ ఫాఫం, కమలం ఎందుకవుతాడు..? తను కమలవ్యతిరేకి…
- రాజ్యం ఏలుడు కాదు, విజ్ఞత ఉండాలి అంటున్నావు కదా… ఇందులో పాలనకు సంబంధించిన అంశమేముంది..? ఏదో పర్సనల్ పని… ఆయన వినదలుచుకోలేదు, ఏదో అనుచిత పని అయి ఉంటుంది… ఇందులో రాజ్యం ఏలుడు వంటి పెద్ద పదాలు దేనికి..? విజ్ఞత లేకుండా పోయింది ఏముంది..?
- కేటీయార్, నీ గతమేందో మరిచినవా అని గుస్సా అవుతున్నడు… వోకే… నీ ఇంట్లో ఏమైనా పెరిగిందా మిస్టర్ నర్సింగరావు..? కేటీయార్‌కు చిన్నప్పుడు ఏమైనా చదువుకో, అమెరికా పోవడానికో, పెళ్లికో సాయం చేసినవా ఏంది..?
- నిన్ను గుర్తించి, పిలిచి, పీటేసి, సమస్య విని, పరిష్కరిస్తేనే… అది సరైన రాజ్యపాలన అవుతుందా..? లేకపోతే ఇక విజ్ఞత లేనట్టేనా..?
- కేటీయార్, కేసీయార్, కవితలను ఆక్షేపించడానికి బోలెడు సమస్యలు, అంశాలున్నయ్… అవేవీ ప్రస్తావించకుండా ఏదో పర్సనల్ పనిని ముందేసుకుని, నీకు విజ్ఞత లేదు, నీ గతం మరిచిపోయినవా, నీకు అత్యంత ఉన్నత వ్యక్తులు తెలియదు అనే పిచ్చిమాటలు దేనికి మిస్టర్ నర్సింగరావు..?
- తెలంగాణ సమాజం నీపట్ల కనబరిచే గౌరవాన్ని నువ్వే దిగజార్చుకుంటున్నవ్… నీ గతం మరిచావా..? విజ్ఞత లోపించిందా..?
Share this Article