.
. ( రమణ కొంటికర్ల ) .. …. ఉపాయంగా లాక్కుందామనుకుంటే.. అది అపాయంగా మారింది..? ఏకంగా హత్యకే దారి తీసింది. అలాంటప్పుడు ఎలాంటి పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది..? అలా ఎదురైన సంక్షోభమే.. కేరళకు చెందిన నిమిషా ప్రియపై ఆరోపించబడ్డ మర్డర్ కేస్. ఓ ఉదంతం సృష్టించిన కలవరం.. ఏకంగా ప్రియ మరణశిక్షకు దారితీసింది.
గత ఎనిమిదేళ్లుగా యెమన్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఓ నర్సుకు.. 2020లోనే అక్కడి ట్రయల్ కోర్ట్ మరణశిక్ష విధించింది. 2023 నవంబర్ లో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కూడా నిమిషాకు ట్రయల్ కోర్ట్ వేసిన మరణశిక్షను సమర్థించింది. దానికి ఇప్పుడు ఏకంగా యెమన్ అధ్యక్షుడు రషద్ అహ్మద్ అల్ అలిమి కూడా ఆమోదముద్ర వేయడంతో.. నిమిషా కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.
Ads
అసలేం జరిగింది..?
పొట్టకూటి కోసం యెమన్ దేశం బాట పట్టిన నిమిషా ప్రియది ఓ సినిమా కాల్పనికతను తలపించే వాస్తవికత! అది 2017.. యెమన్ దేశంలో నిమిషా ప్రియా అనే నర్సు.. తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని మర్డర్ చేసింది.
తాను స్వతహాగా నర్సు కాబట్టి.. మత్తు మందు ఇంజెక్ట్ చేసి… తన దగ్గర నుంచి లాక్కుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న మహదీ నుంచి పాస్ పోర్ట్ తిరిగి వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ డోస్ ఎక్కువై మహదీ చనిపోయాడు. ఆ హత్యా నేరం నిమిషా ప్రియను చుట్టుకుంది. అలా 2017 నుంచి నిమిషా ప్రియ.. తన మరణశిక్షకు సరైన పరిష్కారం దొరక్కపోతుందా.. క్షమాభిక్ష లభించకపోతుందానని.. గత ఎనిమిదేళ్లుగా యెమన్ జైల్లో ఊచలు లెక్కిస్తోంది.
అసలు నిమిషా ప్రియ ఎవరు..? ఎందుకు యెమన్ బాట పట్టింది..?
నిమిషా ప్రియ స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. నర్సింగ్ శిక్షణా కార్యక్రమం పూర్తైన నిమిషాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ డైలీ లేబర్స్. యెమన్ లో వచ్చే జీతానికి ఆకర్షితురాలై.. 16 ఏళ్ల క్రితం 2008 లో జస్ట్ తన 19వ ఏటనే యెమన్ వెళ్లింది.
2011లో కేరళకు వచ్చి టామీ థామస్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ యెమన్ బాట పట్టారు. టామీ థామస్ ఎలక్ట్రీషన్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. 2012లో వారికో పాప పుట్టింది. 2014లో ఆర్థిక స్థితిగతులు సహకరించక నిమిషా భర్త టామీ థామస్, కూతురుతో పాటు తిరిగి ఇండియాకొచ్చేశారు. కానీ, నిమిషా మాత్రం అక్కడే ఉండిపోయింది.
నిమిషా కొద్దిరోజుల తర్వాత తిరిగి వెళ్దామనుకున్నా అక్కడి అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం వీసాలివ్వడం ఆపేసింది. దాంతో అక్కడే ఉండిపోయిన నిమిషా.. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసింది.
2014లో నిమిషా ప్రియకు టెక్స్ టైల్స్ స్టోర్ నడిపే తలాల్ అబ్దో మహదీతో పరిచయమేర్పడింది. అప్పటికే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవముండటంతో.. ప్రియ సొంతంగానే తానో క్లినిక్ ప్రారంభించాలని భావించింది.
అలా ప్రియ పనిచేసే క్లినిక్స్ కు తరచూ వెళ్లే అబ్దో మహదీతో స్నేహం బలపడింది. ఆ క్రమంలో మహదీ.. ప్రియాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. యెమన్ చట్టాల ప్రకారం ఇతర విదేశీయులెవరైనా అక్కడ వ్యాపారం చేయాలంటే.. స్థానికులతో భాగస్వామ్యాన్ని కచ్చితంగా కల్గి ఉండాల్సిందే.
అలాంటి పరిస్థితుల్లో.. నమ్మబలికి విశ్వాసపాత్రుడిగా స్నేహం చేసిన మహదీపై విశ్వాసాన్నుంచింది. 2015లో మహదీ.. ప్రియ కూతురికి బాప్టిజం కోసం కేరళకు కూడా వచ్చి వెళ్లాడు.
అలా మొత్తానికి మహదీ కూడా మాటిచ్చిన ప్రకారమే ప్రియతో కలిసి.. ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించాడు. కానీ, వారిద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. దాంతో మహదీకున్న స్థానిక బలంతో.. ప్రియను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా వేధించాడు. గన్ తో బెదిరించేవాడు. ఆమె యెమన్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండేందుకు నిమిషా నుంచి తన పాస్ పోర్ట్ నూ లాక్కున్నాడు.
అదే విషయమై ప్రియ 2016లో మహదీపై యెమన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహదీని అరెస్ట్ కూడా చేశారు. కానీ, విడుదలనంతరం మళ్లీ మహదీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ సర్వసాధారణమైపోయాయి. అయినా, ప్రియ పాస్ పోర్ట్ మాత్రం తన చేతికింకా రాలేదు.
దాంతో 2017లో ప్రియ మహదీకి ఏదో ట్రీట్మెంట్ పేరుతో తమ క్లినిక్ లోనే మత్తుమందిచ్చింది. మత్తు మందిచ్చి అతడి దగ్గరే పెట్టుకుని.. తన కంటబడ్డ పాస్ పోర్ట్ ను లాక్కోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రియ చేసిన పనితో.. మత్తుమందు వికటించింది. డోస్ ఎక్కువ కావడంతో తలాల్ అబ్దో మహదీ చనిపోయాడు. ఆ హత్యా నేరం ప్రియకు చుట్టుకుంది.
అలా 2017 నుంచి ప్రియ యెమన్ జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో మళ్లీ యెమెన్ సుప్రీంకోర్టులో ప్రియ అప్పీల్ కు వెళ్లినా.. కోర్ట్ ఆమె వాదనలను తిరస్కరించి.. దోషిగా తేల్చింది. ఏకంగా అక్కడి ట్రయల్ కోర్ట్ 2020లో మరణశిక్ష విధించగా.. 2023లో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కూడా దాన్ని సమర్థించడం.. తాజాగా యెమన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అలిమి కూడా దానికి ఆమోదముద్ర వేయడంతో మళ్లీ ప్రియ ఇష్యూ ఇప్పుడు భారత విదేశాంగ శాఖకూ ఓ ఛాలెంజింగ్ గా మారింది.
మరి ప్రియకు మరణశిక్ష వార్తతో ఆమె కుటుంబం ఏంచేసింది..?
అప్పటి నుంచి ప్రియను మరణశిక్ష నుంచి విడిపించేందుకు ఆమె కుటుంబం పోరాటం మొదలైంది. భారత పౌరుల పర్యటనపై గత కొద్ది నెలల క్రితం వరకూ కూడా యెమన్ దేశానికి వెళ్లే విషయంలో నిషేధం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక ప్రధాన కారణాలేవైనా బలంగా చూపించగల్గితే పంపించే ఓ వెసులుబాటుండేది.
ఆ రిలాక్సేషన్ తో ప్రియ తల్లి ప్రేమకుమారి కోర్టుకెక్కి పోరాటం చేయడంతో ఆమెకు కేరళ హైకోర్ట్ ఆ అవకాశం కల్పించింది. దాంతో ప్రియ తల్లి ఎలాగోలా తన పోరాటంలో భాగంగా యెమన్ జైల్లో ఊచలు లెక్కబెడుతూ.. దేశం కాని దేశంలో క్షమాభిక్ష కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్న తన బిడ్డ నిమిషా ప్రియను కలిసింది.
దాంతో ఆ జైలు గోడల మధ్య ఆర్ద్రత నిండిన ఆవేదనా భరిత దృశ్యాలతో.. ఆ తల్లీబిడ్డల కంటనీరు మిగిలినవారినీ కంట తడిపెట్టించింది. మరోవైపు తన భర్త టామీ థామస్ కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తున్నాడు.
గడువులోపు బ్లడ్ మనీ అందకపోవడంతో దక్కని క్షమాభిక్ష!
బ్లడ్ మనీ లేదా దియ్యా.. అంటే ఎవరైతే హత్యకు గురయ్యాడో.. ఆ తలాల్ అబ్దో మహదీ కుటుంబీకులు ఒప్పుకుంటే… వాళ్లు కోరిన భరణం చెల్లించి.. క్షమాభిక్ష పొందే అవకాశముంటుంది. ఇందుకోసం గతంలో ఆదేశించడానికి కూడా నిరాకరించిన హైకోర్ట్ యెమన్ దేశ చట్టాల ప్రకారం క్షమాభిక్ష విషయంలో ఎలాంటి అవకాశమున్నా పరిశీలించాలని కూడా కేంద్రం కోరింది.
దాంతో యెమన్ లోని ఇండియన్ కాన్సులేట్ కూడా కచ్చితంగా దీన్ని పరిశీలిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గతంలోనే చెప్పిన మాట. దాని ప్రకారమే బ్లడ్ మనీ కోసం 34 లక్షల 22 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కానీ, అంత డబ్బు ఇచ్చుకోలేని పరిస్థితి ప్రియ కుటుంబీకులది.
దాంతో save nimisha priya international council సహకారంతో క్రౌడ్ ఫండింగ్ చేశారు. అయితే, ఇప్పటివరకూ 16 లక్షల 60 వేల రూపాయలు మాత్రమే ముట్టడం.. ఇంకా క్షమాభిక్షకు సంబంధించిన వ్యవహారంలో డబ్బు సెటిల్మెంట్ కాకమునుపే అక్కడి సుప్రీం జ్యుడీషియల్ తీర్పివ్వడం. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు ప్రియా కుటుంబంలో విషాదం నెలకొంది.
ఎన్నో ఏళ్ల తర్వాత దేశం కాని దేశంలో బిడ్డను చూసిన తల్లి ప్రేమకుమారి ఏమంటారంటే.. తన బిడ్డకు జైల్లో కూడా ఎందరో తన తోటి మహిళా ఖైదీల మద్దతుంది. వారంతా.. నన్ను చూడగానే నా బిడ్డలాగే నా దగ్గరకు ఉరుక్కుంటా వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇప్పుడు నిమిషా కోసం save nimisha priya international council యునైటెడ్ గా గట్టి పోరాటం చేస్తోంది.
యెమన్ షరియా చట్టాల ప్రకారం మృతుడి కుటుంబీకులు ఒప్పుకుంటే.. క్షమాభిక్షకూ ఆస్కారముంది కాబట్టి.. తన బిడ్డ మళ్లీ తమ వద్దకు తిరిగి వస్తుందనే ఆశాభావాన్ని తను గతంలో యెమన్ లో బిడ్డ దగ్గరకు వెళ్లివచ్చినప్పుడు చెప్పిన మాటలు.
కానీ, ఇప్పుడు ప్రియ తల్లి ప్రేమకుమారి ఆశలు అడియాసలయ్యే వార్త పిడుగులా వచ్చి పడింది. తన భార్య నిమిషా ను రక్షించుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ నుంచి మొదలుకుంటే ఎంబసీలు, అధికారులు, కోర్టుల చుట్టూ కాలికి బలపం కట్టుకు తిరిగిన భర్త టామీ థామస్ నిరీక్షణంతా వృథా అయి మొత్తంగా ఆ కుటుంబంలోనే ఓ విషాద ఛాయలలముకున్నాయి.
అయితే, ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. కచ్చితంగా నిమిషాను కాపాడే ప్రయత్నం చేస్తామని.. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెబుతున్నాడు. Xలో కూడా ఆయన ఈ విషయంపై పోస్ట్ చేశారు. ఆమెను ఏవిధంగా కాపాడగలమో అన్ని కోణాల్లోనూ భారత ప్రభుత్వం యోచిస్తోందన్నారాయన.
ఇప్పుడు ప్రియ రాక కోసం తన కుటుంబం ఎదురుచూస్తోంది. ఉద్ధేశపూర్వకంగా తన తప్పేమీ లేకపోయినా విధి ఆడిన వింత నాటకంలో మనుషులెలా పావులవుతారు.. జీవితకాలమెలా పోరాడాల్సి వస్తుందో చెప్పే కథ నిమిషా విషాదగాధ…
Share this Article