ఆమె… పేరు రంజిత… కాదు, అది ఒకప్పటి పేరు… సినిమాల్లో నటిస్తున్నప్పటి పేరు… వర్తమానంలో ఆమె పేరు నిత్యానందమయి స్వామి… ఆడలేటీ కాబట్టి స్త్రీలింగంలో స్వామిని స్వామిణి అంటారేమో తెలియదు గానీ… ఆమె పేరులో స్వామి అనే పదమున్నది… ఆమె కైలాస అనే స్వయంప్రకటిత, స్వయంసిద్ధ, స్వయంచాలక, స్వయంభూ దేశానికి ప్రధానమంత్రి…
ఈరోజు ఆమె వార్త ఒకటి కనిపించింది… అదేం చెబుతున్నదంటే… ‘‘దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద… తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం దిగువన ‘నిత్యానందమయి స్వామి’ అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉందని వివరించింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదు…’’
Ads
అప్పుడెప్పుడో నిత్యానంద స్వామికి ఆంతరంగిక సేవలు చేస్తున్నప్పటి ఫోటోలు, వీడియోల తరువాత ఆమె పేరు ప్రముఖంగా వినిపించడం మళ్లీ ఇదే… ఆమె కైలాశ దేశంలో నెంబర్ టూ… అవును, నిత్యానందుడికి అత్యంత సన్నిహిత శిష్యురాలు కదా… సో, తన దేశానికి ఆమెను ప్రధానిగా నియమించేశాడు… ప్రత్యేక జెండా, ఆర్బీఐ, పౌరసత్వం గట్రా అన్నీ వినిపించే ఈ దేశం చిరునామా మాత్రం ఎవరికీ తెలియదు… తెలియనివ్వరు… ఎందుకంటే… అక్కడిదాకా వెళ్లి మరీ ఇండియన్ పోలీసులు పట్టుకొచ్చి, కటకటాల వెనక్కి తోస్తారు కాబట్టి…
రంజిత విషయానికొస్తే… ఆమెను ప్రధానిగా ఆ దేశపు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారని ఓ తమిళపత్రిక రాసిందని ఆంధ్రజ్యోతి రాసింది… ఇది కలకలం రేపుతోందట… ఇటీవల ఈ దేశ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యారని, ఇక రంజిత కూడా త్వరలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కాస్త వెటకారాన్ని రంగరించి మరీ వార్త రాశాడు ఆ రచయిత ఎవరో గానీ…
నిజమా..? ఈమె ఆ దేశానికి ప్రధానమంత్రా..? అనుకుని ఓసారి సైట్ పరిశీలిస్తే అదేమీ కనిపించలేదు… ఆమెను నిజంగా ప్రధానిగా ‘నియమిస్తే’ మరి అధికారిక వెబ్‌సైట్ ఆమె వివరాల్ని తెలపాలి కదా… లేదు… కానీ లింక్‌డ్ ఇన్ లో మాత్రం ఆమె పేరు, హోదా కనిపించింది… ఇలా…
నవ్వొచ్చేదేమిటంటే… సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ అని కూడా ప్రొఫైల్‌లో కనిపించడం..! తమ దేశం భౌగోళిక వివరాలేమీ ఉండవు… సరికదా వాషింగ్టన్‌లోని కిర్క్‌లాండ్ సిటీ అడ్రెస్ పేర్కొన్నారు… స్వామికి స్త్రీలింగం అంటే మాయి స్వామి అట… అంటే మాత స్వామి… సరే, ఆ గోల ఎలా ఉన్నా సరే… ఆమె ప్రొఫైల్‌లో ఆమె ఉనికిని గురించి రాసుకున్న కవితాపాదాలు మాత్రం ఇంట్రస్టింగ్ అనిపించాయి… తెలుగులో రఫ్ అనువాదం ఇదుగో…
జీవితంలో మన ఎంపికలే మనమేంటో చెబుతాయి
నా జీవిత ప్రయాణం సన్యాసం, అది నా ఎంపిక
ఈ విశిష్ట ప్రయాణానికి కావల్సింది ధైర్యం
ఆ ధైర్యం కట్టుబాటు నుంచి బయటపడేసేలా
ఆత్మను మరింత లోతుగా పరిశోధించేలా
నిస్వార్థ చిత్తశుద్ధితో స్థిరంగా నిలబడేలా
జీవితపు అత్యున్నత సూత్రాలకై నడిచేలా
ఎన్నిసార్లు పడ్డా మళ్లీ లేచి నిలుచుకునేలా
సన్యాసం అంటే ఓ విశిష్టమైన పునర్జన్మ
సన్యాసం అంటే కుటుంబం, స్నేహితుల పట్ల నిర్లిప్తత కాదు
అహం, నొప్పి, బాధ వంటివేవీ లేని అంతరంగ విస్తరణ
ప్రపంచం మొత్తానికి మనమే ఓ ప్రతిబింబం…….. కొంతమేరకు అర్థంపర్థం లేని వచనకవిత్వంలా ఉన్నా సరే… తన సన్యాసం గురించి ఏదో విశిష్టంగా చెప్పడానికి తెగ ప్రయత్నించినట్టు మాత్రం అర్థమవుతోంది…
Share this Article