ఎవరీమె…? ఒక్కసారిగా అందరూ ఆమె వివరాల గురించి గూగుల్‌లో అన్వేషిస్తున్నారు..? ఎందుకు ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది..?
ఆమె పేరు పెటల్ గెహ్లాట్… అంతర్జాతీయ వేదికల మీద ఆమె భారత గళం… అనగా మన విదేశాంగ విధానాల్ని ప్రకటించే అధికారిక స్వరం ఆమె… ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఇండియా పర్మినెంట్ మిషన్ ఫస్ట్ సెక్రెటరీ ఆమె… మరి ఈమె పేరు అకస్మాత్తుగా పాపులర్ అయ్యిందేమిటి..?
శుక్రవారం యూఎన్ సర్వసభ్య సమావేశంలో యథావిధిగా పాకిస్తాన్ మన మీద విషం కక్కింది… అది దానికి అలవాటే కదా… ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తాడు… ఏదేదో వాగాడు… తరువాత రైట్ టు రిప్లై కింద పెటల్ గెహ్లాట్ ఇక తన బ్యాటింగ్ స్టార్ట్ చేసింది… ముందుగా నీ బుడ్డగోచీని సర్దుకోవోయ్, మాకు తరువాత చెబుదువు గానీ అనే తరహాలో కడిగిపారేసింది…
Ads
‘‘మీ దేశమే టెర్రరిస్టులకు అడ్డా… ముంబై దాడుల నిందితులను ఎందుకు కాపాడుతున్నారు..? క్రాస్ బోర్డర్ టెర్రిజం ఆపరు మీరు… పైగా ఎదుటి దేశాల మీద నిందలేస్తారు… అసలు మీరు ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతాన్ని ఖాళీ చేయండి ముందుగా… అసలు మీ దేశంలోె మానవహక్కుల ఉల్లంఘనను ఆపండి చేతనైతే… ఇతర దేశాల్లో వేలుపెట్టడం కాదు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకొండి… అసలు ఐక్యరాజ్యసమితి ఇలాంటి హాబిచువల్ అఫెండర్ల కుటిన వాదనలకు దుర్వినియోగం అవుతోంది, అది ఆగాలి…’’ ఇలా స్ట్రెయట్ డ్రైవ్స్, హుక్ షాట్స్, హెలికాప్టర్ షాట్స్, సిక్సర్లతో ఆడుకుంది…
పీవోకే ఖాళీ చేయండి అని స్పష్టంగా, అంతర్జాతీయ అధికార వేదిక మీద హెచ్చరించడం బహుశా ఇదే తొలిసారి… అఫ్‌కోర్స్, దేశ విదేశాంగ విధానం, పాలకుల ప్రాధాన్యాలను బట్టే అక్కడ మన అధికారుల మాటలు ఉంటాయి… ఇంతకీ ఎవరీమె..? ఇలాంటి ఉన్నతాధికారుల వివరాల్ని బహిర్గతం చేయరు… జీవన సహచరులు, పిల్లల వివరాలను కూడా బయటపెట్టనివ్వరు… వీలైనంతవరకూ గోప్యతను పాటిస్తారు… భద్రత కోసం… సో, కొన్ని వివరాలే తెలుస్తున్నయ్…
పెటల్ గెహ్లాట్… రాజ్‌పుత్ కుటుంబం… ముంబై… సెయింట్ జేవియర్‌లో స్కూలింగ్… తరువాత పొలిటికల్ సైన్స్‌లో ముంబైలోనే గ్రాడ్యుయేషన్… అదే సబ్జెక్టులో ఢిల్లీలో మాస్టర్స్ చేసింది… ఐఎఫ్ఎస్ క్రాక్ చేసింది… తెలుసు కదా… ఐఏఎస్, ఐపీఎస్ కేడర్‌కన్నా ఐఎఫ్‌ఎస్ సర్వీస్‌కు బ్యూరోక్రటిక్ సర్కిళ్లలో ఎక్కువ విలువ… (ఈమె మంచి గాయని, మంచి గిటారిస్ట్… విదేశీ పాటల్ని, ట్యూన్లను బాగా పాడుతుంది… యూట్యూబ్‌లో వీడియోలు కూడా ఉన్నాయి…)
ఐఎఫ్ఎస్ కెరీర్‌లో ఓర్పు ఎక్కువ అవసరం… ప్రతి పదాన్ని ఆచితూచి వాడాలి… స్పష్టత ఉండాలి, అదే సమయంలో ఒక్క మాట పొల్లుపోవద్దు… ప్రత్యేకించి మన ప్రత్యర్థి దేశాల వాదనలకు పర్‌ఫెక్ట్, స్పాంటేనియస్ కౌంటర్లు అవసరం… గతంలో మన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అక్బరుద్దీన్ ఇలాంటి సందర్భాల్లో ప్రముఖంగా వినిపించేది… మన విదేశాంగ వ్యవహారాల్లో వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్… తను రిటైరయ్యాడు… ఇప్పుడు పెటల్ గెహ్లాట్ పేరు… వీళ్లకు గైడ్ చేయడానికి గతంలోలాగా కాదు… ఈ విదేశీవ్యవహారాల్లో రాటుదేలిన జైశంకర్ గైడెన్స్ ఉండనే ఉంది వీళ్లకు… తనది కూడా మొన్నమొన్నటిదాకా ఆ సర్వీసే కదా…!!
Share this Article