ఒక సచిన్… ఒక గంగూలీ… ఒక సెహ్వాగ్… ఒక ధోనీ… ఒక కోహ్లీ వీళ్ల గురించి ఎవరైనా రాస్తారు… బయోపిక్కులూ తీస్తారు… అయితే వాళ్ల కథలు వేరు… కానీ మరికొందరు ఉంటారు… వాళ్లు అన్‌సంగ్ హీరోస్… ప్రస్తుతం ఓ క్రికెటర్ గురించిన బయోపిక్ అందరి చర్చల్లోనూ నానుతోంది… ప్రముఖ క్రికెటర్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు… అభినందిస్తున్నారు… నిజంగా ఓ డిఫరెంట్ బయోపిక్… రాహుల్ ద్రవిడ్‌కే స్పూర్తినిచ్చిన క్రికెటర్‌పై బయోపిక్… ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..? ప్రవీణ్ తాంబే… చాలామంది ఆయన పేరు విని ఉండరు కూడా…
ఇప్పుడు ప్రవీణ్ మీద డిస్నీ హాట్‌స్టార్ తీసిన మూవీ పేరు #KaunPravinTambe … అసలు ఎవరు ఈ ప్రవీణ్ తాంబే… ఎందుకింత స్పెషల్..? ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడకుండా… నేరుగా ఐపీఎల్ ఎలా ఆడగలిగాడు..? ఎందుకు రాహుల్ ద్రవిడ్ తనకు స్పూర్తి అని గర్వంగా చెప్పుకోగలిగాడు… ఎందుకు ఈయన బయోపిక్ మీద క్రికెటర్లు ఉద్వేగంతో పోస్టులు, ట్వీట్లు పెడుతున్నారు..?
Ads
ప్రవీణ్ తాంబేది ముంబై… మహారాష్ట్ర చెందిన ఈ క్రికెటర్ వాస్తవానికి ఫాస్ట్ బౌలర్ గా రాణించాలనుకున్నాడు… కానీ అప్పడు శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కెప్టెన్ అజయ్ కదమ్ ప్రవీణ్ బౌలింగ్ శైలి చూసి లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేయమని సలహా ఇచ్చాడట… కెప్టెన్ మాటను పెడచెవిన పెట్టకుండా ప్రాక్టీస్ చేసిన ప్రవీణ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆ రోజుల్లో సందీప్ పాటిల్ ని ఇంప్రెస్ చేసింది… అయితే ప్రవీణ్ కనీసం ముంబై తరపున కూడా ఆడకుండానే… ఐపీఎల్ కు సెలక్టయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడకుండానే ఐపీఎల్ లో అవకాశం చేజిక్కించుకున్నాడని స్వయానా రాహులే ప్రవీణ్ గురించి ముచ్చటగా చెప్పుకొచ్చేవాడు. అలా ఎంపికవ్వడానికి కారకుడు కూడా రాహులే…
2014లో ముంబై తరపున ఐపీఎల్ బరిలో దిగిన ప్రవీణ్ తాంబే కోల్ కత్తా నైట్ రైడర్స్ పై అహ్మదాబాద్ లో హ్యాట్రిక్ తీసి ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడంతో పాటే.. పర్పుల్ క్యాప్ గెల్చి… 2014 సీరిస్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కూడా నిల్చాడు… ఐపీఎల్ కోసం ప్రవీణ్‌ను రాహుల్ ఎంపిక చేసిన తీరు కూడా స్పూర్తి దాయకమే…
2013లో రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా రాహూల్ ద్రవిడ్ వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే కదా… ఆ టీమ్ ఓ లెగ్ స్పిన్నర్ కోసం చూస్తున్న తరుణంలో ప్రవీణ్ రాహుల్ తో పాటు… ఆ టీమ్ మేనేజ్మెంట్ ని కలిశాడట… ఐపీఎల్ అంటేనే కొత్తరక్తంతో నింపాలని… మెరికల్లాంటి ఔత్సాహిక క్రికెటర్స్ ని ప్రోత్సహించాలన్న ఉద్ధేశ్యమూ అందులో ఇమిడి ఉంది. కానీ, ప్రవీణ్ తాంబేకు అప్పటికే 41 ఏళ్లు. కొందరు యువ క్రికెటర్లు అటుగా వచ్చి ప్రవీణ్ ను చూసి రాహుల్ ని ఈ అంకుల్ ఎవరనీ అడిగారట…
కానీ ఎందుకో రాహుల్ ద్రవిడ్ కు మాత్రం తాంబే నచ్చేశాడు. అతనితో మాట్లాడాక అతడిలో ఆ తక్కువ సమయంలోనే కమిట్మెంట్ కనిపించిందో, ఏమోగానీ రాహూల్ రాజస్థాన్ రాయల్స్ కి తాంబేని సెలక్ట్ చేశాడు. ఇంకేం తెల్లవారే ఆర్ఆర్ సీఈవో నుంచి ఫోన్ కాల్. ఆర్ యూ క్రేజీ… 41 ఏళ్ల వ్యక్తిని లెగ్ స్పిన్నర్ గా ఎంపిక చేస్తారా…? ఐపీఎల్ అంటేనే యువరక్తం కదా అంటూ అటునుంచి సీఈవో మాటలు… కానీ రాహుల్ తేల్చి చెప్పేశాడు. అతడిలో ప్రతిభ ఉంది. నేను నమ్మాను.. కాబట్టి సెలక్ట్ చేశానని…
ఆ తర్వాత ఐపీఎల్ లో ఏడాది, ఏడాదిన్నర తర్వాత కూడా తాంబేలో క్రికెట్ పైనున్న దాహం… అతడి వైఖరిని నిశితంగా తాను పరిశీలించేవాడినని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఎప్పుడు కాస్త సమయం ఖాళీగా దొరికినా.. తన టీమా, ఇతర టీమా అని చూడకుండా అందరు ప్లేయర్లతో కలిసిపోవడం.. నేర్చుకోవడం…
ముఖ్యంగా షేన్ వాట్సన్, బ్రాడ్ హోజ్, అలాగే తనతో ప్రవీణ్ తాంబే మాట్లాడే తీరు… ఏదో చేయాలన్న తపన తనలో కనిపించేదంటాడు రాహుల్… సుమారు 20 ఏళ్ల పాటు ఓ గల్లీ క్రికెటర్ గా, ఎక్కడో మైదానాల్లో ఆడి.. ఎలాంటి గుర్తింపు లేకుండా… 41 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కూడా ఓ వరంలా భావించి తాంబే పడిన తపన తీరు తనను కదిలించిందంటాడు రాహూల్. ఇవాల్టి యువ క్రికెటర్లకు ఆటపై తాంబేలోని మక్కువ.. కమిట్మెంట్ ఉంటే కచ్చితంగా రాణిస్తారని.. తనను అంతగా ఇన్ స్పైర్ చేసిన ప్రవీణ్ తాంబేను ఆకాశానికెత్తేశాడు ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రవిడ్… వీళ్లే రియల్ హీరోస్… ఇవే రియల్ బయోపిక్స్… — రమణ కొంటికర్ల
Share this Article