కైకేయి
——–
సాగర సంగమమే చరమ గమ్యంగా సాగిపోతున్న ఒక ఏటి ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ అడ్డుతగిలితే, ఆ ప్రవాహం చిందర వందర అవుతుంది. పాయలు పాయలుగా చీలిపోతుంది. చిత్ర విచిత్రాలైన మలుపులు తిరుగుతుంది. ప్రవాహ వైశాల్యం కూడ పెరుగుతుంది. అడ్డుపడిన కొండ వల్ల ఆ ప్రవాహానికి ఇలా జరిగినా, దాని వల్ల లోకానికి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రవాహం పాయలుగా చీలి, మలుపులు తిరిగి, విశాలమైనందువల్ల అనేక ప్రాంతాల నీటి సమస్య తీరుతుంది. క్షామ బాధ తొలగుతుంది. ఆ ప్రాంతాలన్నీ సశ్యశ్యామలా లౌతాయి. సుఖ సంతోషాల్లో ఓలలాడుతాయి.
కొందరు మహా పురుషుల జీవితాలు కూడా ఇంతే. అప్పుడప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎవరో ఒక కొండలా అడ్డు పడుతారు. వాళ్ళ జీవితాలను మలుపు తిప్పుతారు. అనేక కష్ట నష్టాలు కలిగిస్తారు. అయినా లోకానికి దాని వల్ల కొంత మేలే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ మేలే జరుగుతుంది. ఎందుకంటే, అలా జరిగినప్పుడు, ఆ మహాపురుషుల జీవితాలు, శక్తిసామర్థ్యాలు సమాజముఖాలై అనేక సమస్యలు పరిష్కారం కావటానికి, అనేక సత్ఫలితాలు సమాజానికి అందటానికి అధికంగా తోడ్పడుతాయి.
Ads
కాని, చిత్రమేమంటే – ఏటిని అడ్డుకొన్న కొండను ఎవ్వరు నిందించరు. పైగా, ఎంతో మేలు చేసిందని అందరు అనుకొంటారు. మహాత్ముల జీవితాలకు అడ్డుపడిన వాళ్ళను మాత్రం అందరు నిందిస్తారు. వాళ్ళు అడ్డుపడటం వల్ల సమాజానికి మేలు జరిగిందన్న విషయాన్ని కూడ అట్టె పట్టించుకోరు. ఎందుకంటే – అడ్డుపడిన ఆ కొండకు ఏ స్వార్ధమూ ఉండదు. అడ్డుపడే ఈ మనుషులు అమిత స్వార్థపరులు. అందుకే ఆ కొండను ఉపకారిగా భావిస్తారు. ఈ మనుషులను దోషులని దూషిస్తారు.
శ్రీమద్రామయణంలో కైక విషయంలో ఇదే జరిగింది. శ్రీరామచంద్రుని యువరాజ్యాభిషేకానికి పెద్ద కొండలా అడ్డుపడింది. భోగభాగ్యాలతో తుల తూగవలసిన ఆయన జీవితాన్ని అడవుల పాలు చేసింది. అయితే దాని వల్ల లోకానికి మహోపకారం జరిగింది. కాని, ఆ కోణంలో ఆలోచించే దెవరు? ఆమెను మెచ్చుకొనే దెవరు? స్వార్థబుద్ధితో శ్రీరామచంద్రుని జీవితాన్ని అడవుల పాలు చేసిందని, కడకు తన భర్త మరణానికి కూడ కారణమయ్యిందని మాటలు పడుతూనే ఉంది.
కైక అనుకొన్నదొకటి. అయింది ఇంకొకటి. కథంతా జరిగినప్పుడు మేనమామ దగ్గర ఉండిన భరతుడు వచ్చాడు. పరిస్థితులను అర్థం చేసుకొన్నాడు. తల్లిని తీవ్రాతి తీవ్రంగా నిందించాడు. రాజ్యాన్ని తిరస్కరించాడు. రాముడిని తీసుకురావటానికి అడవులకు బయలుదేరాడు.
కైక నెత్తిన పిడుగు పడ్డట్లయింది.
ఇప్పుడు ఆమెది సముద్రమంత నిరాశ, కొండంత బాధ, ఆకాశమంత అవమానం. ఎవ్వరినీ చూడలేని స్థితి. ఏమీ చేయలేని స్థితి. తన వేలుతో తానే కన్ను పొడుచుకొన్న స్థితి. తాను చేసిన పాపం అప్పటికప్పుడే అనుభవిస్తున్న స్థితి. తానొక జీవచ్ఛవంగా మారిన స్థితి. పాపం! అందరితో పాటు ఆమెకూడా రాముడిని ఆహ్వానించటానికి అడవులకు వెళ్ళింది. తన ఆత్మాభిమానాన్ని, మూర్ఖపు పట్టుదలను ఎక్కడ మూట గట్టి పెట్టి వెళ్ళిందో!
భరద్వాజాశ్రమంలో అందరి వలె ఆమె ఆ మహర్షి ఎదుట నిలబడ లేక, ఆ మహర్షికి తన ముఖం చూపించలేక సిగ్గుతో క్రుంగి పోతూ ఆ మహర్షి పాదాలకు నమస్కరించిందట. అంతేకాదు ఆ మహర్షికి ప్రదక్షిణం చేసి, ఆ ప్రదక్షిణ నెపంతో భరతుని ప్రక్కకు వచ్చి దీనాతి దీనంగా నిలబడిందట. చిత్ర కూటంలో శ్రీరామచంద్రుడు, కౌసల్యాసుమిత్రలతో పాటు తన పాదాలకు కూడా ప్రణమిల్లే సరికి, కైక మానసికంగా ఎంత క్రుంగి పోయిందో!
తమ్ముడు భరతుడితో ఆయన ‘ భరతా ! తల్లి కైకేయి మీద కోపపడవద్దు. ఆమెను గౌరవించు, ఆదరించు, లేకుంటే నా మీద, మీ వదినె మీద ఒట్టు’ అన్నప్పుడు ఆమె హృదయం ఎన్ని బద్దలయ్యిందో? తాను ఊహించినట్లు భరతుడు పట్టాభిషిక్తుడై అష్టైశ్వర్యాలు అనుభవించకుండ, నారచీరలు కట్టుకొని నంది గ్రామంలో రామపాదుకలు పూజిస్తూ రాజభృత్యునిలా జీవితం గడుపుతుంటే- ఆ పదునాలుగేళ్ళు ఆమె మనస్సు ఎంత కుంచించుకు పోయిందో! అరణ్య వాసంలో అనేక కష్టాలనుభవించి, లోకోప కారకాలైన అనేక ఘనకార్యాలు చేసి, అందరి మన్ననలు పొంది, అయోధ్యకు తిరిగి వచ్చిన రామచంద్రుడు తన పాదాలకు ప్రణమిల్లేసరికి ఆమె మనస్సు ఎంత కుదుట బడిందో!
అయినా మానవజీవితంలో అన్నీ మనిషి ఆశించినట్లే జరుగవు. ఆశించిన దానికి అయిన దానికి తేడా ఉన్నప్పుడు, చేసిన తప్పుకు చిత్ర విచిత్రంగా శిక్ష అనుభవించేటప్పుడు – ఏ మనిషి అయినా, మానసికంగా ఎంతో నలిగిపోక తప్పదు.
అంతేకాదు ఒక్కొక్కసారి ఈ లోకంలో ఎవ్వరు ఎందుకు పుడతారో, ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో – ఒక్కొక్కరిలో ఏ బుద్ధి ఎప్పుడు పుడుతుందో, ఎందుకు పుడుతుందో, అది ఏయే పరిణామాలకు దారి తీస్తుందో చెప్పటం చాల కష్టం. శ్రీరామపట్టాభిషేక భంగానికి, ఆయన వన వాసానికి కైకేయి కారణభూతురాలైనా, అందుకు ఆమెను అందరు అనేక విధాల నిందించినా, ఆమె పేరు ఆడపిల్లలకు ఎవ్వరూ ఈ నాటికీ పెట్టకపోయినా, అన్నింటిని మించి శ్రీరామునికి, సీతకు ఆమె వల్ల ఎంతో అపకారమే జరిగినా – ఆమె వల్ల లోకానికి మాత్రం మహోపకారమే జరిగింది. రాక్షసబాధ తొలగిపోయింది. రామావతారం సార్థకమైంది. రామాయణాన్ని మలుపు తిప్పిన ఒక స్త్రీ పాత్ర కైక… (పమిడికాల్వ మధుసూదన్…. 99890 90018)
Share this Article