మన సమస్య ఏమిటంటే..? లోపభూయిష్టమైన మన న్యాయవ్యవస్థను గాడిలో పెట్టే ఆలోచనలు చేయాల్సిన పెద్ద జడ్జిలు, అదేదో ఓ ఇండివిడ్యుయల్ కేసులో రేప్ కేసు నిందితుడిని, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటావా అనడుగుతారు… అసలు కీలకమైన స్థానాల్లో కూర్చునే పెద్దలు జాతీయ స్థాయిలో రాజ్యాంగరక్షణ, తీవ్రత ఉన్న పెద్ద పెద్ద కేసుల గురించే కాదు… లక్షల కేసుల డిస్పోజల్స్ గురించి, జైళ్లలో మగ్గుతున్న నిరపరాధుల గురించి, ధ్వంసం అవుతున్న కేసుల గురించి సీరియస్ ఎఫర్ట్ పెడితే ఎంత బాగుండు..? ప్రభుత్వాలకు ఎలాగూ పట్టదు, పైగా వీలయితే న్యాయవ్యవస్థను మరింత కంపు చేస్తాయి అధికారంలో ఉండే పార్టీలు… అందుకని తమ వ్యాధులకు తామే చికిత్స చేసుకోవాలి న్యాయవ్యవస్థ… తన పవిత్రతను, తన ప్రాధాన్యతను తానే కాపాడుకోవాలి… కనీసం ప్రయత్నించాలి… నిన్న పత్రికల్లో వచ్చిన ఒక వార్త… మన సిస్టం ఎలా ఉందో చెప్పడానికి ఓ మంచి తాజా ఉదాహరణ అనిపించింది…
ఆగ్రా… ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్… పేరు విష్ణు తివారీ… 23 ఏళ్ల వయస్సున్నప్పుడు ఒకామె రేప్ ఫిర్యాదు చేసింది… పోలీసులు కేసు కట్టి లోపలేశారు… మూడేళ్లు గడిచాయి… ఆ కేసులో పదేళ్ల శిక్ష పడింది… ఓ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది… దాని కింద జీవిత ఖైదు… తన బంధువులు తనకు న్యాయం కావాలని హైకోర్టుకు వెళ్లారు… కేసు సాగీ సాగీ ఏళ్లు గడిచిపోయాయి… 20 ఏళ్లు… తన జీవితంలో అత్యంత కీలకమైన యవ్వనం ఆ జైలు కిచెన్లో పనికే సరిపోయింది… ఒళ్లు హూనమైంది… మొన్నటి జనవరిలో కోర్టు తనను నిర్దోషి అని చెప్పింది… విడుదలయ్యాడు… అంటే చేయని నేరానికి, అన్యాయంగా ఇరవయ్యేళ్ల శిక్ష అనుభవించి, చివరకు చేతిలో 600 రూపాయలతో స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చాడు… ఇదీ వార్త…
Ads
ఈలోపు కుటుంబసభ్యుల్లో ఓ బ్రదర్ తప్ప అందరూ చనిపోయారు… ఆరెకరాల భూమి హరించుకుపోయింది… తనకు జరిగిన మానసిక, శారీరిక, సామాజిక నష్టం విలువ ఎంత..? దానికి పరిహారం ఎవరివ్వాలి..? జరిగిన తప్పుకు బాధ్యులెవరు..? వారికి పడాల్సిన శిక్ష ఏమిటి..? ఇవీ ప్రశ్నలు… దురదృష్టవశాత్తూ వీటికి జవాబుల్లేవు… పది మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది మనం ఘనంగా చెప్పుకునే నినాదం… నీతి… కానీ జరిగేది ఏమిటి..? ఎవరో కేసు పెట్టేస్తారు, ఇక నీ చావు నువ్వు చావు… నీ నిర్దోషిత్వం నిరూపించే బాధ్యత నీదే… డబ్బులుంటే న్యాయం దొరుకుతుంది… లేకపోతే లేదు… జైళ్లలో వేల మంది మగ్గిపోతున్నారు… వాళ్ల గురించి ఎవరూ ఆలోచించరు… ఇక జైళ్లలో స్థితిగతుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్…
నిజానికి ఈ కేసులోనూ సరైన రిపోర్టింగు జరిగిందా అనేది ఓ డౌటే… ఎందుకంటే… రేప్ కేసులో పదేళ్ల జైలు శిక్ష అంటే సరే… కానీ ఎస్సీ, ఎస్టీ కేసులో జీవిత ఖైదు వేయడం అనేది అసాధారణంగా కనిపిస్తోంది… పైగా రకరకాల రెమిషన్లతో యావజ్జీవం పడిన ఖైదీలు 14 ఏళ్లలోపే విడుదల అవుతుంటారు… మరి ఇతను 20 ఏళ్లు ఎందుకున్నాడు జైలులో..? తనకు దక్కాల్సిన రెమిషన్లు ఏమయ్యాయి..? తండ్రి, సోదరుడి అంత్యక్రియలకు సైతం పెరోల్ దొరకలేదు… సో, దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్, తీర్పు, శిక్ష, అమలు తీరు… మొత్తం ఏదో భారీ తేడా కొడుతోంది ఈ కేసులో… దురదృష్టం ఏమిటంటే లా ఫెటర్నిటీ గానీ, మీడియా గానీ ఇలాంటి వార్తల్లో లోతుకు వెళ్లకపోవడం…! తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది, రిపోర్ట్ అడిగింది…!
Share this Article