అందరిలోనూ ఒకటే ప్రశ్న… కమెడియన్ ఆలీ పాపులర్ ప్రశ్న ఒకటి ఉంది తెలుసు కదా… ఎవడు మమ్మీ వీడు..? ఎస్, అదే ప్రశ్న, అలాగే… ఇదెందుకు ఇప్పుడు బలంగా తెర మీదకు వచ్చిందంటే..? 82 ఏళ్ల ఈ ఎగ్జిమా పేషెంట్, అనగా ఎంత గోకినా తగ్గని దురద… కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లేలా ఎప్పుడూ ఏదో పెంట పెట్టేసే ఈయన్ని ఆ పార్టీ నాయకులెవరూ ఎందుకు ఇన్నేళ్లుగా భరిస్తున్నారు..? కాంగ్రెస్ రాజకుటుంబం, అనగా గాంధీ కుటుంబం కూడా ఎందుకు వెనకేసుకొస్తుంది..? అదీ ప్రశ్న…
అఫ్ కోర్స్, ఇప్పుడు నలుమూలల నుంచీ వెల్లువెత్తిన విమర్శలతో తలవంచుకుని పార్టీకి రాజీనామా చేశాడు, పార్టీ వెంటనే ఆమోదించింది, హమ్మయ్య, పీడ విరగడైంది అని ఊపిరి పీల్చుకుంది…
గుర్తుందా..? ఓసారి కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దులిపిపారేశాడు… ఇప్పుడైనా అడిగి చూడండి, ఎవరైతేనేం, పార్టీని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా అలాగే అంటాను, నో రిగ్రెట్స్ అంటాడు తను… అసలే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, మరి ఎప్పుడూ పిచ్చికూతలతో పెట్రేగే ఈ శామ్ పిట్రోడాను ఇన్నేళ్లూ ఎవరూ ఏమీ అనలేక పోయారెందుకు..?
ఆయన బయోపిక్ జోలికి పోవడం లేదిక్కడ… అవసరం లేదు, అంత మనం విశేషంగా, వివరంగా చెప్పుకోవాల్సినంత సీనేమీ లేదు… తను ఒడిశాలో ఓ గుజరాతీ కుటుంబంలో పుట్టాడు… (దేవుడా, దేన్ని కదిలించినా, ఎవరిని టచ్ చేసినా ఈ గుజరాత్ మూలాలే)… టెలికాం ఇంజినీర్, ఎంటర్‌ప్రెన్యూర్… చికాగోలో ఉంటాడు… ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు… ఆ పదవి నుంచి ఎవరూ ఈయన్ని పీకలేకపోయారు ఇన్నేళ్లూ…
Ads
ఇప్పుడెందుకు ఈయన్ని దేశంలో అనేకమంది తిట్టిపోస్తున్నారూ అంటే… రీసెంటుగా కొన్ని పిచ్చికూతలు… దేశంలో దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలాగా, తూర్పు-ఈశాన్యంలో చైనీయుల్లాగా, ఉత్తరాన శ్వేతజాతీయుల్లాగా, పశ్చిమంలో అరబ్బుల్లాగా కనిపిస్తారు అన్నాడు… ఐనా మేమంతా ఒకటే, దేశంలో ఇదీ మా వైవిధ్యం, ఇదే అసలైన ప్రజాస్వామ్యం అని ఏదేదో చెప్పాడు… కానీ మన దేశంలోనే ప్రజలను ప్రాంతాలవారీగా వేరే దేశస్తులతో పోల్చడం, అదీ ఇన్సల్టింగుగా ఉండటంతో మంట రేగింది… జాతివివక్ష అని బీజేపీ అందుకుంది… అసలు కాంగ్రెస్ రక్తమే ఇంత అని దాడి స్టార్ట్ చేసింది…
రాహుల్ గాంధీ సైలెంట్, సోనియా గాంధీ సైలెంట్… ప్రియాంక మాత్రం దేశంలో చాలా సమస్యలున్నయ్, మోడీ ఇలాంటి ఇష్యూస్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు అని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసింది… కానీ జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది… దీంతో జైరాంరమేష్ అబ్బే అవి మా పార్టీ అభిప్రాయాలు కావు, ఆయన వ్యక్తిగతం అని సింపుల్‌గా వివరణ ఇచ్చాడు… అయితే ఈ పిట్రోడాకు ఇదేమీ కొత్త కాదు, చాన్నాళ్లు నుంచి ఉన్న దురదే… గోక్కుంటూనే ఉంటాడు…
మొన్నమొన్ననే కదా అమెరికాలోని వారసత్వ పన్ను గురించి మాట్లాడాడు… దాన్ని ఆసరాగా తీసుకుని మోడీ దులిపిపారేశాడు… మంగళసూత్రాల్ని కూడా లాక్కుని ముస్లింలకు పంచేస్తుంది కాంగ్రెస్, బహుపరాక్ అని మొదలెట్టాడు… అయ్యో అయ్యో అది మా పార్టీ లైన్ కానేకాదు అని ఖర్గే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది… అంతకుముందు కూడా ఇంతే ఈ పిట్రోడా…
ఇలాంటి కూతలు ఎవరూ కూయకుండా ఓ స్పష్టమైన, కఠినమైన చర్య ఎందుకు తీసుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ..? గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యమే మా చేతులు, మూతులు కట్టేస్తోంది అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు… ఇప్పుడిక మూడింది… పార్టీని వదిలేశాడు…
ఈయన రాజీవ్ గాంధీకి సలహాదారు… ఇతర దేశాల్లో రాహుల్ ప్రోగ్రామ్స్, ప్రసంగాలు ఆర్గనైజ్ చేస్తుంటాడు… తనను తాను telecom inventor, entrepreneur, development thinker and policy maker అని చెప్పుకుంటాడు… 1989లో టెలికామ్ కమిషన్‌కు తొలి చైర్మన్, నేషనల్ నాలెడ్జి కమిషన్‌కు కూడా లీడ్ చేశాడు కొన్నాళ్లు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు…
ఓసారి జనరల్ ఎలక్షన్స్ సమయంలో… ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘‘పేద వర్గాల కనీస ఆదాయ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కోసం మధ్యతరగతి ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలి’’ అని ఏదో కూశాడు… అంటే మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా టాక్సులు బాదబోతున్నారనే ప్రచారం పెరిగింది… అయ్యో, అదేమీ లేదు బాబోయ్ అని అప్పట్లో చిదంబరం ఏదో ఖండన, వివరణ, స్పష్టీకరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది…
2023లో… అమెరికాలో ఓ సదస్సులో రాహుల్ సమక్షంలోనే… దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నయ్, అవేమీ మాట్లాడకుండా కేవలం రామ మందిరం, హనుమాన్ మందిరం గురించే అందరూ మాట్లాడుతున్నారు అన్నాడు… అవేమైనా జాబ్స్ క్రియేట్ చేస్తాయా..? (అచ్చం కేటీయార్, కేసీయార్ మాటల్లాగే ఉన్నాయి కదా…) అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సమయంలోనూ ఇలాగే వ్యాఖ్యలు చేశాడు… చెబుతూ పోతే, ఇలా చాలా… మోడీ, బీజేపీ చాలా లక్కీ… ప్రత్యర్థి శిబిరంలో శ్యామ్ పిట్రోడాలు, శశిధరూర్‌లు, దిగ్విజయ్ సింగ్‌లు, మణిశంకర్ అయ్యర్లు గట్రా ఉంటే ఆనందమే కదా… కాగల కార్యం పిట్రోడాలు తీరుస్తారు కదా…!!
Share this Article