.
కర్నాటక రాజకీయాలు చిత్రంగా ఉంటాయి… అన్ని చోట్లా ఉన్నట్టే అక్కడా వారసనేతల హవా అన్ని పార్టీల్లోనూ… కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కాస్త ఎక్కువ…
ఐతే సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో ఓ కలకలం… ఒకవైపు నాయకత్వ మార్పడి జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యతీంద్ర వ్యాఖ్యలు నిజంగానే విశేషం…
Ads
‘‘మా నాన్న కెరీర్ ముగిసినట్టే! ఆయన రాజకీయ జీవితం చివరి దశలో ఉంది’’ అంటున్నాడు తను… మొదటి నుంచీ ఉన్న ప్రచారం ఏమిటంటే… రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉండి, తరువాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పోస్టు ఇచ్చేయాలని..!
కానీ అది జరిగేట్టు లేదు, ఆ సూచనలు డీకేకు కూడా అర్థమవుతున్నాయి… అందుకే అంతా దైవేచ్ఛ అని వైరాగ్యం కనబరుస్తున్నాడు పైకి..! ఈలోపు యతీంద్ర వ్యాఖ్యలతో డీకే క్యాంపు ఉలిక్కిపడింది…
తండ్రి పొలిటికల్ కెరీర్ అయిపోయిందనే మాటలకు కాదు, తండ్రి అధికార వారసుడిగా మంత్రి సతీశ్ జార్కిహోళి బెటరనీ, తనయితే అన్నీ నిభాయిస్తాడనీ కొత్త ప్రతిపాదనను పరోక్షంగా ముందుపెట్టినందుకు…
కావాలని కొడుకుతో సిద్ధరామయ్యే పలికిస్తున్నాడా ఈ మాటల్ని..? లేకపోతే ఖర్గే, సిద్దరామయ్య ఒక్కటైపోయి, డీకేను సైడ్ చేసేస్తున్నారా..? ఇవీ డీకే క్యాంపు సందేహాలు…
‘‘నాన్న రాజకీయ జీవితం అయిపోతున్న ఈ దశలో బలమైన సిద్ధాంతం, ప్రగతి శీల భావాలు గల ఓ నాయకుడికి ఆయన మార్గదర్శిగా ఉండాలి… కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను పరిరక్షించి, పార్టీని సమర్ధవంతంగా నడపగల సత్తా జార్కి హోళికి ఉంది… అటువంటి సైద్ధాంతిక నిబద్ధత గల నాయకుడిని కనుగొనడం చాలా అరుదని నేను విశ్వసిస్తాను… ఆయన తన మంచి పనులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను…” ఇదీ యతీంద్ర ప్రసంగ సారాంశం బెళగావిలో…
ఫుల్ టరమ్ నేనే సీఎం అని సిద్ధరామయ్య చెబుతుంటాడు, నాయకత్వ మార్పు ఊహాగానాలను కొట్టేస్తుంటాడు… అంతా హైకమాండ్ దయ అని డీకే చెబుతుంటాడు… కాంగ్రెస్ ఎంపీ ఎస్ఆర్ శివరామ గౌడ ‘‘ఇటీవల పార్టీ అధినాయకత్వాన్ని కలిసి రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత తీసుకున్నాను… డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంలో ఎటువంటి అనుమానం లేదు.., కానీ తుది నిర్ణయం అధిష్టానం చేతిలో ఉంది’’ అన్నాడు…
ఎవరికితోచిన మాటలతో వాళ్లు మీడియాకు ఎక్కుతుండటంతో పార్టీలో గందరగోళం పెరిగింది… సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఇంకాస్త పెట్రోల్ పోశాడు… అవునూ, ఇంతకీ ఈ సతీష్ జార్కి హోళి ఎవరు..? డీకే, సిద్ధరామయ్యలతో పోటీపడే ముఖ్య నాయకుడా..? ఇవీ తన వివరాలు…
ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (Public Works Department) మంత్రి… 2008 నుండి బెళగావి జిల్లాలోని యమకనమరడి (Yemakanmardi) నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా (MLA) ప్రాతినిధ్యం… గతంలో ఎక్సైజ్ శాఖ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు… తన వయస్సు కూడా తక్కువేమీ కాదు… 63 ఏళ్లు…
బెళగావి జిల్లాలో జార్కి హోళి బ్రదర్స్ అంటేనే సీనియర్ రాజకీయ కుటుంబం… సతీష్ సోదరులు రమేష్ జార్కిహోళి, బాలచంద్ర జార్కిహోళి కూడా రాజకీయ నాయకులే… తను ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) నాయకుడు, ముఖ్యంగా వాల్మీకి/నాయక కమ్యూనిటీకి చెందిన నాయకుడు…
కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు కొన్నాళ్లు… ఒక బలమైన సీనియర్, ఎస్టీ నాయకుడిని ముందు పెట్టి డీకే ప్రయత్నాలకు సిద్ధరామయ్యే చెక్ పెడుతున్నాడని కర్నాటక మీడియా రాస్తోంది… ఖర్గే మాత్రం సైలెంటు..!! ఆయన 46 ఏళ్ల కొడుకు ప్రియాంక్ ఖర్గే కూడా కేబినెట్ మంత్రి ప్రస్తుతం..!!
Share this Article