ఒక నిర్మాత… డబ్బు ఖర్చు పెడతాడు… లాభానికి, నష్టానికి రిస్క్ తీసుకుంటాడు… అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తాడు, పనిచేయించుకుంటాడు… అనేక విభాగాలు, అనేకమంది, బోలెడంత ఖర్చు, రిలీజయ్యే వరకూ డౌటే… సక్సెసయితే డబ్బు, లేకపోతే నెత్తి మీద తుండుగుడ్డ… అయితే సినిమా టైటిల్ దగ్గర నుంచి రీమేక్, డబ్బింగ్, టీవీ హక్కుల దాకా మొత్తం నిర్మాత సొంతమే కదా… ఒక్క సినిమా సంగీతం విషయంలోనే తేడాలు ఎందుకు వస్తున్నట్టు..?
సంగీత దర్శకుడికీ హక్కులుంటాయట… గాయకులకూ రాయల్టీలు ఉంటాయట… రికార్డింగ్ కంపెనీలకు కూడా…! ఆమధ్య బాలు బతికి ఉన్నప్పుడు, తనకూ ఇళయరాజాకు నడుమ ఇదే తగాదా తెచ్చిపెట్టింది… ప్రైవేటు ఫంక్షన్లలో పాడినా సరే ఆ పాటలకు సదరు సంగీత దర్శకులకు డబ్బులు చెల్లించాలట… సరే, ఎవరికి ఏ రకమైన హక్కులుంటాయనేది, పాట మీద ఓనర్‌షిప్ ఎవరిదనేది ఓ సంక్లిష్టమైన సబ్జెక్టు… ఇప్పుడు మళ్లీ ఆ ఇళయరాజా మరో వివాదపు తెరమీద ప్రత్యక్షమయ్యాడు…
(ఆమధ్య ఎల్వీ ప్రసాద్ స్టూడియోలని తన రికార్డింగ్ గదికి సంబంధించి కోర్టు దాకా వెళ్లాడు, ఇజ్జత్ తీసుకున్నాడు ఇళయరాజా…) ఇప్పుడు వివాదం ఏమిటంటే..? 1978 నుంచి 1980 నడుమ విడుదలైన 30 సినిమా పాటలకు సంబంధించిన ఇష్యూ… వాటిల్లో 20 తమిళం, 5 తెలుగు, 2 మలయాళం, 3 కన్నడ సినిమాలున్నయ్… ఈ 20 చిత్రాల హక్కుల్ని ఆమధ్య ఇండియన్ రికార్డింగ్ కంపెనీ సొంతం చేసుకుంది…
Ads
హక్కుల్ని మేం కొనుక్కున్నాం కాబట్టి వాటిని ఇళయరాజా ఏరకంగానూ వాడుకోరాదని, స్టే విధించాలని సదరు రికార్డింగ్ కంపెనీ కోర్టుకెక్కింది… కోర్టు ఈ కేసు విచారించి, హక్కులు ఆ కంపెనీవే కాబట్టి ఇళయరాజా గానీ, మరో రెండు మ్యూజిక్ కంపెనీలు గానీ ఇకపై ఆ పాటల్ని వాడుకోరాదని తీర్పు చెప్పింది… దీని మీద ఇళయరాజా హైకోర్టులో అప్పీల్ చేశాడు…
చిత్ర నిర్మాతలకు సినిమా రైట్స్ మాత్రమే ఉంటాయి, పాటలకు వాళ్లు తొలి హక్కుదారులు కాదని ఇళయరాజా తరఫు న్యాయవాదులు వాదించారు… అవి విన్న డివిజన్ బెంచ్ నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆ ఇండియన్ రికార్డింగ్ కంపెనీకి, మరో రెండు మ్యూజిక్ ఆడియో కంపెనీలకూ నోటీసులు జారీచేసింది… ఇదీ తాజా వార్త…
డబ్బు ఖర్చు పెట్టి, సినిమా కథకు తగినట్టు పాటలు రాయించుకుని, పాడించుకుని, రికార్డింగ్ చేయించుకుని రిస్క్ తీసుకున్న నిర్మాత తొలిహక్కుదారు కాకపోవడం ఏమిటనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం… సంగీతదర్శకుడు గానీ, గాయకులు గానీ డబ్బు పెట్టేది లేదు, రిస్క్ లేదు, తమ పనికి పారితోషికం కూడా తీసుకుంటున్నారు… డబ్బు చెల్లించి చేయించుకున్న పనికి లాభనష్టాల జవాబుదారీ నిర్మాతే అయినప్పుడు… ఓనర్‌షిప్ కూడా తనదే అయి ఉండాలి కదా…
సరే, ఇదంతా ఓ వాదన… పాటలకు సంబంధించి సృజన, క్రియేటివ్ వర్క్ ఉందనే అనుకుందాం… కథ, డైలాగ్స్, బీజీఎం, స్క్రీన్-ప్లే, దర్శకత్వం తదితర పనులు కూడా క్రియేటివ్ వర్కే కదా మరి..? కానీ కేవలం పాటలకే ఈ హక్కులు, రాయల్టీ అడ్వాంటేజ్ ఎందుకొస్తోంది..? సో, ఇంట్రస్టింగ్, చెన్నై హైకోర్టు ఏం చెబుతుందో చూడాలిక..!!
Share this Article