Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కక్క’ వేముల ఎల్లయ్య ఒక్కడే… ఒక మహోద్యమం..! ఓ అవలోకనం..!!

December 11, 2025 by M S R

.

…………………………………………….
తెలంగాణ తిరుగుబాటు కవికోసం…
………………………………………………

.

Ads

ఆర్టిస్ట్‌ మోహన్‌ అనే పారిజాతం పూల చెట్టు నీడలో – పాతికేళ్ల క్రితం – ఓ సాయంకాలం వేముల ఎల్లయ్య అనే రచయిత నాకో పుస్తకం యిచ్చాడు.
‘కక్క’ దాని పేరు. చిన్న నవల.
తప్పకుండా చదవమని చెప్పాడు.

కొన్ని పేజీలు చదివాను. ఉడుకుతోన్న అన్నంలాంటి స్వచ్ఛమైన తెలంగాణ మాండలికం. వరంగల్, నల్గొండలో సామాన్య జనం మాట్లాడే యాస. అర్ధంకావడం కష్టంగా వుంది. తర్వాత చదవొచ్చులే అని పక్కన పడేశాను.
కొన్ని నెలలు గడిచాయి.

  • ఓ రోజు పొద్దున్నే ‘ఈనాడు’ చదువుతూ ఒక వార్త దగ్గర ఆగిపోయాను. ‘‘ఆంధ్రా యూనివర్శిటీ సిలబస్‌లో వేముల ఎల్లయ్య కక్క’’ అనే హెడ్డింగ్‌ ఉంది. ఒక అరుదైన, అపురూపమైన, అంతరించిపోతున్న ఒక భాషా సౌందర్యాన్ని ముందు తరాల కోసం ప్రిజర్వ్‌ చేసిన రచయిత కృషికి గుర్తింపుగా ‘కక్క’ సిలబస్‌లో చేర్చామని యూనివర్శిటీ పెద్దలు అన్నారు.

+ + +
ఎల్లయ్య నాకు మిత్రుడు. సన్నిహితుడు. ఈజీగా దూకుడుగా రెక్‌లెస్‌గా వుంటాడు. ఉపన్యాసాలు దంచడు. జ్ఞానబోధ చేయడు. తేలిగ్గా మాట్లాడుతూనే సాహిత్యమూ, కవులూ, రచనలు గురించి క్లియర్‌గా చెబుతాడు. బాగా చదువుకున్నవాడనీ, కింద కులాలు, పేదల పట్ల ప్రేమగలవాడనీ, ఈ దొంగ సమాజాన్ని చూసి బెంగపడుతున్నాడనీ తెలుస్తూనే వుంటుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా, జనగాం తాలుకా లింగాల ఘణపురం ఎల్లయ్య సొంత వూరు. తల్లిదండ్రులు వేముల బుచ్చయ్య, చంద్రమ్మ. కూతురు స్వర్ణలత ఇంజినీరింగ్‌ కాలేజి లెక్చరర్‌. కొడుకు చదువుకుంటున్నాడు.

ఉస్మానియా యూనివర్శిటీ ఎల్లయ్యని ఎత్తుకుని పెంచింది. ఎం.ఎ.తెలుగు చేశాడు. గోసంగులు అనే సంచార జాతి వాళ్లు ఎస్సీల ఉపకులం. తెలుగు గోసంగుల సంస్కృతి సాహిత్యం మీద పీహెచ్‌డీ చేశాడు ఎల్లయ్య. 300 పేజీల పరిశోధనా గ్రంథం రాశాడు. సబ్మిట్‌ చేశాడు. అది పుస్తకంగా రాబోతోంది.

  • ఎల్లయ్య ఇప్పుడు ఎంఎ సంస్కృతం చదువుతో బిజీగా వున్నాడు. సంస్కృతంలో పురాణాలు, ఆది గ్రంథాలు చదవాలనే కాంక్షతో వున్నాడు. జాంబపురాణం కూడా ఆది పురాణమే. అయితే తాళపత్ర గ్రంథం లేదు. జాంబపురాణాన్ని సంస్కృతంలో రాయాలనే ఉత్సాహంతో వున్నాడు.

నాలుగు భాషల్లో కవిత్వం చెప్పగల ప్రతిభామూర్తి ఎండ్లూరి సుధాకర్, తన ‘గోసంగి’ కావ్యాన్ని వేముల ఎల్లయ్యకు అంకితం యిచ్చాడు. నల్గొండ రోడ్లమీద రికామీగా తిరుగుతున్న భావుకుడు ఎల్లయ్యను కవి శివసాగర్‌ ప్రేమించారు. నల్గొండ, గొల్లగూడలోని ఎల్లయ్య ఇంటికి వెళ్లి మూడు రోజులు వున్నారు ఆ మహాకవి.

రచయిత కేశవరెడ్డి ఒక రాత్రంతా ఎల్లయ్యతో మాట్లాడి, ‘‘నిన్ను సినిమాల్లో చూడాలి.. హీరోలా వున్నావు’’ అన్నారు. ప్రసిద్ధ రచయిత బోయ జంగయ్య ఆత్మకథ ‘అవసరం’ కి ఎల్లయ్యే సంపాదకుడు.

  • ‘‘జయప్రభ, విమల, మందరపు హైమవతిల కవిత్వం అంటే చాలా ఇష్టం. నీలి, ఎల్లి రాసిన అరుణ రచనలు బాగా నచ్చాయి. నీలి మేఘాలు, పతంజలి చూపున్న పాట, గోరటి వెంకన్న కవిత్వం ఎప్పటికీ గుర్తుంటాయి. జాజుల గౌరి ‘మన్నుబువ్వ’, గోగు శ్యామల కథలు నన్ను కదిలించాయి. విశ్వనాథ సత్య నారాయణ ‘వీరవల్లుడు’ నాకు నచ్చిన నవల అంటాడు ఎల్లయ్య.

బి.ఎ లాంగ్వేజెస్‌ ప్రాచ్య కళాశాలలో మూడేళ్లు చదువు. గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలలో తెలుగు పండిట్‌గా పనిచేశాడు. దేవులపల్లి కృష్ణమూర్తి రచనలు చదివి యిష్టపడ్డాడు. కొంతకాలం కలేకూరి ప్రసాద్‌తో కలిసి నడిచాడు. మందకృష్ణ మాదిగ ఉద్యమం మొదలైంది. మాదిగ చైతన్య రథం కదిలింది.

కృష్ణ మాదిగతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ అంతటా తిరిగాడు ఎల్లయ్య. ఈ చైతన్యంతో ఒక నవల రాయాలి అనుకున్నాడు. అపుడు వేముల ఎల్లయ్య వయస్సు 25 ఏళ్లు. అది 1999. ఎనిమిది నెలలు దీక్షగా రాసి ‘కక్క’ నవల పూర్తిచేశాడు. పోతులూరి వీరబ్రహ్మం చరిత్రలో ఒక పాత్ర మాదిగ కక్కడు.

ఈ 126 పేజీల చిన్న నవల వరంగల్, భువనగిరి, నల్గొండ – మూడు ప్రాంతాల భాష – మాదిగ నుడికారంతో నిండి వుంటుంది. ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్‌ యోహాను బాబు 2001లోనే ఈ నవల ప్రాధాన్యాన్ని గుర్తించారు. కక్కకి యాభై మార్కులు, కళ్యాణ్‌రావు అంటరాని వసంతానికి 50 మార్కులూ యిచ్చి ఎమ్మే సిలబస్‌లో చేర్చారు. అప్పట్లో ఎల్లయ్య విశాఖ వెళ్లాడు. ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ఫేకల్టీతో నవల గురించి మాట్లాడాడు.

కాకతీయ యూనివర్శిటీ తెలుగు హెడ్‌ బన్న అయిలయ్య, కక్కని సిలబస్‌లో చేర్చారు. విమర్శకుల మెప్పు పొందిన కక్కకు ప్రేరణ మాదిగ దండోరా ఉద్యమం.

మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాలు, మార్క్సిస్టు దృక్పథంలో తేడాలు, తెలంగాణా సాయుధపోరాటం పేరు మీద కమ్యూనిస్టులు దళితుల భూములు లాక్కోవడం కక్కలో ప్రధాన అంశాలు.

  • ‘‘బీదవాళ్లకి భూములు పంచకుండా నాయకులు పంచుకున్నారు. దొరలూ, విప్లవ రెడ్లు, విప్లవ బ్రాహ్మలూ పధాన పాత్రధారులు, ‘కమ్యూనిస్టు’ కరణాలే సూత్రధారులు. వీళ్లు పటేళ్లకు భూములు కట్టబెట్టారు. విప్లవ కరణాలు దళితులకు భూములు లేకుండా చేశారు’’ అని అంటున్నాడు వేముల ఎల్లయ్య.

కక్కలో ప్యూర్‌ మాండలికం అర్ధం కావడం చాలా కష్టం కదా – అన్నాను.
‘‘రెండు మూడు సార్లు చదువుకోవాలి. నేను రాసింది తెలుగే కదా, ఇంగ్లీషు వచ్చా మనకి ! నేర్చుకోలా?, అలాగే ’’ అన్నాడు ఎల్లయ్య.

కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రారు, ఇంగ్లీషు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం, హెచ్‌బీటీ గీతా రామస్వామి కలిసి, కక్కని ఇంగ్లీషులోకి అనువదించారు. అంతరించిపోతున్న ఒక భాషని రక్షించిన నవలగా కక్కకి నోబెల్‌ ప్రైజ్‌ యివ్వాలని నార్వేకి రికమెండ్‌ చేశారు ఇక్కడి ‘ఇఫ్లూ’ ప్రముఖులు.

ఎల్లయ్య ‘ముల్కి’ కవితా సంపుటితో మంచి దళిత కవిగా పేరు తెచ్చుకున్నాడు. 1984 – 2020 ‘లద్ద’ పేరుతో తన మొత్తం పొయిట్రీని పుస్తకం వేశాడు.
‘లద్ద’ అంటే తోలు చదును చేసే పరికరం.

నల్గొండ గోసంగి ప్రచురణ పేరుతో 70 కవితలతో ‘క్రీనీడ’ సంపుటి తెచ్చాడు. దాన్ని బెల్లి లలితకు అంకితం యిచ్చాడు. ‘సిద్ది’ అనే మరో నవల రాశాడు. ఎల్లయ్య మిత్రుడు, ఆర్టిస్టూ కారంకి శ్రీరామ్‌ ఈ పుస్తకాలకు అర్ధవంతమైన కవర్‌పేజీలు వేశాడు.
కక్క, సిద్ధి రెండు కలిపి ఒక పుస్తకంగా తెచ్చాడు ‘ప్రజాశక్తి’ లక్ష్మయ్య.

ప్రొఫెసర్‌ ఖాశిం, పైడి తెరేష్‌బాబు, ఎన్‌జే విద్యాసాగర్‌ల స్నేహాన్నీ, ప్రేమనీ పొందగలిగాడు.
ప్రసిద్ధ కవి కృపాకర్‌ మాదిగతో కలిసి ఉద్యమ నిర్మాణంలో పాటై, పద్యమై, ఉద్వేగమై ప్రవహించాడు ఎల్లయ్య. శ్రీలంకలో ప్రభాకరన్‌ పోరాటానికి సంఘీభావంగా తెచ్చిన ‘ఈలం’ కవితా సంకలనానికి ఎడిటర్‌గా ఉన్నాడు. వికలాంగుల బతుకుచిత్రం అంటూ 62 మంది రాసిన ‘అవిటి కతలు’ సంకలనానికి కూడా ఎల్లయ్యే సంపాదకుడు. అందులో ఎల్లయ్య కథలు రెండున్నాయి.



ఎల్లయ్య కొత్త నవల ‘మొండికత్తి’. గోసంగి అనేది మాదిగ ఉపకులం. వీళ్ల ఆదిగురువు గోసంగి తాత. బీసీల గురువూ ఈ గోసంగి తాతే. ‘మొండికత్తి’ వాళ్లు బీసీ–ఎ లోకి వస్తారు. ఈ మొండోళ్ల కులవృత్తి భిక్షాటన. నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో ఇప్పటికీ వున్నారు. వీళ్లకో పురాతన సంప్రదాయం వుంది.

  • భార్య ఎవరితోనన్నా తిరుగుతుందని అనుమానం వస్తే, భర్త కత్తితో ఆమె ముక్కు కోసేస్తాడు. ముక్కుకి కత్తిగాటు వుంటే ఆమె తిరస్కరించబడినది అని అందరికీ తెలుస్తుంది. అలా భర్త వదిలేసిన ఆడవాళ్లని తీసుకువెళ్లే హక్కు మొండోళ్లకి వుంటుంది. ఆమెకి గనక పిల్లలు వుంటే వాళ్లనీ తీసికెళ్లి పెంచే బాధ్యత తీసుకుంటాడు మొండోడు.
  • వెనకబడిన దరిద్రపు సమాజాల్లో వుండే ఈ దుర్భరమైన సంప్రదాయంపై వేముల ఎల్లయ్య నవల రాస్తున్నాడు. త్వరలోనే మనం చదవబోతున్నాం. మొగుడి కంటే మొండోడే బెటర్‌ అని తెలుసుకోబోతున్నాం కూడా.

కట్టంగూర్‌లో పది పదిహేను మొండోళ్ల కుటుంబాలు యిప్పటికీ వున్నాయి.
మండల్‌ కమివషన్‌ వచ్చి, బీసీ ఉద్యమం యావద్దేశాన్ని గడగడలాడించినప్పుడు, ఉత్తేజితుడైన ఎల్లయ్య ‘బహువిధ’ అనే 140 పేజీల నాటకం రాశాడు. దాన్ని కన్నడ దేశంలో ప్రదర్శించి సెలబ్రేట్‌ చేశారు.
కక్క నవలని కాకి మాధవరావు ‘సారంగ’లో సమీక్షించారు. ‘మాదిగల్లోని అసమానతల గురించి ముందుగా రాసింది నువ్వే ఎల్లయ్యా’’ అన్నారాయన.

మద్దెల శాంతయ్య ,ఎల్లయ్యా, గోరంటి వెంకన్నలతో కలిసి గడిపిన రోజులూ.., ఎల్లయ్యా, మోహన్‌లతో
కలిసి కాల్చిన సిగిరెట్లూ.., కలేకూరి, ఎల్లయ్య, లెల్లే సురేష్‌తో తాగిన టీలు.., ఉస్మానియాలో నలిగంటి శరత్‌ గదిలో కలసి పాడుకున్న డప్పుల నిప్పుల పాటలూ.., ఫుడ్‌ కార్పోరేషన్‌ గోడౌన్లలో బియ్యం బస్తాలు మోసే ఎల్లయ్య బావ నా బంధువని చెప్పుకునే ఆనందమూ– నాకెప్పుడూ గొప్ప జ్ఞాపకాలు… – తాడి ప్రకాష్‌      970454155

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కక్క’ వేముల ఎల్లయ్య ఒక్కడే… ఒక మహోద్యమం..! ఓ అవలోకనం..!!
  • పానీపూరి అమ్మిన లాభాలతో ఏకంగా హెలికాప్టర్ కొనేశాడా..? నిజమేనా..?!
  • ఆ ఊళ్లో ఎవరింట్లోనూ వంటశాల ఉండదు, ఎవరూ వండుకోరు…
  • డబ్బు పంచం, మందు తాపం.,. వోట్లు కొనం…… తరువాత మీ ఇష్టం…
  • పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!
  • యూవీ బ్రిటిష్ భార్య మనకూ పరిచయమే…! వాళ్ల లవ్ స్టోరీ తెలుసా మీకు..?!
  • Conspiracy behind Crisis…? ఇండిగో నిర్వాకం వెనుక ఏదో భారీ కుట్ర..!
  • ఇక న్యాయ వ్యవస్థపైనే… హిందూ వ్యతిరేక ఇండి కూటమి అటాక్…
  • రేవంత్‌రెడ్డి చెప్పిన గ్వాంగ్‌డాంగ్ ప్రత్యేకత ఏంటి..? ఎందుకది ప్రేరణ..!?
  • రావుగారింట్లో రేవతి వింత పాత్ర..! కేర్‌టేకర్ కమ్ టీచర్ కమ్ ఎవరీథింగ్…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions