వివేక్ రామస్వామి… రాబోయే రోజుల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీద పోటీపడబోయే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి… ఈ పోటీలో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆ పార్టీ తరఫున ప్రథమ స్థానంలోనే ఉన్నా, తన మీద ఉన్న కేసులు దృష్ట్యా రెండో స్థానంలో ఉన్న వివేక్ బహుశా అధ్యక్ష అభ్యర్థి అవుతాడని అంచనా వేస్తున్నారు… ఏమో, కాలం కలిసొస్తే అభ్యర్థి కానూ వచ్చు, ఎన్నిక కానూ వచ్చు…
ఏం… ఇండియన్ రూట్స్ ఉన్న కమలా హారిస్ డెమోక్రాట్ల తరఫున వైస్ ప్రెసిడెంట్ కాలేదా… తను ఏం చదువుకున్నాడు… ఏం కొలువులు చేశాడు… తరువాత ఏ వ్యాపారాలు ఆరంభించాడు అనే వివరాలకన్నా అసలు ఎవరు ఈ వివేక్ రామస్వామి అనే సెర్చింగే ఎక్కువైంది ఈమధ్య… సహజమే… తన వయస్సు ఇంకా జస్ట్, 38… ఇలాంటి నాయకత్వమే కావాలిప్పుడు అమెరికాకు… అమెరికన్లు కూడా ఇదే భావిస్తేనే సుమా…
పలువురు రాస్తున్నట్టు వివేక్‌వి ఇండియన్ రూట్స్… అంతే తప్ప ఇండియాలో పుట్టలేదు… తను పుట్టింది అమెరికాలోని సిన్సినాటీలో… తన తల్లిదండ్రులు కేరళ, పాలక్కాడ్ జిల్లా నుంచి సెవంటీస్‌లో అమెరికాకు వలస వచ్చారు… తండ్రి పేరు గణపతి రామస్వామి… కాలికట్‌లోని ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు… తరువాత ఇంజనీర్‌గా, పేటెంట్ లాయర్‌గా పేరు సంపాదించాడు… తల్లి పేరు గీతా రామస్వామి… మైసూరు మెడికల్ కాలేజీలో చదువుకుంది… జెరియాట్రిక్ సైకియాట్రిస్టు…
Ads
(వివేక్ తండ్రి గణపతి రామస్వామి, తల్లి గీత రామస్వామి)
అప్పుడప్పుడూ కేరళకు వచ్చేవాళ్లు… బంధుగణాన్ని కలిసి, పలు గుళ్లకు వెళ్లి వచ్చేవాళ్లు… అలా వివేక్‌కు కూడా చిన్నప్పటి నుంచీ కేరళతో అనుబంధం ఉంది… అన్నింటికీ మించిన ఓ ఆసక్తికర విశేషం ఏమిటంటే… వీళ్లది హిందూ కేరళ బ్రాహ్మిన్ కుటుంబం… ఒక అగ్రహారం వీళ్ల ఊరు… ఆ ఊళ్లో ఈరోజుకూ తమ పాత ఇంటిని అలాగే ఉంచుకున్నారు… ఎవరికీ అమ్మలేదు, ఎవరికీ ఇవ్వలేదు… తమ మాతృభూమి అనే ప్రేమతో దాన్నలాగే కాపాడుకున్నారు… అదీ ఆ కుటుంబం తమ రూట్స్ మీద కనబరిచే అభిమానం…
వివేక పుట్టింది 1985లో… ఓహియోలోని డైటన్ హిందూ టెంపుల్‌కు తరచూ వెళ్తుంటాడు… యాలెలో చదువుతున్నప్పుడు అక్కడే మెడిసిన్ చదువుతున్న అపూర్వతో పరిచయం… (అపూర్వ తివారీ, ఈమె తల్లితండ్రుల వివరాలు, ఇండియాలో రూట్స్, ఆమె పుట్టిన తేదీ కూడా ఎవరికీ తెలియదు, రఫ్‌గా 33, 34 ఏళ్ల వయస్సు)… తరువాత పెళ్లి… ఆమె ఫిజిషియన్ ఇప్పుడు… ఇద్దరు కొడుకులు, ఒకడు కార్తీక్, మరొకడు అర్జున్… వివేక్ పక్కా శాకాహారి… హిందూ మతాన్ని ఆచరిస్తాడు… తమిళం బాగా వచ్చు, కానీ మలయాళాన్ని కేవలం అర్థం చేసుకోగలడు…
అధ్యక్ష అభ్యర్థి అవుతాడా లేదానేది వేరే ప్రశ్న… అభ్యర్థి అయితే గెలుస్తాడా లేదానేది మరో ప్రశ్న… చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి… వర్ణవివక్ష బలంగా పనిచేసే అమెరికాలో సొంత పార్టీ వారే నెగ్గనిస్తారా అనేది ఇంకో ప్రశ్న… బట్, ఓ ప్రధాన పార్టీలో అధ్యక్ష పోటీ దిశలో మనవాడు రెండో స్థానం వరకూ రావడమే ఓ అచీవ్‌మెంట్… మిగతాది ఏమిటో కాలం చెబుతుంది… వేచి చూడాలి మనం…
Share this Article