.
ఆయేషా మీరా..! 2007 డిసెంబరు… విజయవాడలోని ఓ హాస్టల్ గదిలో ఈ బీఫార్మసీ విద్యార్థిని దారుణంగా హత్యాచాారానికి గురైంది… అనేకానేక మలుపులు… విచారణలు, దర్యాప్తుల అనంతరం… 18 సంవత్సరాలపాటు సాగదీయబడీ బడీ చివరకు కేసు ఇక తేలేది కాదని, ఆధారాలే లేవనీ కేస్ క్లోజ్ చేసేశారు…
ఆమె తల్లిదండ్రులు గనుక ప్రైవేటు కేసు వేయాలని అనుకుంటే న్యాయసహాయం చేస్తానని కోర్టు అంటోంది… కానీ ఇంకా పోరాడే శక్తి, ఓపిక, ఆర్థిక స్థోమత లేవని ఆమె తల్లిదండ్రులు నిస్సహాయంగా చేతులు ఎత్తేయడంతో కేసు క్లోజ్ చేస్తున్నామని చెప్పింది కోర్టు…
Ads
అంతేకాదు, ఆమె సమాధి నుంచి అవశేషాలను (రీపోస్ట్ మార్టం కోసం సేకరించినవి) ఆమె తల్లిదండ్రులకు అప్పగించేయాలని కూడా కోర్టు చెప్పింది… గతంలో దేశవ్యాప్తంగా సంచలనాన్ని, ఆలోచనను రేకెత్తించిన ప్రశ్న ‘వూ కిల్డ్ జెస్సికా’లాగే సేమ్ ప్రశ్న… వూ కిల్డ్ ఆయేషా..?
ఇక్కడ మనసు, మది తొలిచే మరో కీలక ప్రశ్న… నిందితుడు ఎవరో కనిపెట్టించి, శిక్షింపచేయాల్సిన బాధ్యత బాధిత తల్లిదండ్రులదా, ప్రభుత్వానిదా అనగా సమాజానిదా..? అనగా మన చట్టాలు, మన న్యాయవ్యవస్థ, మన దర్యాప్తు సంస్థలదా.?.
ఎందుకంటే..? ఒక దోషిని శిక్షించలేకపోవడం వ్యవస్థ అసమర్థత అవుతుంది, తనెవరో కనిపెట్టి, శిక్షించడం సమాజ అవసరం… 18 ఏళ్లుగా సమాజం ఆ దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది… వేనవేల వార్తలు… కానీ చివరాఖరికి ఏం జరిగింది..? చివరకు సమాజానిదే నిస్సహాయ స్థితి…
హత్యాచార ఘటన జరిగాక స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ ప్రారంభించారు… ఎవరో ఒకరు నిందితుడు అన్నారు, అరెస్టు చేశారు… ఫోరెన్సిక్ సాక్ష్యాలు, శాంపిల్స్, సీజ్ మెమోలు… కాగితాలపై అన్నీ సక్రమంగా ఉన్నట్టే కనిపించాయి…
కోర్టు విచారణలో ట్రయల్ కోర్టు నిందితుడికి శిక్ష విధించింది… ఆ సమయంలో చాలామందికి “న్యాయం జరిగింది” అనిపించింది… కానీ అప్పుడే కొన్ని సందేహాలు… నిజంగా నిందితుడు అతనేనా..? తెర వెనుక ఎవరో ఏదో ఒత్తిళ్లు తీసుకొస్తూ, కేసును పక్కదోవ పట్టిస్తున్నారా..? అసలు నిందితుడు బయటే ఉన్నాడా..?
కొన్నేళ్ల తర్వాత హైకోర్టు ఆ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది… ఆ సాక్ష్యాలు నమ్మదగినవేనా అని సందేహాలు వ్యక్తం చేసింది… దర్యాప్తు పద్ధతులపై ప్రశ్నలు లేవనెత్తింది… ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే శిక్ష ఇంతటి బలహీన ఆధారాలపై ఎలా నిలుస్తుంది అని అడిగింది…
కేసును మళ్లీ మొదటి మెట్టుకు తీసుకెళ్లింది… తదుపరి దశలో కేసు సీబీఐకి బదిలీ అయింది… ప్రజల్లో ఓ కొత్త ఆశ… సీబీఐ స్వేచ్ఛగా, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా కేసు దర్యాప్తు చేసి, నిజమేమిటో చెబుతుందని, నేరగాడు ఎవరో బయటపడిపోతాడని…
సీబీఐ పునర్విచారణ ప్రారంభించింది… పాత సాక్ష్యాలను తిరిగి పరిశీలించింది… కొత్త కోణాలు వెతికింది… కానీ కాలం గడిచింది… సాక్ష్యాలు క్షీణించాయి… గుర్తులు చెరిగాయి… వాంగ్మూలాలు మారాయి… చివరకు కోర్టు ముందు నిలిచినది… ఆధారాలు నిరూపణ స్థాయికి చేరలేదని కోర్టు పేర్కొంది… కేసు కొట్టివేయబడింది…
ఒక యువతి ప్రాణం పోయింది… ఒక కుటుంబం జీవితాంతం మానని గాయంతో మిగిలింది… ఒక నిందితుడు సంవత్సరాల జైలు జీవితం గడిపి చివరకు విముక్తి పొందాడు… కానీ అసలు ప్రశ్నకు సమాధానం ఇంకా మిగిలే ఉంది… నిజం ఏమిటి..? ఎవరు నేరగాడు..?
న్యాయం అంటే ఎవరో ఒకరికి శిక్ష పడటం మాత్రమే కాదు… నిజం వెలుగులోకి రావడం… నిర్దోషి నిర్దోషిగానే నిలవడం… బాధిత కుటుంబానికి నమ్మకం కలగడం… వ్యవస్థపై విశ్వాసం నిలవడం…
అయేషా మీరా కేసు ఇది ఒక ఫైల్ క్లోజ్ అయిన కథ కాదు… ఇది మన దర్యాప్తు వ్యవస్థ, న్యాయపరమైన ప్రక్రియలపై ఒక అద్దం… ఆ అద్దంలో కనిపిస్తున్నవి అనేక లోపాలు… అవి సరిచేయలేకపోతే వ్యవస్థలకు, సమాజానికి నష్టం… ఆయేషా కేసు చివరకు చెప్పిన పాఠం ఇదే..!!
భవిష్యత్తులో ఇంకెవరో ఆయేషా… ఆ తల్లిదండ్రులు కూడా 18 ఏళ్లు ఆగీ, ఆగీ, న్యాయం దక్కుతుందని ఆశపడీ పడీ… చివరకు ఆ అవశేషాలకు ఎండిన కళ్లతో మళ్లీ అంత్యక్రియలు జరిపే దురవస్థ రావద్దని వేడుకుందాం..!!
Share this Article