Murali Buddha………. మోడీని అందలమెక్కించి … బాబును వెంటాడుతున్న గోద్రా … బీజేపీతో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను … నా మాటే నిజమైంది … జర్నలిస్ట్ జ్ఞాపకాలు….
————————–
20 ఏళ్ళ క్రితం నాటి మాట .. 2002 ఎన్టీఆర్ భవన్ మెట్లెక్కి పైకి పోతుంటే అప్పుడే చంద్రబాబు వచ్చారు .ఇంగ్లీష్ ఛానల్ స్టార్ న్యూస్ రిపోర్టర్ బాబును పలకరించి గోద్రా అల్లర్ల గురించి అడిగారు . ఆ సమయంలో ఎన్టీఆర్ భవన్ లో ఇద్దరు ముగ్గురు విలేకరులు తప్ప ఎవరూ లేరు . ఆ సమయంలో ఉద్భవించిన వార్త రెండు దశాబ్దాలు అవుతున్నా బాబును వెంటాడుతూనే ఉంది . గోద్రా అల్లర్లకు బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి అని బాబు డిమాండ్ చేశారు . ఆ డిమాండ్ పుణ్యమా అని సీఎంగా మోడీ తన పదవిని పదిలం చేసుకోవడమే కాకుండా , ప్రధాన మంత్రి పదవి వరకు ఎదిగారు . బాబుకేమో మోడీ దర్శనం లభించడం లేదు …
Ads
మీడియాను చూస్తే మాట్లాడకుండా ఉండలేరు .అది బాబు బలహీనత , బలం రెండూ . పదేళ్ల ఉమ్మడి రాష్ట్ర సీఎం , ఐదేళ్ల ఆంధ్ర సీఎంగా జర్నలిస్ట్ లందరి సంక్షేమం వంటివి పెద్దగా పట్టించుకోలేదు కానీ కడుపు నిండా , కడుపు నిండానే కాదు ఒక్కోసారి అజీర్తి లేసేంతగా వార్తలు వడ్డించారు . ఆయన ఉన్నప్పుడు నాలుగైదేళ్ళ వర్షాలు లేక పంటలకు కరువు వచ్చిందేమో కానీ ఆ బీట్ రిపోర్టర్ల వార్తల కరువు అనే మాటే ఎరుగరు . పత్రికల్లో సింహా భాగం టీడీపీ రిపోర్టర్లే ఆక్రమించే వారు .
బాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడేవారు . అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవన్ తో పాటు సచివాలయానికి వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు మాట్లాడేవారు . వైయస్ఆర్ సీఎం కాగానే మీడియా అలానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తే , ఏమైనా మాట్లాడేది ఉంటే నేనే పిలుస్తాను అని వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు మాట్లాడే సంప్రదాయానికి స్వస్తి పలికారు .
2004 లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీలో బాబు ఛాంబర్ లో ఇలానే మాట్లాడేవారు . ఓ రోజు బాబు సభలో ఉండగా ఛాంబర్ లో ఉన్న టీడీపీ నేత అమర్ నాథ్ తో బాబు ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు మీడియాతో మాట్లాడితే ఏం బాగుంటుంది . ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మాట్లాడాలి అని ఉచిత సలహా ఇచ్చాను . సభ తరువాత కొద్ది సేపటికి బాబుతో ఛాంబర్ లో ఏదో రాజకీయ అంశాన్ని ప్రస్తావిస్తే చాలా సేపు మాట్లాడారు . తరువాత అమర్ నాథ్ నా దగ్గరకు వచ్చి ఎక్కువగా మాట్లాడవద్దు అని మీరే సలహా ఇస్తారు . మీ సలహా గురించి నేనేమో బాబుకు చెప్పాను .. మళ్ళీ మీరే మాట్లాడేట్టు చేస్తారు ఇదేంటి అని నిష్టురంగా అడిగారు . ఎక్కువగా మాట్లాడవద్దు అని మిత్రుడిగా సలహా ఇచ్చాను . రిపోర్టర్ గా వార్త కోసం మాట్లాడేట్టు చేశాను . ఆఫీస్ కు వెళ్లి సలహా ఇచ్చి వచ్చాను అంటే కుదరదు కదా ? వార్త రాయాలి కదా ? ఎక్కువగా మాట్లాడాలా ? వద్దా అని బాబు నిర్ణయించుకోవాలి అన్నాను . వద్దు అని సలహా ఇచ్చినా మీడియా కనిపిస్తే బాబు ఒకప్పుడు మాట్లాడకుండా ఉండలేక పోయేవారు ..
అలాంటి అలవాటుతోనే ఓ సారి కొంప మునిగింది . స్టార్ న్యూస్ రిపోర్టర్ పలకరించి గోద్రా గురించి అడగ్గానే మోడీని సీఎం పదవి నుంచి దించేయాలి అని డిమాండ్ చేశారు . ఐతే ఈ డిమాండ్ వెనుక బాబుకు ఓ సమాచారం ఉంది . పాలకుడు రాజధర్మం పాటించాలి , అందరినీ సమానంగా చూడాలి అని ప్రధానిగా ఉన్న వాజపేయి గుజరాత్ పరిణామాలపై స్పందించారు . మతం , కులం , ప్రాంతం అనే ఏ వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడడమే రాజధర్మం అని వాజపేయి చెప్పారు . దీనితో మోడీకి ఉద్వాసన ఖాయం అనుకున్నారు . ఓ దశలో అది ఖరారు అయింది కూడా .
మోడీని ఉంచాలా ? తొలగించాలా ? అనేది పార్టీ అంతర్గత వ్యవహారం . దీనిలో ఇతర పార్టీల జోక్యం ఏమిటీ అనే వాదన మొదలైంది . అద్వానీ మోడీకి అండగా నిలిచారు . వాజపేయి రాజధర్మం బోధించడం అప్పుడు పత్రికల్లో చదవడమే తప్ప చూడలేదు . యూట్యూబ్ పుణ్యమా అని అది ఇప్పుడు చూశాను . వాజపేయి రాజధర్మం గురించి చెబుతుంటే పక్కనే ఉన్న మోడీ నవ్వుతూ మధ్యలోనే జోక్యం చేసుకుంటూ రాజధర్మం పాటిస్తున్నాను అన్నారు . నన్నెవరూ తొలగించలేరు అనే ఆత్మ విశ్వాసం ఆ నవ్వులో కనిపిస్తుంది .
ఎలాగూ మోడీని తొలగిస్తున్నారు , అదేదో మన ఖాతాలో వేసుకుందాం అనుకున్న బాబు ఇరకాటంలో పడిపోయారు . హైదరాబాద్ లో మోడీని అడుగు పెట్టనివ్వం , అరెస్ట్ చేస్తాం అని ప్రకటించారు . మోడీనే కొనసాగుతారు అని తేలాక ఈనాడులో పెద్ద వార్త రాయించారు . ప్రస్తుతానికి మోడీని కొనసాగించినా , అంతా సద్దుమణిగాక మోడీని తొలగిస్తామని బీజేపీ అధిష్టానం బాబుకు హామీ ఇచ్చింది అని ఈనాడులో పెద్ద వార్త . ఆ తరువాత బాబు కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉన్నారు .
ఎన్టీఆర్ భవన్ లో కొద్ది రోజులు మీడియాను తన వద్దకు రానివ్వలేదు . తరువాత షరా మాములే . గుజరాత్ లో తాత్కాలిక సర్దుబాటుగా సీఎం అయిన మోడీ గోద్రా అల్లర్లతో సీఎంగా స్థిరపడడమే కాకుండా , ప్రధానమంత్రి పదవి వరకు వచ్చారు . రెండు దశాబ్దాలు గడిచినా గోద్రా అల్లర్లతో మోడీ రాజీనామా చేయాలనే బాబు డిమాండ్ ఇప్పటికీ బాబును వెంటాడుతూనే ఉంది . 2014లో అదే మోడీని బాబు మహాత్మాగాంధీ తో పోల్చి అభిమానం సంపాదించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు . మళ్ళీ విడిపోయి ఇప్పుడు మళ్ళీ మోడీని ప్రసన్నం చేసుకోవడానికి గత నాలుగేళ్ళ నుంచి బాబు చేయని ప్రయత్నం లేదు . చివరకు తెలంగాణ నుంచి నరుక్కు రావడానికి ప్రయత్నిస్తున్నారు .
1998 లో సొంతంగా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి . వాజపేయి ఇమేజ్ గ్రహించిన బాబు 99 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు . బీజేపీకి అప్పుడు రాష్ట్రంలో పార్టీ ఎటుపోతేనేం కేంద్రంలో అధికారం కావాలి . అప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు . దాదాపు 18 జిల్లాల బీజేపీ కమిటీలు టీడీపీతో పొత్తు వద్దు అని తీర్మానాలు చేశాయి . కొందరు తరువాత రాజీనామా చేశారు . నేను ఆంధ్రభూమిలో టీడీపీ వార్తలు రాస్తే అప్పుడు బీజేపీ వార్తలు ఈశ్వర్ రెడ్డి అనే జర్నలిస్ట్ రాసేవాడు .
పొత్తు ఉంటుంది అని నేను రాస్తుంటే అతను పొత్తు ఉండదు , నేను కిషన్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడాను అని చెబుతుంటే … కిషన్ రెడ్డి ఎవరు ? పొత్తు గురించి ఆయనకేం సంబంధం అని తేలిగ్గా తీసుకున్నాను . అదేంటి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఆయనకేం సంబంధం అంటావేమిటి అని అంటే , కావచ్చు పొత్తు ఉండాలా ? వద్దా ? అనేది బాబు నిర్ణయిస్తారు , ఉండదు అని చెప్పడానికి రాష్ట్ర బీజేపీ ఎవరు అని ధీమాగా చెప్పాను . అప్పుడు బాబు పలుకుబడి అలాంటిది . నేను చెప్పినట్టే అప్పుడు బీజేపీతో పొత్తు ఉంది . 18 జిల్లాల తీర్మానాలు , రాష్ట్ర అధ్యక్షుని మాటలు పట్టించుకోలేదు . సీట్లే కాకుండా బాబు బీజేపీకి అప్పుడు కొందరు అభ్యర్థులను కూడా ఇవ్వాల్సి వచ్చింది . మీ వాళ్ళు అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదు బలమైన అభ్యర్థులను నేనే ఇస్తాను అంటే సరే మహా ప్రభో అని తీసుకున్నారు .
బీజేపీతో తెలంగాణలో పొత్తు ఉండదు అంటే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన చూశాక అవన్నీ గుర్తుకు వచ్చాయి . బండి మాటకు పార్టీలో ఎంత విలువ ఉంటుందో తెరాస శాసన సభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లు స్పష్టంగా చెప్పారు . బండితో పాటు లోకల్ లీడర్లది ఏమీ ఉండదు అధిష్టానం చూసుకుంటుంది అని … అంటే ఇప్పుడు కూడా బాబు పొత్తును ఖరారు చేస్తారా ?
బాబుకు ఇప్పుడు అంత సీన్ లేదు … మోడీ ఆత్మ అమిత్ షా ఖరారు చేస్తారు . ప్రధాన మంత్రులను నిర్ణయించాను .. వరుసగా ఇంటర్వ్యూలు చేసి ప్రధానిని ఖరారు చేసి చక్రం తిప్పాను అని చెప్పుకొన్న బాబుకు నాలుగేళ్లయినా మోడీ అపాయింట్ మెంట్ దక్కక పోవడం , అమిత్ షా , నడ్డాల దర్శనమే మహద్భాగ్యం అనుకుంటున్నారు అంటే ‘మారిన పరిస్థితి’ తెలియడం లేదా ? గాలికి పోతున్న పేలపిండిని కృష్ణార్పణం అన్నట్టు అసలు ఉనికి లేని తెలంగాణలో టీడీపీని బీజేపీ కోసం త్యాగం చేసి ,ఆంధ్రాలో బీజేపీ మనసు దోచేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు . ఏమవుతుందో చూడాలి, బాబు లోకల్ వ్యాపారి అయితే మోడీ గుజరాతీ వ్యాపారి . ఏక్ సే బడ్ కర్ ఏక్ .. సబ్ సే బడ్ కర్ గుజరాతి ….
Share this Article