మొదటి ట్రెయిలర్‌తోనే అందరినీ ఆకర్షించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన హనుమాన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి కలకలం సృష్టించాడు… ఈ ఫీట్ ఇప్పటికి రాజమౌళి వల్ల కూడా కాలేదు… నిజానికి వందల కోట్ల ఆదిపురుష్ గ్రాఫిక్స్ అడ్డంగా ఫెయిలైన నేపథ్యంలో తక్కువ ఖర్చులో నాణ్యమైన గ్రాఫిక్ పనిని రాబట్టి ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో మోగుతోంది… తీరా చూస్తే రెండుమూడు సినిమాలకు మించి లేవు తన కెరీర్‌లో…
ఒకేసారి ఈ రేంజ్‌కు తీసుకుపోతున్నాడు సినిమాను… వెనక ఎవరున్నారు..? ఇదొక ప్రశ్న… తెలుగు, మలయాళం, హిందీ, కన్నడం, తమిళం సినిమాల్లో రిలీజు చేయడమే పాన్ ఇండియా… తను మరాఠీ కలిపాడు… అంతేకాదు, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్, ఇంగ్లిష్ అదనం… మేం ప్రపంచ స్థాయి సినిమా రిలీజ్ చేయబోతున్నామహో అని చెప్పడానికి… కొత్తగా ట్యూన్ చేసిన హనుమాన్ చాలీసా నేపథ్యంతో ప్రపంచమంతా వ్యాపిస్తున్నట్టుగా ఓ వీడియో రిలీజ్ చేశారు… (వర్మ తీసిన రక్తచరిత రక్తచరిత ట్యూన్ తలపించేలా ఉన్న ఈ కొత్త హనుమాన్ చాలీసా ఫుల్ హిట్టయ్యే అవకాశాలున్నాయి…) వీళ్ల క్రియేటివిటీ చూస్తే ముచ్చటేస్తోంది… సీన్ కట్ చేస్తే…
ఓ అనామక హీరో, ఓ అనామక హీరోయిన్… పెద్దగా సీనియారిటీ లేని దర్శకుడు… ఐనా కలకలం… ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా ఎలా సాధ్యం..? దర్శకుడు రష్యన్ భాష గురించి చెప్పడం మరిచాడు… మొత్తం 12 భాషలు లెక్కేసుకోవాలి… ప్రపంచవ్యాప్త ఎగ్జిబిటర్లు ఆల్‌రెడీ ఈ నిర్మాతలను సంప్రదిస్తున్నారనేది అతిశయోక్తి… కాకపోతే మనవాళ్లు కొరియా, రష్యా, జపాన్ దాకా విస్తరిస్తున్నారంటే ఏదో మతలబు ఉంది…
Ads
ఎందుకంటే..? మన సినిమాలను కొరియాలో, జపాన్‌లో ఎవరు చూస్తారు..? హాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో పోలిస్తే మనం చాలా సబ్‌స్టాండర్డ్… మలేషియాలో రజినీకాంత్ సినిమా విడుదలైందంటే దానికి కారణం ఉంది… అక్కడ స్థిరపడిన తమిళ జనాభా ఎక్కువ… అరబిక్‌లోకి ఓ మలయాళ సినిమాను రిలీజ్ చేశారంటే ఓ అర్థముంది… గల్ఫ్ దేశాల్లో మలయాళ జనాభా ఎక్కువ కాబట్టి… బ్రిటన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో తెలుగు సినిమా రిలీజైతే వోకే… తెలుగువాళ్ల జనాభా ఎక్కువే కాబట్టి… ఫ్యాన్స్ తన్నుకునే స్థాయికి ఎదిగిపోయాం కాబట్టి…
కానీ ఈ జపాన్, కొరియాల మాటేమిటి..? స్పానిష్ లోకి అనువదిస్తే ఏకంగా Argentina, Bolivia, Chile, Colombia, Costa Rica, Cuba, Dominican Republic, Ecuador, El Salvador, Guatemala, Honduras, Mexico, Nicaragua, Panama, Paraguay, Peru, Uruguay, and Venezuela దేశాలకు మన సినిమా విస్తరిస్తుంది… ఇవి గాకుండా ఆస్ట్రేలియా, శ్రీలంక, జర్మనీ, మలేసియా కూడానట… (ఇండోనేసియా వంటి రామాయణం తమ సంస్కృతిలో భాగంగా ఉన్న తూర్పు దేశాల పేర్లు మరిచిపోయాడు దర్శకుడు…) సరే, గుడ్… కానీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త ఫైనాన్షియల్ నెట్‌వర్క్ ఏదైనా మనవాళ్లకు కొత్తగా అండగా నిలబడుతోందా..? ఎవరు సూత్రధారులు..?
ఈడీ అనవసరంగా లైగర్ సినిమాకు సంబంధించి చార్మి జగన్నాథ్, విజయ్ దేవరకొండలను ప్రశ్నిస్తూ తవ్వకాలు సాగించింది… కానీ ఏమీ సాధించలేదు… తెలంగాణ రాజకీయ నాయకుడొకరు ఇందులో పెట్టుబడి పెట్టాడనీ, ఫెమా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వ్యవహారాలు సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు ఆల్‌రెడీ విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులకు దిగింది… ఈడీ బాలీవుడ్ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహార్ మీదుగా ఈమధ్య విదేశాల్లో సినిమాలు రిలీజ్ చేసిన పెద్ద తలకాయలపై నిఘా పెడితే… ఏమేం బయటపడతాయో…!!
Share this Article