.
ఏకాదశి అంటే ఒకేరోజు, ఒకే తిథి కదా… మరి పదిరోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనాలు ఏమిటి..? అంటున్నాడు గరికపాటి ఓ వీడియో బిట్‌లో… అవును కదా, నిజమే కదా… ధర్మసందేహమే… పదిరోజులపాటు ఏకాదశి ఏమిటి..?
కాస్త వివరాల్లోకి వెళ్దాం… ఎందుకంటే, ఈరోజే వైకుంఠ ఏకాదశి, అంటే ముక్కోటి ఏకాదశి… ఈరోజు వైష్ణవులకు పవిత్రదినం… దగ్గరలోని వైష్ణవాలయానికో, ప్రఖ్యాత వైష్ణవాలయాలున్న చోటకో వెళ్తారు… ఉత్తర ద్వారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఎలాగూ విష్ణువు అలంకార ప్రియుడు కదా, అన్ని వైష్ణవాలయాలనూ ఆ గుడి స్థోమతను బట్టి అలంకరిస్తారు, ప్రత్యేకించి పూలతో… సువాసనలు ఘుమాయిస్తాయి ప్రతి గుడిలో… అంతేకాదు, ప్రత్యేక ప్రసాదాలతో వైష్ణవ క్షేత్రాలు ఘుమఘుమలాడుతుంటాయి..!
Ads
ముక్కోటి ఏకాదశి అంటేనే పవిత్రమైన దినం… వైష్ణవాలయానికే కాదు, ఏ గుడికి వెళ్లినా పుణ్యమే అంటాడు గరికపాటి… అదీ నిజమే… శైవాలయం అయినా, శక్తి ఆలయమైనా ఏదైనా ఒకటే… కాకపోతే ఏనాటి నుంచో వస్తున్న సంప్రదాయం మాత్రం వైష్ణవాలయంలో ఉత్తర ద్వార దర్శనమే…
సరే, ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటో ఒక్కో పండితుడు ఒక్కో రీతిలో చెబుతాడు… అదంతా ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ మీమాంస ఎందుకొస్తున్నదీ అంటే… తిరుమలలో 3 రోజుల రద్దీ చెప్పనలవి కాదు… చివరకు ఆఫ్ లైన్ టోకెన్ల క్యూ లైన్లను కూడా మూసేయాల్సి వచ్చింది… తొక్కిసలాటల ప్రమాదాన్ని నివారించడం కోసం…
మరి పదిరోజులపాటు ఈ ఉత్తర ద్వార దర్శనాలు ఏమిటి అంటారా..? దానికీ గరికపాటే చెబుతున్నాడు… రద్దీ, కోటి మంది దర్శనాల్ని కోరుకుంటే మరేం చేస్తారు..? అందుకే ఒక ఏకాదశినే పదిరోజులపాటు పొడిగిస్తున్నారు అని..! ఏకాదశి సరే, మరుసటి రోజు ద్వాదశి కూడా సరే, దాన్ని కైశిక ద్వాదశి అంటారు… మరి ఆ తరువాత పొడిగింపులు ఏమిటి..? భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించడం కోసం..!!
నిజానికి అసలు ఈ 10 రోజుల ఉత్సవ సంప్రదాయం (పగల్ పత్తు, రా పత్తు) తమిళనాడులోని శ్రీరంగం వంటి దివ్య ప్రదేశాల నుండే ప్రారంభమైంది… అక్కడ ఈ ఉత్సవాలు దాదాపు 21 రోజుల పాటు జరుగుతాయి… 2020 కు ముందు తిరుమలలో ఈ పది రోజుల వైకుంఠ ద్వారాలు ఉండేవి కావట… భక్తుల రద్దీ దృష్ట్యా, ఆగమ పండితులు సడలింపులు ఇవ్వడంతో ఇలా పదిరోజుల వైకుంఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు…

తిరుమలను చూసి… తమిళ, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రముఖ వైష్ణవాలయాల్లోనూ పదిరోజుల పండుగలు నిర్వహిస్తున్నారు… కానీ మామూలు, ఓ మోస్తరు వైష్ణవాలయాల్లో మాత్రం ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారా దర్శనం, మరుసటి రోజు మూసేయడమే… (వైకుంఠద్వార దర్శనం అనేది శ్రీరంగంకు మాత్రమే పరిమితమైన ఆధ్యాత్మిక విశేషం, కానీ తరువాత ఇతర ఆలయాలూ పాటిస్తున్నాయి అని చాగంటి ఎక్కడో చెప్పినట్టు గుర్తు)…
మహాశివరాత్రికి శివాలయాల్లో దర్శనాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఎలా ప్రముఖమో… వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో దర్శనాలూ అంతే ముఖ్యం… ప్రత్యేకించి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఎనలేని గిరాకీ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రే తిరుమలకు వెళ్లాడు… చాలామంది వీవీఐపీలు చేరుకున్నారు… ప్రొటోకాల్ భక్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ధనిక భక్తులు ఎట్సెట్రా… కొండపై అలంకరణలు, విద్యుత్తు దీపాలతో తిరుమల జిగేలుమంటోంది…
వాస్తవానికి ముక్కోటి ఏకాదశి అంటే… కేవలం దర్శనం మాత్రమే కాదు… పరమ వైష్ణవ భక్తులైతే ఉపవాసం చేస్తారు… జాగరణ చేస్తారు… సరే, మళ్లీ ఇక్కడ మరో ధర్మసందేహం… కొన్నిచోట్ల అయ్యప్ప గుళ్లలోనూ వైకుంఠ ద్వార దర్శనం నిర్వహిస్తున్నారని ఓ మిత్రుడన్నాడు… అదెలా..? అయ్యప్పలో విష్ణువు బాపతు మోహిని అంశ ఉన్నా సరే… శైవ, వైష్ణవాల కలయికే అయినా… ప్రధానంగా ఆ గుడి శైవమా..? వైష్ణవమా..? అయ్యా, గరికపాటి వారూ… క్లారిటీ ప్లీజ్..!!
(తిరుమలలో అలంకరణ)
Share this Article