అయ్యో, అయ్యో… ఇంత అన్యాయమా బాబు గారూ… ఎన్నికల్లో వాడుకుని, ఉపముఖ్యమంత్రిని చేసి, తీరా అప్పుడే పక్కన పెట్టేస్తారా ఆయన్ని..? ఇదెక్కడి దారుణం..? ఏమిటీ దుర్మార్గం అన్నట్టుగా కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి…
విషయం ఏమిట్రా అని చదివితే… చంద్రబాబు ఒక్కడే ఢిల్లీకి పోయి ప్రధానినే కాదు, చాలామంది మంత్రులను కూడా కలిసి వచ్చాడు… పవన్ కల్యాణ్‌ను తీసుకుని పోలేదు… పింఛన్ల యాడ్ ఇచ్చాడు… అందులో బాబు తప్ప పవన్ కల్యాణ్ లేడు… చివరకు రాష్ట్ర విభజన సమస్యల మీద రేవంత్‌రెడ్డితో భేటీ ఏర్పాటు చేస్తే, తనతోపాటు పవన్ కల్యాణ్ పోవడం లేదు… వాటీజ్ దిస్..?
పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఆలోచించాలి… వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట అన్నట్టుగా ఈ వార్తలు నడుస్తున్నాయి… దానికి ఆ వార్తల రచయితలకు ఓ సాకు కూడా దొరికింది… ఇదే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తీసుకుపోతున్నాడు, మంచి ప్రాధాన్యం ఇస్తున్నాడు… మరి చంద్రబాబు తన ఉపముఖ్యమంత్రికి ఎందుకు ఈ ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనేది ఈ జనరలిస్టుల ఆక్రోశం…
Ads
హహ… చంద్రబాబుకూ, పవన్ కల్యాణ్‌కూ నడుమ పుల్లలు పెట్టే యవ్వారాలు ఇవన్నీ…! రేవంత్ రెడ్డి కథ వేరు… తను కాంగ్రెస్‌లో జూనియర్… సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ కలుపుకుని వెళ్లాల్సిన అనివార్యత తనది… అసలే కాంగ్రెస్, అందులోనూ సీనియర్లు కదా… రేవంత్ రెడ్డికి ఎలాగూ తప్పదు… పైగా భట్టి ఒక దశలో తను కూడా ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారు…
కానీ తెలుగుదేశం పక్కా ప్రాంతీయ పార్టీ… చంద్రబాబు సొంత పార్టీ… తనకు ఎదురుమాట్లాడే గొంతు అస్సలు వినిపించదు, వినిపిస్తే తను ఊరుకోడు… సరే, ఓ కూటమిగా పోటీచేశారు, పవన్ కల్యాణ్ సాయపడ్డాడు, ఉపముఖ్యమంత్రి కూడా, మరి వెంట తీసుకువెళ్లకపోతే ఎలా అనేది ఓ ప్రశ్న… రియాలిటీ ఏమిటంటే..?
కేంద్రంలో ఉపప్రధాని పోస్టు గానీ, రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రి పోస్టు గానీ జస్ట్, మేం మీకు ప్రాధాన్యం ఇస్తున్నాం సుమా అని చెప్పుకోవడానికే తప్ప… ఆ పోస్టులకు అదనపు ప్రోటోకాల్ గానీ, అదనపు అధికారాలు గానీ ఏమీ ఉండవు… జగన్ అయితే ఏకంగా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను పెట్టుకున్నాడు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రే తీసుకుంటే నీలం సంజీవరెడ్డి హయాం నుంచీ ఈ ఆనవాయితీ ఉంది…
జస్ట్, ఇదొక ఆనవాయితీ మాత్రమే… తప్పనిసరి కాదు… సరే, పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర విభజన అంశాల మీద భేటీకి తీసుకెళ్లాలి కదా అంటారా..? నిజమే, తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులపాటు నిద్ర, ఆహారం లేకుండా బాధపడిన ఈ తెలంగాణ ప్రేమికుడిని తీసుకెళ్తే బాగానే ఉండేది కానీ… చంద్రబాబు రాజకీయాల ధోరణి అర్థమయ్యేవాళ్లకు, చాన్నాళ్లుగా తనను గమనిస్తున్నవాళ్లకు… పవన్ కల్యాణ్‌ను వెంట తిప్పుకోకుండా ఎందుకు తను ఒంటరిగానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటాడో తెలుస్తుంది…
అప్పుడే ఏమైంది..? పిఠాపురం అధికారులతో నాగబాబు సమీక్షలు, ఇంకెక్కడో కందుల దుర్గేష్ అధికారిక సమీక్షలో జనసేన కార్యకర్తలు పాల్గొనడం వంటి వార్తలు ఇంకా చదవాలి… చంద్రబాబుకు చాలా తలనొప్పులు ఇంకా బాకీ ఉన్నాయి..!!
Share this Article