Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్కిల్ స్కాం ఓ తీగ మాత్రమే… చంద్రబాబు అరెస్టు వెనుక కనిపించని ఎన్నో కోణాలు..!!

September 9, 2023 by M S R

చంద్రబాబు అరెస్టు..! ఇది నిజమేనా..? అసలు ఇది సాధ్యమేనా..? అని చాలామంది ఇప్పటికీ హాశ్చర్యంలోనే ఉన్నారు… స్టేలు తెచ్చుకోవడంలో ప్రసిద్ధుడు, ఏ విచారణనూ తన దగ్గరకు రానివ్వని సమర్థుడు, ఏం చేసినా వ్యవహారాల్ని చట్టపరంగా దొరక్కుండా చేయడంలో నిపుణుడు అంటూ ఇన్నాళ్లూ సాగిన ప్రచారం ఉత్తదేనా..? అంతటి చంద్రబాబు కూడా అరెస్టులకు, కేసులకు అతీతుడు ఏమీ కాదా..?

అమరావతి వంటి పెద్ద పెద్ద కేసుల్లో చంద్రబాబును ఫిక్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నారందరూ… కానీ చాలామందికి పెద్దగా అవగాహన లేని ఓ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టు చేయడం విశేషమే… పైగా తనను అరెస్టు చేస్తారని రెండుమూడు రోజులుగా చంద్రబాబే చెబుతున్నాడు… అంటే పోలీస్ విభాగంలో ఏం జరుగుతున్నదో తనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉందన్నమాట…

ఒక్కసారి గుర్తుచేసుకొండి… 16 నెలలపాటు చంచల్‌గూడ జైలులోని ఓ గదిలో… తనలోతాను జగన్ రగిలిపోతూ మనసులో ఎన్ని సంకల్పాలు తీసుకుని ఉంటాడు… తనను జైలుపాలు చేసిన సోనియా మీద, ఆ కేసులో ఇంప్లీడైన టీడీపీ మీద, సదరు టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఎంతగా కోపాన్ని, కక్షను పెంచుకుని ఉంటాడు… కాలం అందరికీ ఒకేరకంగా అనుకూలంగా కొనసాగదు కదా… సీన్ కట్ చేస్తే… జగన్ సీఎం… తనకూ టైమొచ్చింది… కొరడా తీశాడు… ఫలితం ఏమిటంటే… ఇప్పుడు చూస్తున్న సీన్లు…

Ads

నేను ముందునుంచీ చెబుతున్నదే… జగన్ జగనే… వైఎస్ఆర్ కాదు… పరిస్థితులు ఎలా ఎదురుతిరిగినా సరే, పరిణామాలు ఎంత ప్రతికూలంగా మారినా సరే జగన్ వెనక్కిపోడు… తను అనుకున్నబాటలోనే వెళ్తాడు… ఎవరు ఏం చెప్పినా వినడు… జగన్‌ను సరిగ్గా అంచనా వేయడంలో చంద్రబాబు, రామోజీ వంటి బ్యాచ్ ఫెయిలైంది… దుర్మార్గం, అప్రజాస్వామికం, కక్షసాధింపు వంటి మాటల్ని ఎందరు గొంతుచించుకున్నా సరే జగన్ పల్లెత్తు స్పందించడు… దటీజ్ జగన్…

babu arrest

మార్గదర్శిపై కేసులు బిగిస్తున్నప్పుడు, పోలవరం నుంచి రామోజీ వియ్యంకుడిని పీకేసినప్పుడు చంద్రబాబుకు కూడా అర్థమయ్యే ఉంటుంది… జగన్ సాధింపుల తుపాకీ చంద్రబాబునే టార్గెట్ చేసి టైమ్ కోసం ఎదురుచూస్తోందని…! ఈ కేసులో కూడా బలమైన ఆధారాల్ని సంపాదించి, ఆల్‌రెడీ కొందర్ని అరెస్టు చేశారు… అప్పుడే ఏపీసీఐడీ సంకెళ్లు తన కోసం బయల్దేరుతున్నాయని చంద్రబాబుకూ అర్థమయ్యే ఉంటుంది… ఇదేమీ అనూహ్య, హఠాన్పరిణామం ఏమీ కాదు…

skill scam

అప్పట్లో జయలలిత పోలీసులు కరుణానిధిని అర్ధరాత్రి లిఫ్ట్ చేసిన సీన్, ఆ కేసులు, ఆయన పెట్టిన కేకలు గట్రా గుర్తొస్తున్నాయి… సౌతిండియాలో ఇలాంటివి కొత్తేమీ కాదు… కాకపోతే తెలుగు రాజకీయాల్లో మాత్రం తొలిసారి… ఈ కేసులు నిలుస్తాయా..? జైలుశిక్షలు పడతాయా..? అనేది వేరే సంగతి… అసలు చంద్రబాబును జగన్ అరెస్టు చేయడమే ఓ పెద్ద విశేషం… ఈ కేసులో ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే..? ప్రొసీజర్ ప్రకారం చంద్రబాబు ఎక్కడా ఎందులోనూ దొరక్కుండా జాగ్రత్తపడతాడు… కానీ ఈ స్కీం స్కాంలో అలా అనాలోచితంగా దొరికిపోయాడు..!

అసలు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఏమిటో చాలామంది రాస్తూనే ఉన్నారు… దాని గురించి మళ్లీ ఇక్కడ ఏకరువు పెట్టడం అనవసరం… ఇంకాస్త లోతుకు వెళ్దాం… చంద్రబాబు ఖాతాలో పడాల్సిన పెద్ద కేసులతో పోలిస్తే ఇది చిన్నదే కావచ్చు కూడా… రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయనే ప్రచారం ఉంది కదా… ఈ పవన్ కల్యాణ్‌లు, రాధాకృష్ణలు కాకుండా… రామోజీ, చంద్రబాబు వంటి పెద్ద చేపలనే టార్గెట్ చేశాడు జగన్… తనకు వ్యతిరేకంగా తయారవుతున్న ‘కూటమి వేళ్లను’ ముందుగానే పీకేసే ప్రయత్నమా ఇది…

బాబు

జగన్ బీజేపీ పెద్దలకు చెప్పకుండా ఈ అరెస్టు చేసి ఉండడు… మోడీకి, అమిత్ షాకు కూడా ముందే తెలిసి ఉంటది… చంద్రబాబు మీద వాళ్లకు ఏమాత్రం సదభిప్రాయం లేదు… అందుకే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సరే మోడీ, షా ఏమాత్రం స్పందించడం లేదు… మోడీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేసిన నమ్మకద్రోహం గట్రా వాళ్లు ఎందుకు మరిచిపోతారు… అందుకే జగన్‌ను వారించి ఉండరు… జరిగేది చూస్తూ ఉందామని అనుకుని జగన్‌కే వదిలేసి ఉంటారు… అందుకేనేమో ‘యాంటీ జగన్ కూటమి’పై పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సరే… జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీద మోడీ గానీ, బీజేపీ పెద్దలు గానీ కిమ్మనడం లేదు… (ఆల్ రెడీ ఈ స్కాం ఈడీ పరిధిలో ఉంది)…

fir

అసలు బీజేపీ కూడా జగన్ ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తుందేమో… ఎన్నడూ లేనిది చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్టున్న మరో కేసులో ఐటీ చురుకుగా దర్యాప్తు చేస్తోంది… దీన్ని బేస్ చేసుకుని ఇక ఈడీ రంగంలోకి దిగొచ్చు కూడా… అంటే ఇవి రాబోయే రాజకీయ సమీకరణాలకు ముందస్తు సంకేతాలు అనుకోవాలి… స్థూలంగా బర్డ్ వ్యూలో ఒక అంచనాకు రావచ్చు… కేసీయార్, జగన్… ప్రస్తుతానికి మోడీకి ఇద్దరూ కావాలి… ఆ స్థూల చిత్రంలో చంద్రబాబు అరెస్టు విచిత్రంగా ఏమీ అనిపించదు… అదేసమయంలో కవిత అరెస్టు జరగదు, జగన్ మీద కేసుల్లో పురోగతి ఉండదు…

కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది కదా… సో, చంద్రబాబు అరెస్టుకు జస్ట్, ఆ స్కాం దర్యాప్తు మాత్రమే ప్రధాన కారణం కాదు… దాని చుట్టూ ఇన్నిరకాల కోణాలుంటాయి… జైలు గదిలో జగన్‌లో చంద్రబాబు మీద, సోనియా మీద పెరిగిన కోపం దగ్గర నుంచి మోడీ మీద చంద్రబాబు ప్రదర్శించిన రాజకీయ వైఖరి దాకా చాలా కారణాలుంటయ్… దేన్నీ వదిలేయలేం… ఈ పెద్ద రాజకీయ చిత్రంలో స్కిల్ స్కాం అనేది జస్ట్, ఓ తీగ మాత్రమే…!!

చివరగా… వై నాట్ 175 అంటున్నాడు కదా… ఒక్కసారి చంద్రబాబును లోపలేస్తే, తన ఆర్థికమూలాల్ని పెరికేస్తే, ఆయన మీడియాను కంట్రోల్ చేస్తే ఆ దిశలో సరైన అడుగులు పడినట్టు జగన్ భావిస్తున్నాడా..? బాబుకు ప్రజల్లో ఏదో సానుభూతి వచ్చి, తనకు రాజకీయంగా మైనస్ అవుతుందనే వాదనను తను ఏమాత్రం విశ్వసించడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions