Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!

February 6, 2023 by M S R

విశ్వనాథ్ మరణించి, ఆ కట్టె కాలకముందే ఏవేవో విమర్శలు తనమీద… తను పక్కా థ్రెడ్ లేదా కేబుల్ లేదా వైర్ ఓరియెంటెడ్ సినిమాలే తీశాడనీ, కులతపస్వి అనీ, తన సినిమాలన్నీ బ్రాహ్మణీయాలేననీ వాటి సారాంశం… అగ్రవర్ణ పక్షపాతమనీ వాటి ఆరోపణ… ఆ చర్చ, ఆ రచ్చ సాగుతూనే ఉంది… కొన్నాళ్లు సాగుతుంది కూడా… తన సినిమాల్లోని కొన్ని అభ్యుదయాలు, ఆదర్శాలు గాలికి వదిలేసి, తన కులాన్ని పట్టుకుని, ఒక బయాస్డ్, ప్రిజుడీస్ అభిప్రాయంతో పోస్టులు పెట్టినవాళ్లు కూడా బోలెడుమంది…

నిజంగా తన సినిమాలు అంత బేకార్ సినిమాలా..? వాటికి ఏ విలువా లేదా..? అవి పక్షపాతం, పక్షవాతం సినిమాలేనా..? ఈ చర్చల నేపథ్యంలో Sunil Pilli  అప్పట్లో… అంటే 1980లో రంగనాయకమ్మ ఆంధ్రజ్యోతిలో శంకరాభరణం సినిమా మీద రాసిన ఓ సమీక్షను ఫేస్‌బుక్‌లో తన వాల్ మీద పోస్ట్ చేశారు… ఆమె సమీక్ష బాగున్నట్టనిపించింది… ఇప్పటి సినిమాల మీద ఆమెకు సదభిప్రాయమేమీ లేదు… కానీ శంకరాభరణం సినిమాను న్యూట్రల్ వీక్షకురాలిగా చూసి సమీక్షించిన విధానం బాగుంది… తప్పున్నచోట తప్పించుకోకుండా ఇదీ తప్పు అని చెప్పింది… అభినందించే అంశాల్ని అభినందించింది… బ్రాహ్మణీయ సినిమాల మీద రచ్చ నేపథ్యంలో… ఆ సమీక్ష యథాతథంగా…



సహజ సుందరమైన చిత్రం “శంకరాభరణం”

– రంగనాయకమ్మ
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
పేకాడడం, సారా తాగడం, గుర్రప్పందాలకు పోవడం లాంటివి ఎంత చెడ్డ పనులో సినిమాలు చూడ్డం కూడా అంత చెడ్డ పనే అని నా కెంతో దృఢమైన అభిప్రాయం ఏర్పడింది, చాలాకాలం కిందటే.
‘సినిమాలు చూడడం ఒక దుర్వ్యసనం’ అని నిస్సందేహంగా అనుకోవలసిన స్థాయిలో ఈ నాటి సినిమాలు వుంటున్నాయి. పిల్లలు సినిమాలు చూడ్డం మొదలు పెట్టారంటే, ఇక వాళ్ళు ధ్వంసమై పోయారని గట్టిగా అంచనా కట్టుకోవచ్చు. తల్లి దండ్రులే, సినిమాలు చూస్తే (ఏ భాష సినిమాలైనా) వాళ్ళ సాంస్కృతిక స్థాయిని చాలా శంకించి తీరాలి.
‘సినిమా’ మీద ఇలాంటి అభిప్రాయాలు ఎవరైనా ఏర్పర్చుకుంటే అది వాళ్ళ తప్పు కాదు సరికదా, అది వాళ్ళ ఆలోచనా శక్తీ, వాళ్ళ సామాజిక వివేకం, చాలా కరెక్టుగా వున్నాయని అర్థం. వాళ్ళు, సినిమాల్లో వుండే – ఘోరాలు చూసే అలాంటి అభిప్రాయానికి వొచ్చారను కోవాలి.
‘తెలుగు సినిమా’ అన్నది నవ్వులాటకి పర్యాయ పదం అయిపోయింది. ఘోరమైన తప్పుల తడకల కధలతో, కుత్రిమమైన పాత్ర చిత్రణతో, కుత్రిమమైన సంభాషణలతో, బూతుకూతలతో, వెకిలి హాస్యంతో, చూసే వాళ్ళకి ఆ మూడు గంటలూ ఒక తప్పుడు పని చేస్తున్నా మనిపించేటట్టూ, ‘ఈ సినిమా కొచ్చానే’ అని సిగ్గుతో చచ్చిపోయేటట్టూ, సినిమాని భరించలేక తన మీద తను చాలా కోపం తెచ్చుకుని చీదర పడవలసి వచ్చేటట్టూ, వుంటున్నాయి సినిమాలన్నీ.
ఇలాంటి పరిస్తితుల్లో మంచి తెలుగు సినిమా వొచ్చిందంటే, నమ్మడం కష్టమే.
నమ్మకస్తుడైన మిత్రు డొకాయన ‘శంకరాభరణం’ గురించి చెప్తే, “పోవోయ్, సినిమాల సంగతెవడికి తెలీదూ?” అని నవ్వేసి ఎగర గొట్టేశాను.
అయినప్పటికీ ఆయన మాటల మీద కొంచెం నమ్మకం తోటీ, ఈనాటి సినిమా ఏడ్చినట్లు వుండి తీరక పోతుందా అని సినిమా మీద అప నమ్మకం తోటీ, ‘శంకరాభరణానికి’ వెళ్తే, ఆ సినిమా మీద నా ఊహలన్నీ తల్లకిందులై, చాలా సంతోషం కలిగింది.
హమ్మయ్య, ఇతర తెలుగు సినిమాల్లో వున్న చెత్త ఇందులో లేదు. ఇతర తెలుగు సినిమాల్లో లేని మంచి ఇందులో వుంది. ఈ సినిమాకి బ్రహ్మాండమైన బలం, అవక తవకలు లేని కథా, ఉన్నతమైన పాత్ర చిత్రణా, సహజమైన సంభాషణలూనూ. కుత్రిమత్వమూ, అసహ జత్వమూ అనేవి ఏ విషయంలోనూ మచ్చుకైనా లేవు. బూతు మాటలు లేవు. వెకిలి హాస్యం లేదు. పైగా చిత్రానికి ఒక లక్ష్యమూ, ఆదర్శమూ వున్నాయి.
ప్రజల కధలు చిత్రిస్తున్నాం. విప్లవ కధలు చిత్రి స్తున్నాం’ అని గర్వపడుతూ చెప్పుకునే దర్శకులు, కధలో ఎన్ని వైరుధ్యాలున్నాయో చూసుకోరు. పాత్రల్ని సామాన్యుల స్థాయి కన్నా దిగజార్చి నవ్వుల పాలు చేస్తారు. సంభాషణల సంగతి సరే, అవి వాస్తవ జీవితాల్లో నించి గాక తల తిరుగుడు తనం లోంచి వస్తాయి. సినిమా సక్సెస్ కోసం, శృంగారాన్ని ఒక ఆయు ధంగా వాడుకుంటారు.
ఈ చిత్రంలో శంకర శాస్త్రి పాత్రా, తులసి పాత్రా, సహజత్వానికి లోబడి వుంటూనే, ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవలసి వచ్చినప్పుడూ, మంచిని కాపాడ వలసి వచ్చినప్పుడూ, సామాన్య జనుల స్థాయిని మించిన సంస్కారం తోటీ, ఆదర్శం తోటీ, ప్రవర్తిస్తాయి.
అభ్యుదయ పంధాలో నడిచిన కధ ఇది. ఒక భోగం స్త్రీ కడుపున పుట్టిన బాలుడు, సంగీత కళారాధనలో శంకర శాస్త్రికి వారసుడు అవడం ఈ కధ స్థాయిలో గొప్ప అభ్యుదయం.
సాధారణంగా సినిమాల్లో చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్లా వుంచరు దర్శకులు. వాళ్ళతో అరవయ్యేళ్ళ ముసలి మాటలు మాట్లాడిస్తారు. ఈ చిత్రంలో చిన్నపిల్లలు వాళ్ళ స్థాయిని మించరు.
తులసి కొడుకు చిన్న తనంలోనే శంకర శాస్త్రి స్థాయితో పాడడంలో అతిశయోక్తి లేదు. బాల మురళి లాంటి వాళ్ళు చిన్న తనం లోనే అత్యంత ప్రతిభతో కచ్చేరీలు చేశారని విన్నాం. అది ఆ కళలో వ్యక్తి ప్రతిభా విశేషాలకు సంబంధించిన విషయంగా వుంటుంది.
ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశమూ, సహజ సౌందర్యంతో వెలిగి నప్పటికీ, శంకర శాస్త్రి మృదంగ విద్వాం సుడితో మాట్లాడి డబ్బు ఇచ్చే ఘట్టమూ, కొడుకు కీర్తన పాడుతూ వుంటే తల్లి నాట్యం చేసే ఘట్టమూ, శంకర శాస్త్రి కూతురు రాగాలాపనలో చేసిన తప్పుని దిద్దుకుంటూ సరైన రాగం పాడి తండ్రి చేత క్షమాపణ పొందే ఘట్టమూ, ఇంకా ఇటువంటి కొన్ని ఘట్టాల చిత్రీకరణ వెలితి తోచనంత సంపూర్ణమైన గాఢాను భూతిని కలిగించింది.
సాధారణంగా సినిమాల్లో కష్టాల పరంపర గుప్పించి కన్నీళ్ళు కార్పించాలని చూస్తారు. ఈ చిత్రంలో మనసు ఆర్ద్రమై కళ్ళు తడిసేది కష్టాల్ని చూడడం వల్ల కాదు. ఆ పాత్రల మధ్య సంబంధాల్లో వున్న ప్రేమా, భక్తీ, స్నేహమూ, ఆరాధనా, పరస్పర విశ్వాసమూ, వంటి గుణాలు, వారి ప్రవర్తనలో ఎంతో సహజమైన రీతిలో ప్రతిబింబించడం వల్ల..
దేశంలో కర్ణాటక సంగీతానికి విలువ తగ్గి, పాశ్చాత్య సంగీతంలో వెకిలి రీతులకు ఆదరణ పెరుగుతోందని చెప్పడం – శంకర శాస్త్రి రూపం ఫేడ వుట్ అయిపోవడం ద్వారా చెప్పారు. అలా గాక – ఒక సంస్థ వాళ్ళు ఏదో సభ జరుపుకోబోతూ ఎటు వంటి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలో చర్చించుకున్నట్టూ, కొందరు శంకర శాస్త్రి కచ్చేరీ కావాలనడం, మిగిలిన వాళ్ళు ‘ఆ చాదస్తపు సంగీతాన్ని ఈ రోజుల్లో ఎవరు వింటారు, వెస్ట్రన్ మ్యూజిక్ యువ తరాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి దాన్నే పెట్టాల’ని వాదిం చడం, చివరికి రెండో వాదమే నెగ్గినట్టూ, ఆ రకంగా కధలో ఒకటి రెండు సన్నివేశాలు జరిగి వుంటే, కర్ణాటక సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందనే సంగతి చెప్ప కుండానే చెప్పినట్లయ్యేది.
అంతే గాక, శంకర శాస్త్రిని కచ్చేరీకి పిలవడానికి వచ్చిన వాళ్ళు, ఆయన్ని శాస్త్రీయ సంగీతంతో పాటు కొన్ని సినిమా పాటలు లాంటివి కూడా పాడాలని అడగడం, దానితో శంకర శాస్త్రి కచ్చేరీలే తిరస్కరించడం జరిగితే, దాని వల్ల శంకర శాస్త్రి డబ్బు సంపాయించడమే ప్రధానంగా తీసుకోలేదనే విషయం ఇంకా బలంగానూ, స్పష్టం గానూ చెప్పినట్టయ్యేది.
శంకర శాస్త్రి పాత్రకీ, తులసి పాత్రకీ కొంత కళంకంగా వుండే విషయాలు ఒకటి రెండు జరిగాయి కధలో, ఒకసారి శంకర శాస్త్రి, కచ్చేరీలో పాడుతోండగా ఎవరో కుర్చీ లాగిన శబ్దానికి పాడడం ఆపేసి ఇంటికి వచ్చేస్తాడు. సేవకుడు వచ్చి బండి తలుపు తీసేప్పుడు లు కొంచెం ఆలస్యం అయినందుకు, సభ చెడిపోయిందనే కోపాన్ని ఆ సేవకుడి మీద నిష్కారణంగా ప్రదర్శిస్తూ, అతని మీద హూంకరిస్తాడు. అది అతన్ని పాత్రకు కళంకమే.
శంకర శాస్త్రి కళా విలువల్ని కాపాడడంలో పట్టుదల కలిగిన వాడే గానీ, సేవకులపై నిష్కారణంగా నిన్న ఎగిరే కోపిష్టి కాడు, కధ ప్రకారం. కోపమే అతని లక్షణ మైతే, అలాంటి కోపిష్టి గౌరవనీయుడిగా వుండడు. సేవకుడిపై నిష్కారణంగా హూంకరించే సన్నివేశం’ శంకర శాస్త్రి పాత్ర స్వభావానికి తగినది కాదు.
అలాగే, శంకర శాస్త్రి తన కడియం అమ్మబోయినప్పుడు షాపు మనిషి “దీనికి నేను వెల కట్టలేను. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంతో షంగా ఇస్తూ వుంటాను” అంటాడు. అతను అలా అనడానికి కారణం వుంది. అది శంకర శాస్త్రి మీద భక్తి. కానీ, శంకర శాస్త్రి కిక్కురు మనకుండా షాపు అతని దయని స్వీకరించి వూరుకుంటాడు. ఆ షాపు మనిషే అంతకు పూర్వం ఒక సారి శంకర శాస్త్రికి డబ్బు ఇవ్వటానికి చాలా విసుక్కుంటాడు.
అప్పుడు అలా విసుక్కున్న వాడు ఇప్పుడు ఇంత మార్పుతో ఎందుకు మాటాడుతున్నాడా అని శంకర శాస్త్రి పట్టించుకోడు. “నువ్వు ఉచితంగా డబ్బు ఇస్తే నేనెందుకు తీసు కుంటాను? నా ఇంటిని పూర్తిగా అమ్మేస్తున్నాను. దాని ప్రకారం నా కింకా ఎంత డబ్బు రావాలో అంత డబ్బు మాత్రమే ఇయ్యి” అని గానీ, ఇంకో మాట గానీ, ఏదోరో అని తీరాలి శాస్త్రి. కొట్టు అతని దయకి తల వొంచి వూరుకుంటే, ఆ సందర్భంలో శంకర శాస్త్రి ఆత్మాభి మానంతో ప్రవర్తించినట్టు ఎలా అవుతుంది? ఇది ‘ కూడా అతని పాత్ర చిత్రణలో లోపమే.
తులసి పాత్రలో కూడా ఒకటి రెండు చోట్ల ఇలాంటి లోపాలు వున్నాయి. ఆమె ఇంటి నించి పారి పోయి, శంకర శాస్త్రిని రైల్లో కలుసుకుని, ఆయనతో పాటు కన్నడ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆమె తల్లి వచ్చి శంకర శాస్త్రిని నానా దుర్భాష లాడుతుంది. అప్పుడు శంకర శాస్త్రికి జవాబు చెప్పుకోవలిసిన అవ సరం లేక పోవచ్చు గానీ, అంత మంది ముందు శంకర శాస్త్రికి అవమానం జరుగుతూ వుంటే, తులసి అక్కడ వున్న వాళ్ళకు నిజం చెప్పి, శంకర శాస్త్రిని ఇతరులు అపార్థం చేసుకోకుండా చెయ్యడానికి ప్రయత్నించాలి కదా? లేకపోతే శంకర శాస్త్రి మీద ఆమెకు ఎంతో భక్తి వుందనడం ఎలా కరెక్టు అవు తుంది? పాత్రల చిత్రణలో ఇలాంటి లోపాలు లేకుండా వుంటే ఇంకా బాగుండేది.
డబ్బుకి విలువ ఇవ్వని శంకర శాస్త్రి, కళనే నమ్ము కుని పేదవాడై పోయిన తర్వాత, “నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, పాడలేని రోజున” అంటాడు. నిజంగా అలా పాడలేని క్షణాలు ఆసన్నమైనప్పుడు ఆయన ఆ షాక్లో కన్ను మూస్తాడు. ఇది ఆ పాత్రకు తగిన సరైన ముగింపు. అలా మరణించకుండా వుంటే, ఆ పాత్ర చిత్రణ దెబ్బ తినేది.
సినిమా మొత్తానికి నాకు చాలా అసంతృప్తి కలిగించిన అంశం బాల సుబ్రమణ్యం పాటలు. వాటి ట్యూన్స్ బలం వల్ల అవి కొంత బాగున్నట్టనిపిస్తాయి గానీ, ఆ కంఠంలో గానీ, ఆ పాడిన విధానంలో గానీ, ఏమీ సౌందర్యం లేదు. “బ్రోచే వారెవరురా” లాంటి కీర్తనలు గాక, సినిమా కోసం రాసిన పాటల్లో కవిత్వం ‘ఏమీ బాగుండ లేదు. శంకర శాస్త్రి పాత్ర గాంభీ ర్యానికీ, (ఆయన గొప్ప సంగీత విద్వాంసుడని కధలో చెప్పిన దానికీ) ఆ పాటలకూ పొంతన కుదర లేదు. ఆ పాటల మీద గాక కధా చిత్రణలో ఇతర అంశాల మీదనే ఎక్కువ గౌరవం కలిగింది….

శంకర శాస్త్రి పాత్రలో ప్రత్యేకత, ఆయన సంగీత విద్వాంసుడు కావడం కాదు. సంగీత విద్వాంసులు చాలా మంది వుంటారు. ఈయన కన్నా కూడా గొప్ప విద్వాంసులు వుంటారు. అది కాదు గొప్పతనం. చిత్త శుద్దీ, ఆత్మ గౌరవం, కష్టాల్లో వున్న వారిని ఆదుకునే కరుణా స్వభావం, సమాజపు సంకుచితత్వాన్ని లక్ష్య పెట్టని ధీరత్వం, నమ్మిన లక్ష్యం నించి చలించని పట్టుదలా, సహజ గంభీరమైన ప్రవర్తనా లక్షణాలే ఆయన ప్రత్యేకత.

కర్ణాటక సంగీతాన్ని ఆదరించి ప్రోత్సహించాలి’ అనే విషయాన్నే ఈ చిత్రం చెప్పినప్పటికీ, ఈ చిత్రం బాగుందని అంగీకరించిన వాళ్ళందరూ, సంగీతం చెప్పే దైవ భక్తినీ, ఆ కీర్తనల కవిత్వంలో వుండే మూర్ఖ భావ జాలాన్నీ అంగీకరిస్తున్నారని అర్థం కాదు. కళారాధనకు అంకితమైన ఒక విద్వాంసుడి వున్నత గుణగణాల్నీ, వాటి సహజ చిత్రీకరణనీ చూసి సంతోషించడం మాత్రమే ఇది.
ఈ చిత్ర విజయం కేవలం ఆర్థికమైన విజయం మాత్రమే కాదు. కళా రంగంలో విజయం కూడా. మంచి కధ తీసుకుని, పాత్ర చిత్రణలోనూ, సంభాషణల్లోనూ సహజత్వాన్ని చెడనివ్వకుండా చిత్రం తీస్తే, అది తప్పకుండా సక్సెస్ అవుతుందనడానికి ఈ చిత్రమే సాక్ష్యం.

ఈ చిత్రాన్ని నిజ జీవితంలాగా చిత్రించిన దర్శకుడూ, సంభాషణల రచయితా, పాత్రధారులూ కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు. (ఈ అభినందన ఈ ఒక్క చిత్రానికి మాత్రమే వర్తిస్తుంది. ఇదే దర్శకుడు తీసిన ఇతర చిత్రాలకు గానీ, ఇదే రచయిత రాసిన ఇతర చిత్రాలకు గానీ,ఇదే పాత్రధారులు నటించిన ఇతర చిత్రాలకు గానీ, వర్తించదు.)

ఈ ఒక్క సినిమా ఆగమనం తోటే తెలుగు సినిమా స్థితి గతులు బాగుపడ్డాయని ఎంత మాత్రం భ్రమపడక్కర్లేదు.

[ ‘ఆంధ్ర జ్యోతి’ వార పత్రిక, ? – ? – 1980] *

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Foot note

“ఆ కంఠంలో గానీ, పాడిన విధానంలో గానీ, ఏమీ సౌందర్యం లేదు” అన్న వ్యాఖ్యలో న్యాయం లేదు అనిపిస్తోంది నాకు ఇప్పుడు. ఎందుకంటే: ‘కంఠం’ అనేది ప్రకృతి ద్వారా సంక్రమించే విషయం. ‘పాడిన విధానం’ అనేది, శక్తి సామర్థ్యాలకు సంబంధించినది. కంఠం – ఒక రకంగా వుండి, ఇంకో రకంగా లేనందుకు తప్పు పట్టలేము. అది ఆ మనిషి చేతిలో విషయం కాదు. అలాగే, పాడే విధానంలో శక్తి సామర్ధ్యాల సంగతి కూడా. ఒక మనిషికి, ఎంత శక్తి వుంటే అంతే వుంటుంది. అది కూడా ఆ మనిషి చేతిలో పని కాదు. ఉన్న కంఠంతోనే, ఉన్న శక్తి తోనే, ఆ మనిషి ప్రయత్నం ఎలా వుందో చూడాలి, అంతే. ఆ రకంగా చూస్తే, ఆ పాటలూ, వాటి కవిత్వాలూ అద్భుతంగా వున్నట్టే. కథ ప్రకారం, శంకర శాస్త్రి మంచి సంగీత కళా కారుడనీ, చక్కగా పాడతాడనీ, ఆ పాటల ద్వారానే, ఆ కవిత్వాల ద్వారానే ఊహించాలి.

– రంగనాయకమ్మ.

సేకరణ: పి జె సునీల్. (Sunil pilli fb) 4.2.2023

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions