.
Raghu Mandaati …. నేను ఎందుకు రాసుకుంటున్నాను ఇవన్నీ…
ధైర్యం కోసమా…
ఊరట కోసమా…
ఇంకా దేనికోసమైన వెంపర్లాటనా…
లేక నేను ఉన్నాననే ఆస్తిత్వాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నమా…
కొన్ని మాటలు ఎన్ని సార్లు మాట్లాడినా మనసు ఉప్పొంగుతుంది.
అదే ఇంకొన్ని మాటలు చెప్పిందే మళ్లీ చెబితే అసహనం, విసుగు పుట్టక మానదు.
మనసు కూడా ఒక విచిత్రమైన ప్రదేశం.
అది ఎప్పుడు ఏ భావాన్ని నిలుపుకుంటుందో…
ఏ జ్ఞాపకాన్ని బయటకు తోసేస్తుందో…
మనకే అర్థం కాని రహస్యాలతో నిండిపోయి ఉంటుంది.
Ads
కొన్నిసార్లు మనం రాస్తున్నది ప్రపంచానికి వినిపించాలనే కోరికతో కాదు.
మనలో మనం వినిపించుకోలేని కొన్ని స్వరాలను కాగితంతో విన్నవించుకోవడానికే.
మాట్లాడితే మధ్యలో ఎవరైనా అడ్డుకుంటారు.
వినేవాళ్లకు సమయం ఉండకపోవచ్చు.
అర్థం చేసుకునే మనసు కూడా ఉండకపోవచ్చు.
కానీ కాగితం మాత్రం ఎప్పుడూ అడ్డుకోదు.
అది మన బాధను కూడా అంతే శాంతంగా స్వీకరిస్తుంది…
మన ఆనందాన్ని కూడా అదే ఓర్పుతో నిలబెడుతుంది.
మనిషి జీవితంలో కొన్ని అనుభూతులు ఉంటాయి
వాటిని ఎవరికీ చెప్పలేం.
చెప్పినా పూర్తిగా అర్థం అవ్వవు.
అప్పుడు మనం రాయడం మొదలు పెడతాం.
రాస్తూ ఉంటే ఒక విచిత్రమైన నిశ్శబ్దం మనలో పుడుతుంది.
అది బాధ తగ్గిపోయిందనే కాదు…
కానీ ఆ బాధతో కలిసి జీవించడం నేర్చుకుంటున్నామనే సంకేతం.
బహుశా అందుకే మనిషి రాస్తాడు.
తనలోని గందరగోళాన్ని కొంచెం క్రమబద్ధం చేసుకోవడానికి.
తనలోని చీకటిలో ఒక చిన్న దీపం వెలిగించుకోవడానికి.
ఎవరైనా చదవాలి అనేది పెద్ద ఆశ కాదు.
కానీ ఎక్కడో ఒక మూలలో…
ఎప్పుడో ఒక రోజు…
ఎవరో ఒకరు ఈ అక్షరాల్లో తమ మనసును చూసుకుంటే చాలు అనిపించే ఆశ మాత్రం ఉంటుంది.
ఎందుకంటే…
మనిషి రాసే ప్రతి అక్షరం వెనుక
ఒక గాయం ఉంటుంది,
ఒక జ్ఞాపకం ఉంటుంది,
లేదా చెప్పలేని ఒక నిశ్శబ్దం ఉంటుంది.
ఇందుకేనా నేను కూడ రాస్తున్నాను.
ఎంతైనా మనిషి సంఘజీవి…
అలాగే మనిషి మాటలు కోరుకునే జీవి కూడా.
ఒంటరిగా ఉండగలుగుతాడు మనిషి…
కానీ పూర్తిగా నిశ్శబ్దంలో జీవించడం మాత్రం అతనికి సాధ్యం కాదు.
అందుకే చిన్నప్పటి నుంచే మనం మాటలతోనే పెరుగుతాం.
అమ్మ పలికే మొదటి మాటతో…
నాన్న అడిగే మొదటి ప్రశ్నతో…
మిత్రుల నవ్వులతో…
జీవితం ఒక్కో అక్షరంగా మనలో స్థిరపడుతుంది.
మాటలు కేవలం సంభాషణ కోసం మాత్రమే కాదు.
అవి మనిషి ఉనికికి కూడా ఒక గుర్తు.
ఎవరైనా మనల్ని అడిగితే
“ఎలా ఉన్నావు?”
అనే ఒక సాధారణ ప్రశ్న కూడా
మనసుకు ఎన్ని సార్లు ఓదార్పుగా మారుతుందో మనకే తెలుసు.
కొన్నిసార్లు మనం చెప్పే మాటలకంటే
ఎవరో ఓపికగా వినే చెవులు
మనసుకు ఎక్కువ ఉపశమనం ఇస్తాయి.
అందుకే మనిషి ఎప్పుడూ సంబంధాల వైపు పరుగెడతాడు.
స్నేహాల్ని కాపాడుకోవాలనుకుంటాడు.
ఎందుకంటే మాటలేని ప్రపంచం
మనసులేని ప్రపంచంలా అనిపిస్తుంది.
కానీ జీవితంలో ఒక దశ వస్తుంది
అప్పుడు మన మాటలు వినేవాళ్లు ఉన్నా
మనసును పూర్తిగా అర్థం చేసుకునేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు.
అప్పుడు మనిషి ఇంకో మార్గం వెతుకుతాడు.
మాటల్ని కాగితంపై ఉంచే మార్గం.
రాయడం అనేది కూడా ఒక సంభాషణే.
కానీ అది బయట ప్రపంచంతో కాకుండా
మనలోని మనతో చేసే సంభాషణ.
కాగితం ముందు మనిషి నటించాల్సిన అవసరం ఉండదు.
అక్కడ అహంకారం ఉండదు…
అక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు…
అక్కడ మనసు ఎలా ఉందో అలా బయటపడుతుంది.
బహుశా అందుకే
చాలా మంది మాట్లాడలేని బాధను
రాయగలుగుతారు.
ఎందుకంటే మాటల్లో చెప్పలేని నిజాలు
అక్షరాల్లో చాలా సహజంగా ప్రవహిస్తాయి.
కాబట్టి మనిషి సంఘజీవి అయినప్పటికీ
కొన్ని ప్రయాణాలు మాత్రం ఒంటరిగానే చేయాల్సి వస్తుంది.
ఆ ప్రయాణంలో
మాటలు తోడు లేకపోతే
అక్షరాలు తోడు అవుతాయి.
అప్పుడు రాయడం ఒక అలవాటు కాదు…
ఒక ఆశ్రయం అవుతుంది.
మరి నిజంగా చెప్పాలంటే
మనిషి ప్రపంచంతో మాట్లాడలేని రోజుల్లో
అతను అక్షరాలతో మాట్లాడటం మొదలు పెడతాడు.
బహుశా అందుకే
కొన్ని పేజీలు కాగితాలు కావు
అవి మనిషి మనసుకు అద్దం.
.
.
.
.
.
.
.
రఘు మందాటి
Share this Article