‘‘మేమెక్కడ అవమానించాం..?’’ అని కేటీయార్ అడుగుతున్నాడు… కానీ అవమానం అనేది నిజం… చివరకు ‘‘ఎక్కడ అవమానం జరిగిందో చెబితే వింటాం, అర్థం చేసుకుంటాం’’ అనే వ్యాఖ్యల్లో కూడా వెటకారం ధ్వనిస్తోంది… అయితే అర్థం కాని ప్రశ్న ఏమిటంటే..? కేసీయార్ ఎందుకు ఆమెను టార్గెట్ చేసి అవమానిస్తున్నాడు..? దీనివల్ల కేసీయార్‌కు వచ్చేదేముంది..? ఒక లేడీ గవర్నర్‌ను మరీ సంస్కారరహితంగా అవమానిస్తున్నారనే చెడ్డపేరు తప్ప..!!
గవర్నర్ తల్లి మరణిస్తే విమానం వాడుకోవడానికి అనుమతించకపోవడం, ఎవరూ రాకపోవడం, కనీసం పరామర్శించకపోవడం అమానవీయం… పొలిటికల్‌గా ఇష్యూస్ ఉంటే ఫైట్ చేయడం వేరు, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ వైరభావన ప్రదర్శించడం ఏరకంగా సమర్థనీయం… పదే పదే చెప్పుకోవడం దేనికి..? ప్రతి దశలోనూ గవర్నర్ పట్ల అవమానాలు కనిపిస్తూనే ఉన్నయ్… ఒక మోడీనో, ఒక అమిత్ షానో ఇరిటేట్ చేయడానికి గవర్నర్ పట్ల ఇలా వ్యవహరిస్తున్నారా..? బహుశా అది కారణం కాకపోవచ్చు… రాజకీయాల్లో మరీ ఈ స్థాయిలో హ్యుమిలియేట్ చేయడం వెనుక కేసీయార్ ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు…
పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి తిరస్కరణ అనేది కూడా పెద్ద కారణం కాకపోవచ్చు… కౌశిక్‌రెడ్డి మొన్నమొన్న టీఆర్ఎస్‌లోకి వచ్చాడు, అదీ హుజూరాబాద్ అవసరాల కోసం… అంతేతప్ప తనేమీ కేసీయార్ ఇగోకు పోవాల్సినంత ముఖ్యుడేమీ కాదు… గవర్నర్ ఒక కోటాలో తిరస్కరిస్తే ఇంకో కోటాలో అవకాశమిస్తారు, అది పెద్ద విషయమేమీ కాదు… పైగా కొన్ని సందర్బాల్లో గవర్నర్ ఇలాంటి నియామకాల్ని తిరస్కరించవచ్చు… గతంలో సమాచార కమిషన్ల నియామకంలో టీఆర్ఎస్ పదే పదే మెచ్చుకుంటున్న అదే నరసింహన్ కొర్రీలు వేయలేదా…
Ads
గవర్నర్ గవర్నర్‌లా ఉండాలి, బీజేపీ నాయకురాలిగా ఉండొద్దు… అనేది కూడా ఓ విఫల సమర్థన… దానికి నేను బీజేపీ నేతగా ఉండటం లేదంటూ ఆమె సంజాయిషీ చెప్పుకోవాల్సిన పని కూడా లేదు… గవర్నర్లుగా రాజకీయ నేతలే నియమింపబడతారు… కాకపోతే నేను తలుచుకుంటే సభ రద్దయ్యేది, ప్రభుత్వం పడిపోయేది అనే గవర్నర్ వ్యాఖ్యల్లో కూడా పరిణతి లేదు… టెక్నికల్‌గా బిల్లులు ఆపేయడం వంటి చర్యలకు పూనుకుంటే, అవి టీఆర్ఎస్‌కు ప్రాణం పోసేవి… కాస్తోకూస్తో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నెత్తిన పాలుపోసినట్టయ్యేది… ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీయే అంతిమంగా నష్టపోయేది…
రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఏర్పాటు, కొనసాగింపు, అవిశ్వాసం వంటి కీలక సందర్భాలు వచ్చినప్పుడు… అనిశ్చితి ఏర్పడినప్పుడు గవర్నర్ పాత్ర ప్రముఖంగా తెరమీదకు వస్తుంది… అప్పుడు కూడా గవర్నర్ అధికారాలు పరిమితమే… కేంద్ర హోం శాఖ, కేంద్రంలో అధికార పార్టీ తీసుకునే పొలిటికల్ స్టాండ్ ఆధారంగా గవర్నర్ వ్యవహరించాల్సి వస్తుంది… అంతకుమించి గవర్నర్లు ఏం చేయగలరు..? ప్రభుత్వాన్ని చికాకుపరచడంలో తమిళిసై ఒక చెన్నారెడ్డి కాలేదు… రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిపట్టడంలో మోడీ ఒక ఇందిరాగాంధీ కాలేడు…
అందుకే కేరళ, బెంగాల్‌లలో గవర్నర్లు కూడా విపరీతమైన హ్యుమిలియేషన్‌కు గురవుతున్నారు… ఆ గవర్నర్లకు కేంద్రం పెద్ద బాసటగా నిలుస్తున్న దాఖలాలు కూడా లేవు… అంతెందుకు..? సీఎస్ నుంచి యాదగిరిగుట్ట ఈవో దాకా ప్రతి లేయర్‌లోనూ అధికారులు గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు… కేంద్ర సర్వీసు అధికారులు తమ ప్రొటోకాల్ విధుల్ని ఉల్లంఘిస్తుంటే డీఓపీటీ ఏం చేస్తున్నది..? ఈ చర్చంతా పక్కన పెడితే… ఇంతకీ కేసీయార్‌కు గవర్నరమ్మ మీద మరీ ఇంత కోపం ఎందుకొచ్చింది..? అర్థంకాని ప్రశ్న..!!
Share this Article